దువ్వాడలో యథేచ్ఛగా భూ కబ్జాలు
ABN , Publish Date - May 23 , 2026 | 12:33 AM
గాజువాక మండలం యాదవజగ్గరాజు పేట, దువ్వాడ గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూములు, గెడ్డవాగులు ఆక్రమణకు గురవుతున్నాయి.
ప్రభుత్వ భూములు, గెడ్డవాగులు అన్యాక్రాంతం
పక్కనున్న జిరాయితీ సర్వే నంబర్లతో క్రయ విక్రయాలు
దర్జాగా నిర్మాణాలు
చోద్యం చూస్తున్న అధికారులు
వైసీపీ నేతలతో కూటమి నేతలు కుమ్మక్కు
విశాఖపట్నం, మే 22 (ఆంధ్రజ్యోతి):
గాజువాక మండలం యాదవజగ్గరాజు పేట, దువ్వాడ గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూములు, గెడ్డవాగులు ఆక్రమణకు గురవుతున్నాయి. కొందరు రాత్రికి రాత్రే షెడ్లు నిర్మిస్తున్నారు. ముఖ్యంగా యాదవజగ్గరాజు పేట సర్వే నంబరు 140/5లో 2.32 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమించుకుని గతంలో పలువురికి విక్రయించారు. కొనుగోలుదారులు ఆ భూమిని ప్లాట్లుగా అభివృద్ధి చేసి పక్కనున్న జిరాయితీ భూమికి చెందిన సర్వే నంబర్లు వేసి వేరొకరికి అమ్మేశారు. కొనుకున్నవారు అక్కడ అప్పట్లో నిర్మాణాలు చేపట్టగా, రెవెన్యూ అధికారులు అడ్డుకుని హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. ఇప్పుడు అవే భూముల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇటీవల ప్రహరీగోడలు నిర్మిస్తుంటే స్థానికులు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు వాటిని తొలగించారు. తాజాగా మళ్లీ ప్రహరీ గోడలతో పాటు ఆ తరువాత షెడ్లు నిర్మించారు.
కాగా దువ్వాడ సర్వే నంబరు 94లో 4.32 ఎకరాలు, సర్వే నంబరు 96లో 5.56 ఎకరాలు గెడ్డవాగులు, సర్వే నంబరు 91లో సుమారు రెండు ఎకరాలు బంజరు/ప్రభుత్వ భూమి ఉన్నాయి. ప్రసుత్తం ఈ భూములన్నీ కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి. పక్కనున్న జిరాయితీ భూములకు చెందిన సర్వే నంబర్లు వేసి క్రయవిక్రయాలు చేస్తున్నారు. ఇక్కడ గజం ధర రూ.20 వేలు నుంచి రూ.30 వేలు ఉండడంతో కబ్జాదారులు ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని అమ్మకాలు జరుపుతున్నారు. ప్రభుత్వ భూములు, బంజర్లు, గెడ్డవాగుల అమ్మకాల్లో కూటమి పార్టీ నేతలు, వైసీపీ నేతలు అంతా ఏకమైనట్టు కలెక్టర్‌కు కొందరు స్థానికులు ఫిర్యాదు చేశారు. దిగువ స్థాయి రెవెన్యూ సిబ్బందిపై కూటమి పార్టీ నేతలు ఒత్తిడి తీసుకువచ్చి ఆక్రమణల జోలికి రాకుండా చూస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు పెట్టి ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అవే భూములు కబ్జాదారుల కబంధహస్తాల్లో చిక్కుకున్నాయి. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న షెడ్ల నిర్మాణాల్లో అధికార పార్టీ నేతల హస్తం ఉందని స్థానికంగా ప్రచారం జరుగుతుంది.