పాడేరు ప్రభుత్వాస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స
ABN , Publish Date - Mar 10 , 2026 | 11:12 PM
పాడేరు ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు మంగళవారం అరుదైన శస్త్ర చికిత్స చేశారు. థైరాయిడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న గిరిజన యువతికి విజయవంతంగా ఆపరేషన్ చేశారు.
థైరాయిడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న యువతికి విజయవంతంగా ఆపరేషన్
పాడేరురూరల్, మార్చి 10(ఆంధ్రజ్యోతి): పాడేరు ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు మంగళవారం అరుదైన శస్త్ర చికిత్స చేశారు. థైరాయిడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న గిరిజన యువతికి విజయవంతంగా ఆపరేషన్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను వైద్యులు విలేకరులకు వెల్లడించారు. మండలంలోని లింగాపుట్టు గ్రామానికి చెందిన పలాసి శైలు(24) కొంత కాలంగా మెడవాపు సమస్యతో బాధపడుతోంది. పాడేరు ప్రభుత్వాస్పత్రికి వచ్చిన ఆమెకు వైద్యులు క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహించారు. ఆమె పాపిల్లరీ కార్సినోమా ఆఫ్ థైరాయిడ్‌తో బాధపడుతోందని గుర్తించారు. క్యాన్సర్ అప్పటికే మెడ ఎడమ వైపు ఉన్న లింఫ్ నోడ్‌లకు కూడా వ్యాపించిందని వైద్యులు నిర్ధారించారు. పరిస్థితి తీవ్రతను గమనించిన వైద్య బృందం వెంటనే శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించింది. అత్యంత సంక్లిష్టమైన టోటల్ థైరాయిడెక్టమీతో పాటు మోడిఫైడ్ రాడికల్ నెక్ డిసెక్షన్ పద్ధతిలో ఆపరేషన్ చేశారు. ఈ ప్రక్రియలో థైరాయిడ్ గ్రంధితో పాటు క్యాన్సర్ సోకిన మెడలోని లింఫ్ నోడ్‌లను అత్యంత జాగ్రత్తగా తొలగించారు. సాధారణంగా ఇటువంటి క్లిష్టమైన సర్జరీలు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో మాత్రమే జరుగుతుంటాయని, ఇప్పుడు పాడేరు ప్రభుత్వాస్పత్రిలోనే ఈ స్థాయి చికిత్సలు అందించడం తమకు గర్వకారణమని వైద్యులు తెలిపారు. ఈ శస్త్ర చికిత్సలో వైద్య నిపుణులు, సహాయక సిబ్బంది కె.శ్రీనివాస్, ఎస్‌బీ రత్నకిశోర్, కేవీఎన్ రమేశ్, విజయకుమార్, అనూఫ్ శశిధర్, హేమంత్, మనోజ్, సందీప్, సంగీత, సతీశ్, ఉష, పుండరీబాబు, ప్రవీణ్, శ్రీకృష్ణ, అస్లాం పాల్గొన్నారు.