Share News

సమస్యల సుడిలో ఆర్‌అండ్‌బీ

ABN , Publish Date - Aug 10 , 2026 | 12:52 AM

రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని రహదారులు బాగు చేయాలని, గడువులోగా పనులు పూర్తి చేయాలని ఒక పక్క ప్రభుత్వం తరచూ మౌఖికంగా ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా వున్నాయి.

సమస్యల సుడిలో ఆర్‌అండ్‌బీ
చోడవరంలో అధ్వాన్నంగా ఉన్న బీఎన్‌ రోడ్డు

వేధిస్తున్న సిబ్బంది కొరత

పలు సెక్షన్లలో ఏఈ పోస్టులు ఖాళీ

ఇతర ఏఈలకు అదనపు బాధ్యతలు

కొరవడిన రహదారుల నిర్వహణ పనులు

చోడవరం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని రహదారులు బాగు చేయాలని, గడువులోగా పనులు పూర్తి చేయాలని ఒక పక్క ప్రభుత్వం తరచూ మౌఖికంగా ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా వున్నాయి. ఒక పక్క కాంట్రాక్టర్ల నిర్లిప్తత, మరోవైపు ఆర్‌అండ్‌బీలో ఇంజనీర్లు, క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత కారణంగా ప్రభుత్వం మంజూరు చేసిన పనులు ముందుకు సాగడంలేదు. ఆర్‌అండ్‌బీలో పరిస్థితులు ఇప్పట్లో మెరుగుపడేలా కనిపించడం లేదు. జిల్లాలో మూడు సబ్‌ డివిజన్లలోని ఆరు సెక్షన్లలో ఏఈల పోస్టులు ఖాళీగా వున్నాయి. ఒక్కో ఏఈ మూడు సెక్షన్లలో పనులను పర్యవేక్షించాల్సి వుండడంతో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదు. గతంలో ఆర్‌అండ్‌బీలో ఏఈలతోపాటు, దిగువ స్థాయిలో పనుల పర్యవేక్షణకు వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, గ్యాంగ్‌ మజ్దూర్లు వుండేవారు. ఎక్కడైనా రోడ్డు పాడేతే సంబంధిత వర్కు ఇన్‌స్పెక్టర్‌ లేదా ఏఈ, గ్యాంగ్‌ మజ్దూర్లతో ప్యాచ్‌ వర్కులు చేయించేవారు. రోడ్డుపైన కురిసిన వర్షం నీరు సాఫీగా పక్కనున్న కాలువల్లోకి పోయేలా రహదారికి ఇరువైపులా పేరుకుపోయిన మట్టిని తొలగించేవారు. రహదారులపై నీరు నిల్వ లేకపోవంతో ఎక్కువ కాలం మన్నికగా వుండేవి. ఆర్‌అండ్‌బీ స్థలాల్లో ఆక్రమణలను వెంటనే తొలగించేవారు. కాలక్రమంలో ఆర్‌అండ్‌బీలో వర్కు ఇన్‌స్పెక్టర్ల నియామకాలు నిలిచిపోయాయి. దిగువ స్థాయిలో గ్యాంగ్‌ మజ్దూర్ల వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు. దీంతో రహదారుల నిర్వహణ భారమంతా ఏఈలపై పడింది. రహదారుల అభివృద్ధి పనులే కాకుండా గోతులు పూడ్చడం వంటి నిర్వహణ పనులకు సైతం కాంట్రాక్టర్లపై ఆధారపడాల్సి పరిస్థితి నెలకొంది. ఎక్కడైనా రోడ్డు దెబ్బతిన్నా, రోడ్డుపై నీరు నిల్వ ఉన్నా పట్టించుకునే వారు లేకపోయారు. నిర్వహణ పనులకు నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో ఈ పనులు చేయడానికి కాంట్రాక్టర్లు విముఖత చూపుతున్నారు. ఫలితంగా రహదారులకు నిర్వహణ పనులు జరగడంలేదు.

ఏఈల కొరత

అనకాపల్లి సబ్‌ డివిజన్‌లో అనకాపల్లి, సబ్బవరం, చోడవరం, దేవరాపల్లి కె.కోటపాడు సెక్షన్లు ఉన్నాయి. వీటిలో కె.కోటపాడు దేవరాపల్లి, అనకాపల్లి సెక్షన్లలో ఏఈలు లేరు. దీంతో సబ్బవరం ఏఈనే ఈ మూడు సెక్షన్ల బాధ్యతలు కూడా చూడాల్సి వస్తున్నది. నర్సీపట్నం సబ్‌ డివిజన్‌లో నర్సీపట్నం, బొడ్డుపల్లి, కృష్ణాదేవిపేట, మాడుగుల సెక్షన్లు వున్నాయి. బొడ్డుపల్లి సెక్షన్‌ ఏఈ పోస్టు ఖాళీగా వుండడంతో నర్సీపట్నం ఏఈ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎలమంచిలి సబ్‌ డివిజన్‌లో ఎలమంచిలి, అచ్యుతాపురం, పరవాడ, పాయకరావుపేట, నక్కపల్లి సెక్షన్లు వున్నాయి. పాయకరావుపేట, నక్కపల్లిల్లో ఏఈ పోస్టులు ఖాళీగా వున్నాయి. ప్రస్తుతం ఎలమంచిలా ఏఈ పాయకరావుపేటకు, పరవాడ ఏఈ నక్కపల్లికి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వర్కు ఇన్‌స్పెక్టర్లు లేకపోవడం, ఏఈలు ఇతర సెక్షన్ల బాధ్యతలు నిర్వహించాల్సి రావడంతో క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులపై పర్యవేక్షణ కొరవడింది.

Updated Date - Aug 10 , 2026 | 12:52 AM