Share News

పరిశ్రమలకు త్వరితంగా అనుమతులు

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:51 AM

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంస్థలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ సూచించారు.

పరిశ్రమలకు త్వరితంగా అనుమతులు

అధికారులకు కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ ఆదేశం

ఎంఎస్‌ఎంఈ పార్కుల పనులు వేగవంతం చేయాలి

విశాఖపట్నం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంస్థలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ సూచించారు. వివిధ శాఖల అధికారులు, పరిశ్రమల ప్రతినిధులతో జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమీక్షా సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ మాత్రమే కాకుండా స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ కూడా జరగాలన్నారు. సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌ ద్వారా అనుమతులన్నీ ఇవ్వాలన్నారు. కంపెనీల రిజిస్ట్రేషన్‌, సేల్‌ డీడ్‌ ప్రక్రియలు వేగవంతం చేయాలన్నారు. తుంగ్లాం వద్ద 12 ఎకరాల భూమిని పారిశ్రామిక అవసరాలకు వినియోగంలోకి తేవాలన్నారు. నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల పనులు వేగవంతం చేయాలని సూచించారు. సమావేశానికి ముందు వివిధ పరిశ్రమల ప్రతినిధులు వారి సమస్యలను వివరించగా, తగిన చర్యలు తీసుకోవాలని డీఐసీ, ఏపీఐఐసీ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఐజీ మేనేజర్‌ ఆదిశేషు, ఏపీఐఐసీ జోనల్‌ కమిషనర్‌ సింహాచలం, జీవీఎంసీ, వీఎంఆర్‌డీల అధికారులు పాల్గొన్నారు.


రూ.3,560 కోట్లతో డ్రెడ్జర్ల కొనుగోలు

ఏజీఎంలో వెల్లడించిన డీసీఐ

విశాఖపట్నం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి):

రాబోయే ఐదేళ్లలో రూ.3,560 కోట్లతో 11 డ్రెడ్జర్లను కొనుగోలు చేయనున్నామని డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ) వెల్లడించింది. తాజాగా నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో సంస్థ పురోగతిని వివరించింది. గత ఏడాది 2025-26లో ఆపరేషన్ల ద్వారా రూ.1,208.33 కోట్ల ఆదాయం వచ్చిందని, పన్నులు పోను రూ.4.75 కోట్ల లాభం వచ్చిందని పేర్కొంది. అంతకుముందు ఏడాది రూ.27.46 కోట్ల నష్టం రాగా, వాటిని అధిగమించి సంస్థను లాభాల బాటలోకి తీసుకువచ్చామని తెలిపింది.


జడ్పీ ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌

విశాఖపట్నం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి):

విశాఖ జిల్లా పరిషత్‌ ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జడ్పీ పాలకవర్గ పదవీకాలం గురువారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో జడ్పీ ప్రత్యేకాధికారులుగా కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.


నేడు కిరండూల్‌ రైళ్లు రద్దు

విశాఖపట్నం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి):

రాయగడ డివిజన్‌ పరిధిలో కొండ చరియలు విరిగిపడడంతో విశాఖ-కిరండూల్‌-విశాఖ (18515/18516) ఎక్స్‌ప్రెస్‌ రైలు సర్వీసులు, అలాగే విశాఖ-కిరండూల్‌-విశాఖ (58501/58502) పాసింజర్‌ రైలు సర్వీస్‌లను శనివారం (26న) రద్దు చేశామని రైల్వే అధికారులు ప్రకటించారు.

Updated Date - Sep 26 , 2026 | 12:51 AM