ప్రగతి పరుగులు
ABN , Publish Date - Aug 16 , 2026 | 01:11 AM
త్యాగమూర్తుల ఫలితమే మనకు స్వాతంత్య్రం దక్కిందని, వారి స్ఫూర్తితో జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. స్థానిక తలారిసింగి ఆశ్రమ పాఠశాల మైదానంలో శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడారు. స్వాతంత్య్రం సిద్ధించేందుకు త్యాగం, కృషి చేసిన ప్రతి ఒక్కరికీ నివాళులు అర్పిస్తున్నానన్నారు.
జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
స్వాతంత్య్ర దినోత్సవాల్లో జిల్లా కలెక్టర్ నిషాంతి
1,22,984 మందికి తల్లికి వందనం
1,23,812 మంది విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ
జిల్లా ఆస్పత్రికు క్రిటికల్ కేర్ యూనిట్ మంజూరు
73,549 మందికి సామాజిక పింఛన్లు
జిల్లాలో 83,680 మంది ఆర్గానిక్ రైతులు
జలధార-జలహారతిలో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానం
పాడేరు, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి):
త్యాగమూర్తుల ఫలితమే మనకు స్వాతంత్య్రం దక్కిందని, వారి స్ఫూర్తితో జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. స్థానిక తలారిసింగి ఆశ్రమ పాఠశాల మైదానంలో శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడారు. స్వాతంత్య్రం సిద్ధించేందుకు త్యాగం, కృషి చేసిన ప్రతి ఒక్కరికీ నివాళులు అర్పిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాతో ఎంతో అనుబంధమున్న విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు, కందాళ సుబ్రహ్మణ్యం తిలక్, తెన్నేటి విశ్వనాఽథం, దిగుమర్తి రామస్వామి, కేఎస్.గుప్త, ఆదివాసీ యోధులు గాం గంటందొర, గాం మల్లుదొర, బోనంగి పండుపడాల్, మర్రికామయ్య, పనసల లొద్దిపడాల్, తగ్గి వీరయ్యదొరల సేవలను కలెక్టర్ ప్రస్తావించారు. పిన్న వయస్సులోనే అల్లూరి సీతారామరాజు స్వాతంత్య్రం కోసం ఆంగ్లేయులతో చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా కలెక్టర్ నిషాంతి వివరించారు. ఆయన నడచిన నేలలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా అల్లూరి సీతారామరాజు జిల్లాను ఏర్పాటు చేసి, అనేక పథకాలను అమలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల, ఉద్యోగులు, మీడియా, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
స్వర్ణాంధ్ర-2047 సాధన ధ్యేయంగా ముందుకు..
వికసిత్ భారత్‌లో భాగంగా స్వర్ణాంధ్ర-2047 సాధనే లక్ష్యంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. పీ4లో భాగంగా 1 లక్షా 310 పేద కుటుంబాలకు మేలు చేసేందుకు చర్యలు, తల్లికివందనంలో 1 నుంచి 12 తరగతులకు చెందిన 1,22,984 మంది విద్యార్థులకు రూ.13 వేలు చొప్పున అందజేత, ఏఎన్‌ఆర్ ఆనందం పేరిట విద్యాలయాల్లోని యోగ, వ్యాయామం, సృజనాత్మకత, సాంస్కృతిక వికాసానికి చర్యలు చేపడుతున్నామన్నారు. సమగ్ర శిక్షలో రూ.106 కోట్లతో 41 హాస్టల్ భవనాల నిర్మాణం, రూ.1 కోటి 9 లక్షలతో 73 స్కూళ్లకు విద్యుత్ సదుపాయం, 29 బాలికల స్కూళ్లకు మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందన్నారు. రూ.30 కోట్ల 95 లక్షల వ్యయంతో 1,23,812 మంది విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కిట్లు అందజేత, సూపర్-50 పేరిట ఎంపిక చేసిన వంద మంది టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక బోధన సాగిస్తున్నామన్నారు. వైద్యారోగ్యశాఖ ద్వారా ప్రణాళికాబద్ధంగా ప్రత్యేక వైద్య శిబిరాలు, రోగులకు మెరుగై వైద్య సేవలు అందిస్తున్నామని, గర్భిణులు, బాలికలు, చిన్నారులు, సికిల్ సెల్ ఎనీమియా బాధితుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నామన్నారు. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్‌గా పాడేరులో రూ.500 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతుందని, జిల్లా ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణానికి పీఎం-అభిమ్‌లో భాగంగా రూ.23.75 కోట్లు మంజూరయ్యాయన్నారు. జిల్లాను ఆర్గానిక్ జోన్‌గా తీర్చిందిద్ధేందుకు చేపడుతున్న చర్యలతో ఇప్పటికే 83,680 మంది రైతులు 94,294 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్నారని, ఈ-పంట నమోదులో వివిధరకాల పంటలకు సంబంధించి 2,66,687 ఎకరాలు నమోదైందన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా రూ.11.8 కోట్ల రాయితీపై విత్తనాలు, రూ.485 కోట్ల వ్యవసాయ రుణాలు అందించనున్నామన్నారు. జిల్లాలో కాఫీ, మిరియాలతోపాటు యాలకులు వంటి సుగంధ్ర ద్రవ్యాల సాగు ప్రారంభించామన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, పట్టుపరిశ్రమ, మత్స్యశాఖ, పశు సంవర్థక శాఖల ద్వారా గిరిజన రైతులకు అవసరమైన పథకాల అమలు, ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. ఐటీడీఏ ద్వారా కాఫీ సాగు, చిన్న నీటిపారుదల శాఖ, మైక్రో ఇరిగేషన్ ద్వారా రైతులకు అవసరమైన సాగు నీటి సదుపాయాల కల్పన, జీకేవీధి, జి.మాడుగులలో కాఫీ ఎకో ఫల్పింగ్ యూనిట్లు ఏర్పాటు, డీఆర్‌డీఏ ద్వారా 73,549 మంది లబ్ధిదారులకు రూ.31,39 కోట్లతో ఎన్‌టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు, 145 స్వయం సహాయక సంఘాలకు రూ.1.72 కోట్ల రుణాలు అందించామన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం, వైద్య సేవలు అందించడంతోపాటు కిషోర వికాసం ద్వారా బాలికలకు జీవన నైపుణ్యాలు అందిస్తున్నామన్నారు. పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమం, రోడ్ల భవనాలు వంటి ఇంజనీరింగ్ శాఖల ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, భవనాలు, రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని, గ్రామీణా నీటి సరఫరా విభాగం ద్వారా జల్ జీవన్ మిషన్ అమలు చేసి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికీ తాగునీటి కొళాయిలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం, వీబీ జీరామ్‌జీ పథకంలో లక్ష ఎకరాల్లో తోటల పెంపకం, జలధార-జలహారతి కార్యక్రమంలో అధిక సంఖ్యలో పనులు చేపట్టి రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. గృహనిర్మాణ సంస్థ ద్వారా ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చే దిశగా చర్యలు చేపడుతున్నామని, అధికారుల్లో మరింత ఉత్సాహం పెంచేందుకు ప్రతి వారం ఒక ఉత్తమ అఽధికారిని గుర్తించి సత్కరించడం, పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీలకు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లోనే జిల్లాను అన్నింటా అగ్రగామిగా నిలిపేందుకు అందరి సమన్వయంతో కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి పేర్కొన్నారు.
15పిడిఆర్ 7: గిరిజన విద్యార్థుల ధింసా నృత్య ప్రదర్శన
15పిడిఆర్ 12: వైద్యారోగ్య శాఖ శకట ప్రదర్శన
అలరించిన విద్యార్థుల ప్రదర్శనలు
ఆకట్టుకున్న ప్రభుత్వ శాఖల శకటాలు
సమరయోధుల కుటుంబీకులకు సత్కారం
పాడేరు, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి):
జిల్లా కేంద్రంలోని 80వ స్వాతంత్య్ర దినోత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక తలారిసింగి ఆశ్రమ పాఠశాలలో జిల్లా కలెక్టర్ టి.నిషాంతి ముఖ్యఅతిథిగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసులు, విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. క అనంతరం స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబీకులకు చెందిన పలువురికి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.
అలరించిన విద్యార్థుల ప్రదర్శనలు
స్వాతంత్య్ర దినోత్సవాల్లో గిరిజన విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందర్ని ఆకట్టుకున్నాయి. తలారిసింగి ఇంగ్లీష్ మీడియం స్కూల్ బాలికల ధింసా, తలారిసింగి ఆశ్రమ పాఠశాల బాలురు అల్లూరి సీతారామరాజు నాటిక, గౌతమీ స్కూల్ బాలికల రక్షణ స్కిట్, పాడేరు, చింతపల్లి బాలసదనం బాలికల దేశభక్తి ప్రదర్శన, సైబర్ నేరాలపై జి.మాడుగుల ఆశ్రమ పాఠశాల బాలుర ప్రదర్శన, లోచలిపుట్టు ఆశ్రమ పాఠశాల బాలురు దేశభక్తి ప్రదర్శన, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా శ్రీకృష్ణాపురం ఆశ్రమ పాఠశాల బాలికల ప్రదర్శనలు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల కవాతు ఆకట్టుకున్నాయి. ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటుచేసిన శకటాలు, స్టాళ్లు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వ్యవసాయ, ఉద్యానవన, గృహ నిర్మాణం, ఏపీఈపీడీసీఎల్, విద్య, వైద్యారోగ్య శాఖ, డీఆర్‌డీఏ, జీసీసీ, అటవీ శాఖలు తమ శకటాలను ప్రదర్శించారు. అటవీ శాఖ, కాఫీ బోర్డు, డీఆర్‌డీఏ, వైద్యారోగ్యశాఖ, గంజాయి నిర్మూలనపై పోలీస్, ఐసీడీఎస్, పట్టుపరిశ్రమ, జీసీసీ, సమాచార శాఖ, వీడీవీకే స్టాల్స్‌ను ఏర్పాటుచేశారు. పోలీసు జాగిలం రాఖీ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈకార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఇన్‌చార్జి ఎస్‌పీ పంకజ్‌కుమార్ మీనా, డీఎస్‌పీ వి.రాజసింహారెడ్డి, డీఎఫ్‌వో ఉమామహేశ్వరి, డీఆర్‌వో ఎంవీఎస్.లోకేశ్వరరావు, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ స్వామినాయుడు, డీఆర్‌డీఏ పీడీ జయకృష్ణ, డీఎల్‌పీవో పీఎస్.కుమార్, డీపీఆర్‌వో అన్నమ్మ, డివిజనల్ పీఆర్‌వో కె.వెంకటరావు, అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.