Share News

శరవేగంగా విశాఖ అభివృద్ధి

ABN , Publish Date - Sep 12 , 2026 | 01:02 AM

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ది ఊపందుకుందని, పారిశ్రామిక, ఐటీ, పర్యాటక రంగాలు నగరంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు.

శరవేగంగా విశాఖ అభివృద్ధి

రుషికొండ భవనాల వినియోగంపై నెలాఖరుకు స్పష్టత

ఏపీలో 7 స్టార్‌ హోటల్‌ ఏర్పాటుకు లీలా గ్రూపు ఆసక్తి

పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్‌

విశాలాక్షి నగర్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి):

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ది ఊపందుకుందని, పారిశ్రామిక, ఐటీ, పర్యాటక రంగాలు నగరంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. విశాలాక్షినగర్‌లో శుక్రవారం జరిగిన ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. సుమారు రూ.5 వేల కోట్లతో విశాఖలో 16 స్టార్‌ హోటల్స్‌ (980 గదులు) నిర్మాణానికి అనుమతులు ఇచ్చామని వివరించారు. వాటిలో ఇప్పటికే ఆరు నిర్మాణాలు చేపడుతున్నాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఈ రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం ద్వారా ప్రాజెక్టులకు పెద్దపీట వేసినట్టయిందన్నారు. ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ టూర్‌ ఆపరేటర్స్‌ సమావేశంలో లీలా గ్రూపు సంస్థతో చర్చలు జరిగాయని, ఏపీలో 7 స్టార్‌ హోటల్‌ ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ఆసక్తి చూపించిందని మంత్రి దుర్గేష్‌ వెల్లడించారు.

గత ప్రభుత్వం ప్రజాధనాన్ని వృథా చేస్తూ రుషికొండపై హరితా రిసార్ట్స్‌ను కూల్చి, దాని స్థానంలో ప్యాలెస్‌ నిర్మించడంతో పర్యాటక శాఖ భారీగా ఆదాయం కోల్పోయిందన్నారు. ఈ నేపథ్యంలో ప్యాలెస్‌ నిర్వహణ భారంగా మారిందని వివరించారు. రుషికొండపై భవనాల వినియోగానికి సంబంధించి ప్రభుత్వం నియమించిన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ప్రాథమికంగా ఆతిథ్య రంగానికి (హాస్పిటాలిటీ) ఇవ్వాలని ముఖ్యమంత్రికి నివేదించిందన్నారు. దీనిపై ఈ నెలాఖరుకు స్పష్టమైన నిర్ణయం వెలువడుతుందన్నారు.


పలు రైళ్లు రద్దు

కొన్ని రీ షెడ్యూల్‌

విశాఖపట్నం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి):

విజయవాడ డివిజన్‌లోని కొవ్వూరు స్టేషన్‌ వద్ద శుక్రవారం ఉదయం గూడ్స్‌ పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు కొన్నింటిని రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను రీ షెడ్యూల్‌ చేశారు.

రద్దయిన రైళ్లు

శుక్రవారం (11న) విశాఖపట్నం-విజయవాడ రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12717), విశాఖ-రాజమండ్రి-విశాఖ (67286/67285), శనివారం (12న) విజయవాడ-విశాఖపట్నం రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12718) రద్దు

ఆలస్యంగా బయలుదేరిన రైళ్లు

విశాఖ, గుంటూరు నుంచి బయలుదేరే పలు రైళ్లను శుక్రవారం (11న) రీ షెడ్యూల్‌ చేశారు. మధ్యాహ్నం రెండు గంటలకు విశాఖలో బయలుదేరాల్సిన విశాఖ-గుంతకల్‌ తిరుమల ఎక్స్‌ప్రెస్‌ (18521) సాయంత్రం ఐదు గంటలకు, మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరాల్సిన విశాఖ-సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (20708) సాయంత్రం 4.30 గంటలకు, మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరాల్సిన విశాఖ-బెంగళూరు ప్రత్యేక రైలు (08581) సాయంత్రం 5.30 గంటలకు, సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరాల్సిన విశాఖ-చర్లపల్లి ఎక్స్‌ప్రెస్‌ (18527) రాత్రి 7.30 గంటలకు, విశాఖ-చెన్నై ఎగ్మోర్‌ ఎక్స్‌ప్రెస్‌ (18527) రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరాయి. అదేవిధంగా శుక్రవారం సాయంత్రం 4 గంటలకు గుంటూరులో బయలుదేరాల్సిన గుంటూరు-విశాఖ ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ 4.30 గంటలకు బయలుదేరింది.

ఎక్కడికక్కడ నిలిచిన రైళ్లు

ట్రాక్‌ పునురద్ధరణ పనుల కారణంగా విశాఖ-లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ (12805), విశాఖ-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ (17240)తో పాటు మరికొన్ని రైళ్లు తుని, అన్నవరం, సామర్లకోట తదితర స్టేషన్లలో గంటల తరబడి నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


జడ్పీ ఓటర్లు 18,89,128 మంది

పురుషులు 9,20,036, మహిళలు 9,69,052, ఇతరులు 40 మంది..

జాబితా విడుదల

విశాఖపట్నం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి):

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిషత్‌ పరిధిలోని ఓటర్ల జాబితాలను సీఈవో పి.నారాయణమూర్తి శుక్రవారం అధికారికంగా విడుదల చేశారు. జిల్లాలో మొత్తం ఓటర్లు 18,89,128 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 9,20,036 మంది, మహిళలు 9,69,052, ఇతరులు 40 మంది ఉన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. దీంతో జిల్లా పరిషత్‌ అధికారులు శుక్రవారం ఓటర్ల జాబితా విడుదల చేశారు. అయితే మండలాల వారీగా ఓటర్ల వివరాలను సంబంధిత ఎంపీడీవోలు విడుదల చేశారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 14న ఎంపీటీసీ స్థానాల పోలింగ్‌ కేంద్రాల ముసాయిదా జాబితా రూపొందించి ఆ మరుసటిరోజు 15న విడుదలచేస్తారు. అభ్యంతరాలు స్వీకరణ అనంతరం 19న పోలింగ్‌ కేంద్రాల తుది జాబితా విడుదలచేస్తారు.

Updated Date - Sep 12 , 2026 | 01:02 AM