Share News

పెట్టుబడుల సదస్సుకు చకచకా ఏర్పాట్లు

ABN , Publish Date - Nov 10 , 2026 | 01:19 AM

నగరంలో సీఐఐ భాగస్వామ్య పెట్టుబడిదారుల సదస్సుకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి.

పెట్టుబడుల సదస్సుకు చకచకా ఏర్పాట్లు

నేటి నుంచే అతిథుల రాక

26 హోటళ్లలో 580 గదుల కేటాయింపు

ముఖ్యమంత్రి రాక రేపు

విశాఖపట్నం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి):

నగరంలో సీఐఐ భాగస్వామ్య పెట్టుబడిదారుల సదస్సుకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానంలో ప్రధాన వేదికను మంగళవారం సాయంత్రానికి పోలీసులకు అప్పగించనున్నారు. ప్రధానంగా 12, 13 (గురు, శుక్రవారాలు) తేదీల్లో సదస్సు జరుగుతున్నప్పటికీ అతిథులు మంగళవారం సాయంత్రం నుంచే వస్తారని పరిశ్రమలు, వాణిజ్య శాఖల కార్యదర్శి యువరాజ్‌ వెల్లడించారు. సదస్సు ప్రారంభానికి ఒకరోజు ముందుగా అంటే బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్నారు. ఈ ఏడాది సదస్సుకు ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రులు అమిత్‌ షా (హోం), పియూష్‌ గోయల్‌ (వాణిజ్య, పరిశ్రమల శాఖ) వస్తున్నారు. ముగింపు ఉత్సవానికి ఉప రాష్ట్రపతి సి.రాధాకృష్ణన్‌ హాజరవుతారు. వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే అతిథులు, రాయబారులు, విదేశీ మంత్రుల కోసం నగరంలోని 26 హోటళ్లలో 580 రూమ్‌లు ఇప్పటికే బుక్‌ చేశారు. ప్రతి అతిథికి లైజన్‌ ఆఫీసర్‌ను కేటాయించారు. విమానాశ్రయంలో దిగిన వెంటనే వారికి స్వాగతం పలికి, కేటాయించిన హోటల్‌కు తీసుకువెళ్లే బాధ్యత లైజనింగ్‌ అధికారులు అప్పగించారు. అతిథులకు 14వ తేదీన జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు చూపించనున్నారు. అతిథుల సమయం, ఆసక్తి మేరకు వారిని ఆయా బస్సుల్లో పర్యాటక ప్రాంతాలకు తీసుకువెళ్లనున్నారు. సదస్సుకు 59 దేశాల నుంచి ప్రతినిధులు, 15 మంది విదేశీ మంత్రులు వస్తారు. సుమారు 1,250 మంది పారిశ్రామికవేత్తలు, సీఈఓలు హాజరవుతారు. సదస్సు కోసం విశాఖ నగరాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు.


వేదికలన్నీ 48 గంటల ముందే సిద్ధం

పర్యాటక ప్రాంతాల సుందరీకరణ

పరిశ్రమలు, వాణిజ్య శాఖల కార్యదర్శి కార్యదర్శి యువరాజ్‌

విశాఖపట్నం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి):

సీఐఐ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు ఈ నెల 12న ప్రారంభమవుతుందని, దానికి 48 గంటల ముందే వేదికలన్నీ సిద్ధం కావాలని, పోలీసులకు అప్పగించాలని పరిశ్రమలు, వాణిజ్య శాఖల కార్యదర్శి యువరాజ్‌ ఆదేశించారు. సదస్సు ఏర్పాట్లు జరుగుతున్న ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానంలో ఆయన సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్‌ సరఫరా, ఆడియో సిస్టమ్స్‌, ఫైర్‌ సేఫ్టీ పనులన్నీ వెంటనే పూర్తి చేయాలన్నారు. సదస్సు సమావేశాలు 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉంటాయన్నారు. వీటి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుగానే వస్తున్నారన్నారు. పర్యాటక ప్రాంతాలను అతిథులు సందర్శిస్తారని, వాటిని అందంగా తీర్చిదిద్దాలన్నారు. హోటళ్లు, అతిథులు ప్రయాణించే మార్గాలన్నీ పరిశుభ్రంగా ఉండాలన్నారు. కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ మాట్లాడుతూ 26 హోటళ్లలో రూమ్‌లు బుక్‌ చేశామని, అక్కడే లైజన్‌ ఆఫీసర్లను పెట్టామన్నారు. భోజనాలకు వేర్వేరు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌, జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి తదితరులు పాల్గొన్నారు.

వర్చువల్‌గా మంత్రి డోలా సమీక్ష

పెట్టుబడిదారుల సదస్సుపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి వర్చువల్‌గా సమీక్షించారు. కలెక్టరేట్‌లో జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌, ఎంపీ శ్రీభరత్‌. ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్‌రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2026 | 01:19 AM