యథేచ్ఛగా కలప అక్రమ రవాణా
ABN , Publish Date - Jul 16 , 2026 | 11:35 PM
మండలంలోని బాలారం, కంఠారం పంచాయతీల సరిహద్దు ప్రాంతాల నుంచి గత కొన్ని రోజులుగా కలప అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది.
చెట్లను నరికి తరలించేస్తున్న అక్రమార్కులు
దర్జాగా చెక్‌పోస్టులు దాటి వెళ్లిపోతున్న వైనం
పట్టించుకోని రెవెన్యూ, అటవీ అధికారులు
కొయ్యూరు, జూలై 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బాలారం, కంఠారం పంచాయతీల సరిహద్దు ప్రాంతాల నుంచి గత కొన్ని రోజులుగా కలప అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అటవీ, రెవెన్యూ భూముల్లో ఉన్న వేప, నేరేడు వంటి మారుజాతి కలపను అక్రమంగా నరికివేసి తరలించేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బాలారం ప్రధాన రహదారిలోని ఆడాకులు పంచాయతీ పరిధిలో డి.కొత్తూరు, బి.కొత్తూరు, తదితర గ్రామాలను ఆనుకుని ఉన్న అటవీ, రెవెన్యూ భూముల్లో గల వేప, నేరేడు వంటి మారుజాతి చెట్లను ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమార్కులు నరికివేసి దర్జాగా తరలించేస్తున్నారు. ఈ కలపను మైదాన ప్రాంతానికి తరలించాలంటే అటవీశాఖకు చెందిన గొలుగొండ, చీడిగుమ్మల ఎర్రవరం, తుని రహదారిలో గల ములగపూడి చెక్‌పోస్టులు దాటి వెళ్లాలి. అయితే గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతం నుంచి రోజుకు రెండు, మూడు లారీలతో లోడులు ఈ చెక్‌పోస్టులు దాటి వెళుతున్నాయని తెలిసింది. అలాగే రెవెన్యూకు సంబంధించి ఎక్కడైనా పట్టా భూముల్లో ఉన్న నేరేడు, వేప చెట్లు నరకాలంటే తహశీల్దార్ అనుమతి తీసుకోవాలి. అయితే ఈ ప్రాంతం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా కలప తరలిపోతుండడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా అటవీ, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు స్పందించి కలప అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. దీనిపై తహశీల్దార్ ప్రసాద్‌బాబు వివరణ కోరగా, డి.కొత్తూరు, బి.కొత్తూరు రెవెన్యూ పట్టా భూముల్లో ఉన్న వేప, నేరేడు చెట్లు నరికేందుకు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదని చెప్పారు. గురువారం ఉదయం డి.కొత్తూరు సమీపంలో నేరేడు, వేప దుంగలు లారీలో లోడు చేస్తున్నారని తెలిసి వీఆర్‌వోను అక్కడికి పంపామని, లోడింగ్ నిలిపివేసి సంబంధిత వ్యక్తిని కార్యాలయానికి రావాలని తెలిపామన్నారు. ఆ కలపకు సంబంధించిన ఆనవాళ్లపై పరిశీలన చేస్తున్నామని ఆయన చెప్పారు.