Share News

రేషన్‌ బియ్యం మాఫియాతో లాలూఛీ

ABN , Publish Date - May 07 , 2026 | 01:12 AM

ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చించి పేదల కోసం పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం అడ్డదారుల్లో బయటకు వెళుతున్నాయి. ఈ అక్రమ వ్యవహారంలో భాగస్వామ్యులైన వారిని శిక్షించాల్సిన బాధ్యత అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులకు ఉంది. అయితే నగరంలో కూటమికి చెందిన నేత ఒకరు...వ్యాపారులను పిలిచి మందలించాల్సింది పోయి, వ్యవహారం సాఫీగా నడవాలంటే తనకు ప్రతి నెలా మామ్మూళ్లు ఇవ్వాలని హుకుం జారీచేసినట్టు ప్రచారం జరుగుతోంది. మూడు, నాలుగు రోజుల క్రితం ఈ సమావేశం జరిగినట్టు తెలిసింది.

రేషన్‌   బియ్యం మాఫియాతో  లాలూఛీ

నాలుగు రోజుల కిందట వ్యాపారులతో కూటమి నేత సమావేశం

నెలకు తనకు రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌

లేనిపక్షంలో వ్యాపారం జరగనివ్వబోనని హెచ్చరిక

కొంత మొత్తం అడ్వాన్స్‌గా అందజేసినట్టు ప్రచారం

అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవాల్సింది పోయి వాటా అడగడమేమిటనే ప్రశ్నలు

విశాఖపట్నం, మే 6 (ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చించి పేదల కోసం పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం అడ్డదారుల్లో బయటకు వెళుతున్నాయి. ఈ అక్రమ వ్యవహారంలో భాగస్వామ్యులైన వారిని శిక్షించాల్సిన బాధ్యత అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులకు ఉంది. అయితే నగరంలో కూటమికి చెందిన నేత ఒకరు...వ్యాపారులను పిలిచి మందలించాల్సింది పోయి, వ్యవహారం సాఫీగా నడవాలంటే తనకు ప్రతి నెలా మామ్మూళ్లు ఇవ్వాలని హుకుం జారీచేసినట్టు ప్రచారం జరుగుతోంది. మూడు, నాలుగు రోజుల క్రితం ఈ సమావేశం జరిగినట్టు తెలిసింది.

నగరంలో ఎక్కువగా సామాన్య జనం ఉండే ఈ ప్రాంతంలో రేషన్‌ డిపోలు చాలా వరకు బినామీలు నిర్వహిస్తున్నారు. కార్డుదారులకు కిలోకు రూ.13 నుంచి రూ.15 వరకు ఇచ్చి బియ్యాన్ని డీలర్లే కొనుగోలు చేస్తుంటారు. వారి నుంచి కొందరు వర్తకులు కొనుగోలు చేసి మిల్లర్లకు అమ్ముతుంటారు. ఆ ప్రాంతం నుంచి ప్రతి నెలా 1,000 నుంచి 1,200 టన్నుల రేషన్‌ బియ్యం నగర శివార్లు, విజయనగరం జిల్లాలోని మిల్లర్లకు వెళుతుంటుంది. ఇందుకు అడుగడుగునా లంచాలు చెల్లిస్తుంటారనేది బహిరంగ రహస్యం.

అయితే గతంలో రైస్‌ మిల్లుల యజమానులతో కలిసి పనిచేసిన వ్యక్తి ఒకరు ఇటీవల కూటమి నేత వద్దకు చేరారు. రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారం గురించి చెప్పారు. వ్యాపారులను పిలిచి పంచాయితీ పెడితే నెలకు రూ.10 లక్షల వరకు వస్తాయని ఆశ చూపించారు. వ్యాపారులు దారికి రావాలనే ఉద్దేశంతో మధ్యలో రెండు, మూడు పర్యాయాలు నగరం నుంచి బయటకు వెళ్లే బియ్యం వాహనాలను కూటమి నేత ద్వారా పోలీసులకు చెప్పి పట్టించారు. దీంతో ఆ ప్రాంతంలో రేషన్‌ బియ్యం కొనుగోలు చేసే పలువురు వ్యాపారులు...కూటమి నేత మనుషులను కలిశారు. అక్రమ రవాణా వ్యవహారం గురించి తమకు తెలుసునని, నెలకు రూ.10 లక్షలు ఇవ్వాలని లేకపోతే వ్యాపారం చేయనివ్వబోమని వారు బెదిరించారు. చివరకు సదరు నాయకుడితో మూడు, నాలుగు రోజుల క్రితం బియ్యం వ్యాపారులు సమావేశమయ్యారు. ఇద్దరు, ముగ్గురు రేషన్‌ డీలర్లు కూడా వెళ్లారు. తనకు ప్రతి నెలా రూ.10 లక్షలు ఇవ్వాల్సిందేనన్న సదరు నేత...ఇందుకు క్షేత్రస్థాయిలో వ్యాపారులకు ఇచ్చే మొత్తంలో కిలోకు అర్ధరూపాయి తగ్గించుకోవాలని సలహా ఒకటి ఇచ్చారు. అధికార పార్టీకి చెందిన నేతతో ఎందుకొచ్చిన గొడవ అని భావించారేమో తొలుత కొంత మొత్తం అడ్వాన్స్‌గా ఇచ్చేశారు. సమావేశానికి హాజరైన డీలర్లు ఈ విషయాన్ని నగరంలో పలువురి డీలర్లకు తెలియజేయడంతో మూడు రోజుల నుంచి ఈ విషయమై చర్చ సాగుతుంది. రేషన్‌ బియ్యం అమ్మకం, కొనుగోలు నేరం. అటువంటి వ్యవహారంలో భాగస్వామ్యులైన వ్యాపారులను పిలిచి తలంటాల్సిన కూటమి నేత వారితో సమావేశమై వాటా అడగడమేమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పోలీసులు, విజిలెన్స్‌, పౌరసరఫరాల అధికారులతో సమావేశం పెట్టి అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవాలని ఆదేశించాలి గానీ, తనకు సొమ్ములు ఇవ్వకపోతే వ్యాపారం చేయనివ్వనని బెదిరించడం ఎంత వరకు సమంజసమనే వాదన వ్యక్తమవుతుంది. దీనిపై ఇప్పటికే నిఘా వర్గాలు సమాచారం సేకరించి ప్రభుత్వానికి చేరవేశారని చెబుతున్నారు.

Updated Date - May 07 , 2026 | 01:12 AM