పట్టాల పండుగకు చకచకా ఏర్పాట్లు
ABN , Publish Date - Sep 17 , 2026 | 01:35 AM
ముఖ్యమంత్రి ఈ నెల 19వ తేదీన నగర పర్యటనకు రానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో 26,426 మందికి ముఖ్యమంత్రి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించనున్నారు. అక్కడ ఏర్పాట్లను బుధవారం కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ పర్యవేక్షించారు. ప్రధాన వేదిక, లబ్ధిదారుల గ్యాలరీలు, పార్కింగ్, భోజన, తాగునీటి సరఫరా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
19న 26,426 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్న సీఎం
ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో కార్యక్రమం
ప్రజా ప్రతినిధులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
విశాఖపట్నం, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి):
ముఖ్యమంత్రి ఈ నెల 19వ తేదీన నగర పర్యటనకు రానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో 26,426 మందికి ముఖ్యమంత్రి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించనున్నారు. అక్కడ ఏర్పాట్లను బుధవారం కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ పర్యవేక్షించారు. ప్రధాన వేదిక, లబ్ధిదారుల గ్యాలరీలు, పార్కింగ్, భోజన, తాగునీటి సరఫరా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. భారీ సంఖ్యలో లబ్ధిదారులు హాజరుకానున్నారని, ఎవరికీ ఎటువంటి అసౌకర్యం లేకుండా తగిన ఏర్పాట్లుచేయాలని ఆదేశించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే లబ్ధిదారులకు భోజన వసతి కల్పించాలన్నారు. ఎంపీ ఎం.శ్రీభరత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్‌రాజు, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీలు ఏయూలో ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజా ప్రతినిధులతో కలెక్టర్ చర్చించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, డీసీపీ మణికంఠ, ఆర్డీవోలు దిలీప్ చక్రవర్తి, సంగీత్ మాధుర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సీఎం సభకు 400 ప్రత్యేక బస్సులు
ఈనెల 19న ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరగనున్న సీఎం సభకు 400 ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ విశాఖ రీజియన్ యాజమాన్యం నిర్ణయించింది. ఆరోజు జిల్లాలో సుమారు 25 వేల మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులను ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానానికి తరలించేందుకు ఈ ప్రత్యేక బస్సులు వినియోగించనున్నారు. పట్టాల పంపిణీ కార్యక్రమం ముగిసిన తరువాత లబ్ధిదారులను తిరిగి వారి స్వస్థలాలకు చేర్చనున్నారు. ఈ ప్రత్యేక బస్సులు శనివారం ఉదయానికి నిర్దేశించిన ప్రాంతాలకు చేరుకుంటాయని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు తెలిపారు.