Share News

జీవీఎంసీ ఎన్నికలకు శరవేగంగా ఏర్పాట్లు

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:59 AM

జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

జీవీఎంసీ ఎన్నికలకు శరవేగంగా ఏర్పాట్లు

నగరానికి చేరిన ఎన్నికల సామగ్రి

జోన్‌లవారీగా పంపిణీ చేసిన అధికారులు

ఏయూలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన కమిషనర్‌ కేతన్‌గార్గ్‌

విశాఖపట్నం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఈనెల తొమ్మిదో తేదీన తీర్పు వెలువరించనున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు ఎలా వచ్చినాసరే మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉంది. అందుకు అనుగుణంగా జీవీఎంసీ అధికారులు ముందస్తు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు.

బుధవారం నగరానికి చేరిన ఎన్నికల సామగ్రిని స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో భద్రపరచారు. అక్కడి నుంచి జీవీఎంసీ పరిధిలోని పది జోన్‌లకు పంపుతున్నారు. మరోవైపు 120 వార్డుల్లో గుర్తించిన 1,990 పోలింగ్‌ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు, సిబ్బందికి, ఓటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని అఽధికారులను కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ ఆదేశించారు. పోలింగ్‌ పూర్తయిన తర్వాత బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచేందుకు అవసరమైన భవనాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను భవనాలను గుర్తించడంపై దృష్టిసారించారు. ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీలోని పలు భవనాలను జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ బుధవారం పరిశీలించారు. ఇంజనీరింగ్‌కాలేజీ న్యూక్లాస్‌రూమ్‌ కాంప్లెక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ సిస్టమ్స్‌ ఇంజనీరింగ్‌విభాగం, ఇంజనీరింగ్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ బ్లాక్‌ వంటి భవనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అన్నిజోన్‌ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లను, సిబ్బంది,పోలింగ్‌ ఏజెంల్లు రాకపోకలు సాగించడానికి మార్గాలను పరిశీలించారు. లెక్కింపు కేంద్రాల వద్ద భద్రత, నిరంతరవిద్యుత్‌సరఫరా, తగిన వెలుతురు ఉండేలా దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ త్వరలోనే వచ్చే అవకాశం ఉండడంతో ప్రతీ దశను పారదర్శకంగా, సమర్థంగా నిర్వహించేలా ముందస్తుప్రణాళిక సిద్ధంచేసుకోవాలని అదనపు కమిషనర్లు, ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

Updated Date - Oct 08 , 2026 | 12:59 AM