Share News

చకచకా మాస్టర్‌ ప్లాన్‌ రహదారుల నిర్మాణం

ABN , Publish Date - Apr 10 , 2026 | 01:34 AM

భోగాపురం విమానాశ్రయానికి వెళ్లేందుకు ఉపయోగపడేలా నిర్మిస్తున్న/విస్తరిస్తున్న మాస్టర్‌ ప్లాన్‌ రహదారుల పనులు జూన్‌ నాటికి పూర్తవుతాయని ఎంపీ ఎం.శ్రీభరత్‌ వెల్లడించారు.

చకచకా మాస్టర్‌ ప్లాన్‌ రహదారుల నిర్మాణం

జూన్‌ నాటికి పనులు పూర్తిచేస్తాం

ఎంపీ ఎం.శ్రీభరత్‌

వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌, కమిషనర్‌ తేజ్‌భరత్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పనులు పరిశీలన

విశాఖపట్నం, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి):

భోగాపురం విమానాశ్రయానికి వెళ్లేందుకు ఉపయోగపడేలా నిర్మిస్తున్న/విస్తరిస్తున్న మాస్టర్‌ ప్లాన్‌ రహదారుల పనులు జూన్‌ నాటికి పూర్తవుతాయని ఎంపీ ఎం.శ్రీభరత్‌ వెల్లడించారు. ఆయన గురువారం వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్‌, కమిషనర్‌ తేజ్‌ భరత్‌, ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి మాస్టర్‌ ప్లాన్‌ రహదారుల నిర్మాణాన్ని పరిశీలించారు. కారులో కాకుండా మోటారు సైకిళ్లపై వెళ్లి ఆయా పనుల నాణ్యతను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ, చైర్మన్‌లు విలేకరులతో మాట్లాడారు. వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీ, ఆర్‌ అండ్‌ బి కలసి ఈ రహదారులను విస్తరిస్తున్నాయన్నారు. తిమ్మాపురం నుంచి మారికవలస వరకు 6.3 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులు పూర్తికావచ్చాయన్నారు. అడవివరం నుంచి శొంఠ్యాం వరకు నిర్మిస్తున్న ఆరు వరుసల రహదారిలో కొంతభాగం అటవీ శాఖకు చెందినది ఉందని, వాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి రావలసి ఉందన్నారు. నేరెళ్లవలస-కొత్తవలస రహదారి పనులు 65 శాతం జరిగాయని, ఈ నెలాఖరుకు మొత్తం పూర్తవుతాయన్నారు. బోయపాలెం నుంచి కాపులుప్పాడ వరకు నాలుగు వరుసల రహదారి పనులు 66 శాతం పూర్తయ్యాయని, ఇవి కూడా ఈ నెలాఖరుకు అయిపోతాయన్నారు. భీమిలి-దొరతోట రహదారిని 100 అడుగుల వెడల్పుతో అభివృద్ధి చేయనున్నామన్నారు. ఆర్‌ అండ్‌ బి నిర్మించే ఈ రహదారి ఇంకా టెండర్‌ దశలో ఉందన్నారు. వేపగుంట-పెందుర్తి రహదారి పనులు మే చివరికి పూర్తవుతాయన్నారు. కమిషనర్‌ తేజ్‌భరత్‌ మాట్లాడుతూ ఈ మార్గాల్లో అవసరమైన ప్రాంతాల్లో కల్వర్టులు, వంతెనలు కూడా నిర్మిస్తున్నామన్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే అన్ని రహదారుల పనులు పూర్తిచేస్తామన్నారు. ఈ పర్యటనలో చీఫ్‌ ఇంజనీర్‌ వినయకుమార్‌, ఎస్‌ఈలు భవానీ శంకర్‌, మధుసూదనరావు, ఈఈలు దుర్గాప్రుసాద్‌, పలువురు డీఈలు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2026 | 01:34 AM