మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం
ABN , Publish Date - Jun 11 , 2026 | 01:09 AM
మానసిక దివ్యాంగురాలిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన దారుణ సంఘటన విశాఖ జిల్లా భీమిలిలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బాధిత యువతి (24)ని బుధవారం వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాలిలా ఉన్నాయి.
ఇద్దరి అరెస్టు
భీమునిపట్నం, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): మానసిక దివ్యాంగురాలిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన దారుణ సంఘటన విశాఖ జిల్లా భీమిలిలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బాధిత యువతి (24)ని బుధవారం వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని యాతకుమ్మరిపాలెంలో మంగళవారం రాత్రి గ్రామదేవత ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాలకు వచ్చిన సమీప ప్రాంతానికి చెందిన యువతిని పట్టణంలోని తోటవీధికి చెందిన సూరాడ నూకరాజు (25), కర్రి రఘు (21)లు నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్లి నోట్లో గుడ్డలు పెట్టి అత్యాచారానికి పాల్పడ్డారు. కుమార్తె కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో నూకరాజు, రఘు పట్టుబడ్డారు. ఇద్దరినీ పోలీసులకు అప్పగించారు. రాత్రంతా స్టేషన్‌లో నిందితులను సీఐ తిరుమలరావు, ఎస్‌ఐ సురేష్ విచారించారు. కాగా, బుధవారం ఉదయం విశాఖ మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ సీహెచ్ అంబేడ్కర్ సంఘటనా స్థలిని పరిశీలించారు. అలాగే, రీజనల్ ఫెరెన్సిక్ ల్యాబ్ నిపుణులు ఆధారాలు సేకరించారు. నిందితులపై అత్యాచారం కేసు నమోదు చేశామని, మహిళా స్టేషన్ ఏసీపీ అంబేడ్కర్ దర్యాప్తు చేస్తున్నారని సీఐ తెలిపారు. నిందితుల్లో ఒకరైన నూకరాజు చేపల వేటకు గుజరాత్ వెళుతుంటాడు. ఇటీవలే అదే వీధికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మరో నిందితుడు రఘు భీమిలిలోనే చేపల వేటకు వెళతాడు. మానసిక దివ్యాంగురాలైన తమ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత యువతి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇదిలావుండగా, మంగళవారం అర్ధరాత్రి అత్యాచారం జరిగితే మరుసటిరోజు మధ్యాహ్నం 12 గంటల వరకూ బాధిత యువతిని వైద్య పరీక్షలకు తీసుకువెళ్లకుండా స్టేషన్‌లోనే ఉంచడం పట్ల పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.