Share News

సర్‌వేగంగా ప్రక్రియ

ABN , Publish Date - Jul 06 , 2026 | 11:02 PM

భారత ఎన్నికల సంఘం ఆదేశాలతో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించిన విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై సస్పెన్షన్‌ వేటు తప్పదని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి టి.నిషాంతి హెచ్చరించారు.

సర్‌వేగంగా ప్రక్రియ
చింతలవీధి సచివాలయంలో సర్‌పై ఆరా తీస్తున్న కలెక్టర్‌ టి.నిషాంతి

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదు

కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి టి.నిషాంతి హెచ్చరిక

నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం

పాడేరు, జూలై 6 (ఆంధ్రజ్యోతి): భారత ఎన్నికల సంఘం ఆదేశాలతో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించిన విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై సస్పెన్షన్‌ వేటు తప్పదని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి టి.నిషాంతి హెచ్చరించారు. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించిన పనులకు కోసం అడిషనల్‌ ఎలక్టోరోల్‌ ఆఫీసర్లుగా నియమితులైన వారంతా అప్పగించిన పనుల్లో భాగస్వాములు కావాలన్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో తమకు అప్పగించిన పనుల నుంచి గైర్హాజరైనా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా అత్యంత తీవ్రంగా పరిగణించి వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు. విధులు సక్రమంగా నిర్వహించాలనే దానికి ఇదే ఆఖరి హెచ్చరికని, ఇకపై ఎటువంటి హెచ్చరికలు, నోటీసులు లేకుండా నేరుగా బాధ్యులపై సస్పెన్షన్‌ వేటు పడుతుందని కలెక్టర్‌ హెచ్చరించారు. అలాగే ఎన్నికలకు సంబంధించిన పనులను అప్పగిస్తే పలువురు గైర్హాజరవుతున్నారని, అటువంటి వారంతా సోమవారం సాయంత్రంలోగా ఆయా పనులపై దృష్టి సారించకుంటే చర్యలు తప్పవని సోమవారం ఒక ప్రకటనలో ఆమె హెచ్చరించారు.

సమన్వయంతో సర్‌ పూర్తి చేయాలి

అధికారులు, సిబ్బంది సమన్వయంతో ప్రత్యేక ఓటరు జాబితాల సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు. మండలంలోని చింతలవీధి సచివాలయంలో నడిమివీధి బూత్‌ నంబర్‌- 270కి సంబంధించిన జాబితాలపై సోమవారం ఆమె ఆరా తీశారు. ఈ సందర్భంగా సిబ్బందితో కలెక్టర్‌ మాట్లాడి పలు సూచనలు చేశారు. అందరూ సమన్వయంతో పని చేసి, ఓటరు జాబితాల సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఈ క్రమంలో ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.

ఇద్దరు బీఎల్‌వోల సస్పెన్షన్‌

కొయ్యూరు: ఓటరు జాబితాల స్పెషల్‌ ఇన్‌టెన్సివ్‌ రివిజన్‌(సర్‌) ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కొయ్యూరు మండలానికి చెంది ఇద్దరు బూత్‌ స్థాయి అధికారులను సస్పెండ్‌ చేసినట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి టి.నిషాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితాల సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఓటర్ల్లకు ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ, వాటి డిజిటలైజేషన్‌ ప్రక్రియలో కొయ్యూరు మండలంలో బూత్‌ నంబర్లు 75, 76కు చెందిన బూత్‌ స్థాయి అధికారులు జి.శివశంకర్‌(ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌), ఎ.నవభారతి(వెల్ఫేర్‌ అసిస్టెంట్‌) నిర్దేశించిన మార్గదర్శకాలు పాటించకుండా నిర్లక్ష్యం చేశారనే అభియోగాలపై వారిద్దర్నీ సస్పెండ్‌ చేశామని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఆ ఇద్దరు బూత్‌ స్థాయి అధికారుల వైఖరి కారణంగా ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారని నివేదికలు అందాయన్నారు. సర్‌ ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధకనబరచి, గడువు నాటికి నిర్దేఽశించిన పనులు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో సర్‌ ప్రక్రియలో సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలపైనా శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు.

Updated Date - Jul 06 , 2026 | 11:02 PM