Share News

రేషన్‌ డీలర్ల ఇష్టారాజ్యం

ABN , Publish Date - Feb 01 , 2026 | 01:29 AM

నగరంలో కొందరు రేషన్‌ డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

రేషన్‌ డీలర్ల ఇష్టారాజ్యం

ముందుగానే సరుకుల పంపిణీ

వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్ద సరుకుల పంపిణీ చేసేందుకు గల వెసులుబాటు దుర్వినియోగం

బియ్యానికి బదులు నగదు పంపిణీ

పోర్టబిలిటీ మితిమీరిన వినియోగంపై పౌరసరఫరాల శాఖ ఆరా

నేటి నుంచి కార్డుదారులకు సరుకులు పంపిణీ

విశాఖపట్నం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి):

నగరంలో కొందరు రేషన్‌ డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గడువు కంటే ముందుగానే కార్డుదారుల ఇళ్లకు వెళ్లి సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి ఒక్కొక్క డీలర్‌ టన్ను నుంచి మూడు, నాలుగు టన్నుల బియ్యం ఇప్పటికే పంపిణీ చేసేశారు. ఈ విషయాన్ని కొందరు డీలర్లు గుర్తించి పౌర సరఫరాల శాఖకు సమాచారం అందించారు.

ఎండీయూ వ్యవస్థ రద్దుతో వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే రేషన్‌ సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రతి నెలా 26వ తేదీ నుంచి నెలాఖరు వరకూ వారికి సరుకులు అందజేయాల్సి ఉంది. ఇందుకుగాను ఈ-పోస్‌ మిషన్‌లో తగిన ఏర్పాట్లుచేశారు. అయితే ఆ మెషీన్‌లో వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే సరుకులు ఇవ్వాలన్న ఆప్షన్‌ లేకపోవడంతో డీలర్లు కొందరు...రెగ్యులర్‌ కార్డుదారులకు కూడా సరుకులు పంపిణీ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం రెగ్యులర్‌ బియ్యం కార్డుదారులకు ప్రతి నెలా ఒకటి నుంచి 15వ తేదీ వరకూ డిపోల్లో బియ్యం, పంచదార, గోధుమపిండి, రాగులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ నగరంలో కొందరు ఒకటోతేదీ కంటే ముందుగానే కార్డుదారుల ఇళ్లకు ఈ-పోస్‌ మిషన్‌తో వెళ్లి వేలిముద్రలు తీసుకుని సరుకులు పంపిణీ చేస్తున్నారు. మెజారిటీ కార్దుదారులకు బియ్యానికి బదులు నగదు అందజేస్తున్నారు. సర్కిల్‌-1 పరిధిలోని వన్‌టౌన్‌ ఏరియాలో కొందరు, మిగిలిన ప్రాంతాల్లో మరికొందరు ఈనెల 26వ తేదీ నుంచి శనివారం వరకూ బియ్యం పంపిణీ చేశారు. వన్‌టౌన్‌ ఏరియాలో బినామీ డీలర్లే (ఒరిజనల్‌ డీలరు నుంచి డిపో అనధికారికంగా తీసుకునే వ్యక్తులు) ఎక్కువగా ఉన్నారు. దీనిపై కొందరు డీలర్లు ఇచ్చిన సమాచారంతో పౌర సరఫరాల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా ముందుగా సరుకులు పంపిణీ చేసిన డిపోల వివరాలు సేకరించారు. వారికి తొలుత నోటీసులు ఇచ్చి ఆ తరువాత చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

ఇదిలావుండగా పోర్టబిలిటీని కొందరు డీలర్లు దుర్వినియోగం చేస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ గుర్తించింది. పొరుగు జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన కార్డుదారులకు సరుకులు పంపిణీ కోసం పోర్టబిలిటీ అమలు చేస్తున్నారు. అయితే నగరంలో ఒక డిపో పరిధిలో ఉన్న కార్డుదారులకు ఆ పక్క వీధి డీలర్‌ సరుకులు ఇస్తున్నారు. ఈ విషయంలో డీలర్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఫిబ్రవరి నెలలో ఎవరి పరిధిలో కార్డుదారులు వారు మాత్రమే సరుకులు ఇవ్వాలని డీలర్లకు అధికారులు తాజాగా ఆదేశించారు. ఆదివారం నుంచి జిల్లాలో 642 డిపోల ద్వారా 5.17 లక్షల కార్డుదారుల్లో వృద్ధులు, దివ్యాంగులకు తప్ప మిగిలిన వారికి డిపోల్లో సరుకులు పంపిణీ ప్రారంభమవుతుందని జిల్లా పౌరసరఫరాల అధికారి వి.భాస్కర్‌ తెలిపారు. బియ్యంతోపాటు ఒక కార్డుదారుడికి కిలో గోధుమపిండి, రాగులు, పంచదార అందజేస్తారన్నారు. ఇందుకోసం జిల్లాకు 440 టన్నుల గోధుమపిండి, 330 టన్నుల రాగులు డిపోలకు అందజేశామన్నారు.

Updated Date - Feb 01 , 2026 | 01:30 AM