Share News

అభివృద్ధిలో దూకుడు

ABN , Publish Date - Jun 12 , 2026 | 01:12 AM

కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత గత రెండేళ్ల పాలనలో అనకాపల్లి జిల్లాలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని రంగాల్లో అభివృద్ధి దూసుకుపోతుండగా, మరికొన్ని రంగాల్లో అనుకున్నమేర పురోగతి కనిపించడంలేదు.

అభివృద్ధిలో దూకుడు
నక్కపల్లి మండలంలో స్టీల్‌ ప్లాంట్‌ శంకుస్థాపన అనంతరం నమూనాను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మంత్రులు హెచ్‌డీ కుమారస్వామి, శ్రీనివాసవర్మ, లోకేశ్‌, భరత్‌, అచ్చెన్నాయుడు, అనిత, బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌ (ఫైల్‌ ఫొటో)

పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడుల వెల్లువ

పారిశ్రామికాభివృద్ధిలో వడివడిగా అడుగులు

మెరుగుపడిన మౌలిక సదుపాయాలు

చాలా వరకు బాగుపడిన రహదారులు

ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కు

పోలవరం కాలువ పనులు చకచకా

తెరుచుకోని షుగర్‌ ఫ్యాక్టరీలు

అటకెక్కిన బీఎన్‌ రోడ్డు అభివృద్ధి పనులు

కదలిక లేని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి

ఇదీ ‘కూటమి’ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో జిల్లాలో పరిస్థితి

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత గత రెండేళ్ల పాలనలో అనకాపల్లి జిల్లాలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని రంగాల్లో అభివృద్ధి దూసుకుపోతుండగా, మరికొన్ని రంగాల్లో అనుకున్నమేర పురోగతి కనిపించడంలేదు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అత్యధిక ప్రాఽధాన్యం ఇస్తుండడంతో ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు వస్తున్నాయి. రహదారులు, విద్య, వైద్యం, తాగునీరు, ఇరిగేషన్‌, విద్యుత్తు వంటి మౌలిక రంగాల అభివృద్ధిలో చెప్పుకోదగని పురోగతి కనిపిస్తున్నది. కూటమి ఎమ్మెల్యేలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో చాలా వరకు ఈ రెండేళ్ల కాలంలో నెరవేర్చగా, వివిధ కారణాల వల్ల కొన్నింటిని ఇంతవరకు నెరవేర్చలేకపోయారు. వీటిల్లో ప్రధానమైనవి సహకార చక్కెర ఫ్యాక్టరీలను తెరవకపోవడం, చోడవరం నియోజకవర్గం పరిధిలో బీఎన్‌ రోడ్డు అభివృద్ధి పనులు పూర్తకాకపోవడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు ముందుకు సాగకపోవడం.

పెట్టుబడుల వరద

అనకాపల్లి జిల్లాను పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ప్రధానంగా అచ్యుతాపురం, రాంబిల్లి, పరవాడ, నక్కపల్లి మండలాల్లో చిన్న, మధ్యతరహాతోపాటు భారీ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నది. తద్వారా లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో అచ్యుతాపురం మండలంలో రూ.1.85 లక్షల కోట్ల పెట్టుబడులతో గ్రీన్‌ హైడ్రోజన్‌ పవర్‌, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇది దేశంలోనే అతి పెద్ద గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌గా గుర్తింపు పొందనన్నది. నక్కపల్లి మండలంలో ‘ఆర్సెలార్‌ మిట్టల్‌- నిప్పన్‌ స్టీల్‌ ఇండియా’ సంయుక్తంగా రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులతో భారీ ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నది. దీని నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపన జరిగింది. ఇదే మండలంలో బల్క్‌డ్రగ్‌ పార్కు ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. నక్కపల్లి మండలం ఉపమాక, సీహెచ్‌ లక్ష్మీపురం గ్రామాల పరిధిలో గ్లోబల్‌ టాయ్స్‌ తయారీ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం సుమారు 600 ఎకరాలు కేటాయించింది.

రాంబిల్లి మండలంలో రూ.3,990 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ సోలార్‌ ఇన్‌గాట్‌-వేఫర్‌ సోలార్‌ గీన్ర్‌ ఎనర్జీ యూనిట్‌ నిర్మాణ పనులు జరగుతున్నాయి. ఇది పూర్తయితే 2,100 మందికి ఉపాధి లభిస్తుంది. అచ్యుతాపురం, రాంబిల్లి సెజ్‌లో రూ.5,630 కోట్లతో లారస్‌ ల్యాబ్స్‌ భారీ ఫార్మా జోన్‌ను ఏర్పాటు చేసింది. ఆయా యూనిట్లలో 6,350 మందికి ఉద్యోగాలు కల్పించారు. రాంబిల్లి మండలం కృష్ణంపాలెంలో ‘యాక్షన్‌ టెసా’ అనే కంపెనీ బాలాజీ యాక్షన్‌ బిల్డ్‌వెల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేరుతో రూ.11 వేల కోట్ల అంచనా వ్యయంతో భారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నది. ఇందులో దాదాపు 1,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రూ.2,700 కోట్ల పెట్టుబడులతో జూపిటర్‌ సోలార్‌ సెల్‌, మాడ్యూల్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటవుతున్నది. ఈ పరిశ్రమకు ప్రభుత్వం భూమి కేటాయించింది. రూ.3,990 కోట్లతో రీన్యూ ఫొటో ఓల్టెక్స్‌ సోలార్‌ తయారీ ప్రాజెక్టు నిర్మాణ పనులు జరగుతున్నాయి. అచ్యుతాపురం సెజ్‌లోనే గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటవుతున్నది. రిలయన్స్‌ కంపెనీ సుమారు రూ.800 కోట్లతో సాఫ్ట్‌ డ్రింక్స్‌, జ్యూస్‌లు, ప్యాకేజింగ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నది. అంతర్జాతీయంగా పేరున్న ప్రముఖ బ్లూజెట్‌ హెల్త్‌కేర్‌ సంస్థ ఆధ్వర్యంలో 102.48 ఎకరాల్లో ఫార్మాస్యూటికల్‌, ఇంటర్మీడియట్‌, కాంట్రాక్ట్‌ డెవలప్‌మెంట్‌, తయారీ యూనిట్‌ ఏర్పాటవుతున్నది.

ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కు

జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఔత్సాహికులతో వీటిల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఏర్పాటు చేయించి, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడానికి చర్యలు చేపట్టింది. అనకాపల్లి మండలం కోడూరులో 70 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటైంది. మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తయ్యాయి. ఇక్కడ సుమారు 250 పరిశ్రమలను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం కాగా ఇప్పటికే 180 మంది ఔత్సాహికులకు ప్లాట్‌లను కేటాయించారు. ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లిలో నిర్మించిన ఎంఎస్‌ఎంఈ పార్కులో వివిధ రకాల పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. పెందుర్తి నియోజకవర్గం పరవాడలో ఏపీఐఐసీ సెజ్‌లో ఫేజ్‌-2 పనుల్లో భాగంగా ఎంఎస్‌ఎంఈ ఏర్పాటు చేస్తున్నారు. మాడుగుల నియోజకవర్గం కె.కోటపాడు మండలంలో, చోడవరం నియోజకవర్గానికి సంబంధించి బుచ్చెయ్యపేట మండలంలో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు ఇటీవల సీఎం చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. నర్సీపట్నం, పాయకరావుపేట నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు స్థలాలను పరిశీలిస్తున్నారు.

పోలవరం కాలువ పనులు చకచకా...

జిల్లాలో పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పాయకరావుపేట నుంచి తాళ్లపాలెం వరకు గతంలో అసంపూర్తిగా వున్న పనులు వేగం పుంజుకున్నాయి. వచ్చే ఏడాది జూలైనాటి గోదావరి జలాలు జిల్లాకు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈలోగానే ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తారని తెలిసింది. అయితే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తికాకపోతే గోదావరి జలాలు వచ్చినా పెద్దగా ప్రయోజనం వుండదని రైతులు అభిప్రాయపడుతున్నారు.

బాగుపడిన పలు రహదారులు

గత ప్రభుత్వ హయాంలో రహదారులు ఎంత దారుణంగా వున్నాయో అందరికీ తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పలు రహదారులకు నిధులు కేటాయించడంతో అభివృద్ధి చెందాయి. గత రెండేళ్ల కాలంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ రహదారుల అభివృద్ధికి రూ.15-25 కోట్ల వరకు మంజూరయ్యాయి. వీటిల్లో చాలా వరకు పనులు పూర్తికాగా, మిగిలినవి వివిధ దశల్లో వున్నాయి. అయితే పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా తారు దిగుమతి కాకపోవడంతో కొన్నిచోట్ల బీటీ రోడ్ల పనులు ఆగాయి.

నెరవేరని హామీలు..

జిల్లాలో మూతపడిన సహకార చక్కెర కర్మాగారాలను తిరిగి తెరిపిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా మూతపడిన తుమ్మపాల, ఏటికొప్పాక, తాండవ షుగర్‌ ఫ్యాక్టరీలు తెరుచుకోలేదు. పైగా ఉన్న ఒక్కగానొక్క చోడవరం షుగర్‌ ఫ్యాక్టరీ గత సీజన్‌లో మూతపడింది. చెరకు సరఫరా చేసిన రైతులకు, ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులకు బకాయిలు చెల్లించలేదు. చోడవరం షుగర్‌ ఫ్యాక్టరీలో ఇథనాల్‌ ఉత్పత్తి చేస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదన అమలుకు నోచుకోలేదు. దీంతో చెరకు సాగు విషయంలో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

తాము అధికారంలోకి వస్తే ఉత్తరాధ్ర సుజల స్రవంతి పథకాన్ని పూర్తిచేస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. కానీ రెండేళ్ల కాలంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడిన దాఖలాలు లేవు. జిల్లాలో మూడు వేల ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉండగా రెండేళ్లలో 1,100 ఎకరాలను మాత్రమే సేకరించగలిగారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం, ప్రస్తుతం వున్న రిజిస్ట్రేషన్‌ ధర మేరకు పరిహారం చెల్లిస్తేనే భూములు ఇస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు. నిధుల కొరత కారణంగా భూసేకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.

ఉమ్మడి విశాఖ జిల్లా రవాణా వ్యవస్థలో ప్రధానమైనది భీమిలి- నర్సీపట్నం (బీఎన్‌) రోడ్డు. చోడవరం నియోజకవర్గంలో పరిధిలో ఈ రహదారి అత్యంత దారుణంగా వుంది. వైసీపీ హయాంలో పనులు ప్రారంభించినప్పటికీ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్‌ పనులు ఆపేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కాంట్రాక్టర్‌తో మాట్లాడి, పనులను పునరుద్ధరించారు. కానీ కొద్ది రోజులకే ఆగిపోయాయి. సిమెంటు, పిక్క, తారు వంటి నిర్మాణ సామగ్రితోపాటు కూలి రేట్లు పెరిగిపోవడంతో పాత ధరకు రోడ్డు నిర్మాణం చేపట్టలేనని కాంట్రాక్టర్‌ చేతులెత్తేసినట్టు తెలిసింది.

Updated Date - Jun 12 , 2026 | 01:12 AM