ఆర్‌అండ్‌బీ స్థలాలు కబ్జా
ABN , Publish Date - Aug 25 , 2026 | 01:22 AM
అనకాపల్లి మండలంలో ప్రభుత్వ స్థలాలు, భూముల ఆక్రమణ రోజు రోజుకి పెరిగిపోతున్నది.
దర్జీనగర్ వద్ద రెచ్చిపోతున్న ఆక్రమణదారులు
అనకాపల్లి- చోడవరం రోడ్డు పక్కన యథేచ్ఛగా దుకాణాలు, ఇళ్ల నిర్మాణం
స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
తుమ్మపాల, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి):
అనకాపల్లి మండలంలో ప్రభుత్వ స్థలాలు, భూముల ఆక్రమణ రోజు రోజుకి పెరిగిపోతున్నది. ఆయా శాఖల అధికారుల నిర్లిప్తత, కిందిస్థాయి ఉద్యోగుల సహకారం, స్థానిక నేతల అండదండలతో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. కొండపోరంబోకు భూములు, గెడ్డలు, వాగులతోపాటు ప్రధాన రహదారి పక్కన ఖాళీ స్థలాలను ఆక్రమిస్తున్నారు.
అనకాపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పడిన తరువాత మండలంలో భూముల విలువ పెరిగింది. అనకాపల్లి నుంచి చోడవరం వెళ్లే ప్రధాన రహదారి పక్కన స్థలాలకు విపరీతమైన డిమాండ్ వుంది. ఇదే అదనుగా భావించిన కొంతమంది వ్యక్తులు రాజకీయ, అధికార పలుకుబడితో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారు. ఇటీవల అనకాపల్లి- చోడవరం రోడ్డును కోట్లాది రూపాయలతో విస్తరించి అభివృద్ధి చేయడంతో రోడ్డు పక్కనున్న స్థలాల విలువ భారీగా పెరిగింది. సెంటు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ధర పలుకుతున్నది. బవులవాడ పంచాయతీ పరిధిలో ఆర్‌అండ్‌బీ రహదారికి ఇరువైపులా వంద అడుగుల మేర ఖాళీ స్థలం వుంది. దీంతో దర్జీనగర్ కాలనీ వద్ద ఆర్‌అండ్‌బీ స్థలాలను దర్జాగా ఆక్రమించి దుకాణాలు, ఇళ్లు నిర్మిస్తున్నారు. వీటిని అద్దెలకు ఇచ్చి సొమ్ము గడిస్తున్నారు. మరికొందరు పట్టా స్థలాలుగా నమ్మబలుకుతూ సెంట్ల చొప్పున విక్రయిస్తున్నారు. ఒక్కొక్కరు మూడు నుంచి పది సెంట్ల వరకు కబ్జా చేశారు. ప్రధాన రహదారి పక్కన యథేచ్ఛగా ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు సాగుతున్నప్పటికీ ఆర్‌అండ్‌బీ అధికారులు కనీస చర్యలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. కబ్జాదారులకు అటు కూటమి, ఇటు వైసీపీ నేతల అండదండలు వున్నట్టు ప్రచారం జరుగుతున్నది. దర్జీనగర్ కాలనీ వద్ద ఆర్‌అండ్‌బీ స్థలాల ఆక్రమణలపై కొంతమంది స్థానికులు పంచాయతీ నుంచి కలెక్టరేట్ వరకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇంతవరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఆక్రమణలను తొలగిస్తాం.... ఆనందరావు, తహశీల్దార్
అనకాపల్లి- చోడవరం రోడ్డులో దర్జీనగర్ వద్ద ఆర్‌అండ్‌బీ స్థలాలను ఆక్రమించి దుకాణాలు, ఇళ్లు నిర్మిస్తున్న విషయం సంబంధిత శాఖ అధికారుల ద్వారా మా దృష్టికి వచ్చింది. అంతేకాక ఆయా స్థలాల్లో అక్రమ నిర్మాణాలపై స్థానికులు పీజీఆర్‌ఎస్‌లో చేసిన ఫిర్యాదులు తదుపరి చర్యల నిమిత్తం మా కార్యాలయానికి వచ్చాయి. ఆర్‌అండ్‌బీ అధికారుల సమక్షంలో సర్వే నిర్వహించి, ఆక్రమణలను తొలగిస్తాం. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.