Share News

చకచకా రైల్వే జోన్‌ భవన నిర్మాణం

ABN , Publish Date - Jun 26 , 2026 | 12:23 AM

ముడసర్లోవలో దక్షిణ కోస్తా జోన్‌ రైల్వే ప్రధాన కార్యాలయం నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి.

చకచకా రైల్వే జోన్‌ భవన నిర్మాణం

బేస్‌మెంట్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌, ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి

ఇప్పటివరకు రూ.42.14 కోట్ల వ్యయం

మిగిలిన జోన్‌ కార్యాలయాలకు భిన్నంగా డిజైన్‌

విశాఖపట్నం, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి):

ముడసర్లోవలో దక్షిణ కోస్తా జోన్‌ రైల్వే ప్రధాన కార్యాలయం నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేయగా ఈ ఆరు నెలల్లో స్థలాన్ని చదును చేసి, అప్రోచ్‌ రహదారి వేసి, ప్రహరీ నిర్మాణం చేపట్టారు. అలాగే రెండు బేస్‌మెంట్లు, ఆ పైన గ్రౌండ్‌ ఫ్లోర్‌ పూర్తయ్యాయి. ఇప్పుడు మొదటి అంతస్థు పనులు జరుగుతున్నాయి. ఈ భవన నిర్మాణానికి తొలుత రూ.107 కోట్లు కేటాయించగా, ఆ తరువాత అంచనా వ్యయం రూ.121.58 కోట్లకు పెరిగింది. జూన్‌ 25వ తేదీ నాటికి అందులో రూ.42.14 కోట్లు వివిధ పనులకు వెచ్చించినట్టు రైల్వే అధికార వర్గాలు తెలిపాయి.

కొత్త తరహాలో నిర్మాణం

దేశంలో రైల్వే జోన్‌ భవనాలన్నీ సమాంతరంగా నిర్మించగా విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యాలయాన్ని మాత్రం నిట్టనిలువు (వర్టికల్‌)గా నిర్మిస్తున్నారు. పర్యావరణ హిత నిర్మాణానికి అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నారు. పగటిపూట విద్యుద్దీపాలు ఉపయోగించాల్సిన అవసరం లేని విధంగా గాలి, వెలుతురు వచ్చేలా ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ నిబంధనల ప్రకారం నిర్మిస్తున్నారు. సోలార్‌ విద్యుత్‌, వర్షపు నీటిని సంరక్షించడం, వ్యర్థ జలాల వినియోగం, ఇంధనం పొదుపు చేసే ఎయిర్‌ కండిషనింగ్‌, నీటిని పొదుపు చేసే ప్లంబింగ్‌ పరికరాలు దీనికి అమర్చనున్నారు. వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండేలా, పార్కింగ్‌ ఇబ్బందులు లేని విధంగా, సందర్శకులకు ఆహ్లాదం కలిగేలా భవన పరిసరాలను తీర్చిదిద్దనున్నారు. భారతీయ రైల్వేలో నూతన పరిపాలనా భవన నమూనాలకు తలమానికంగా ఉండేలా దీనిని నిర్మిస్తున్నట్టు రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. భవనానికి అప్రోచ్‌ రహదారి 60 శాతం పూర్తయింది.

Updated Date - Jun 26 , 2026 | 12:23 AM