ఎడాపెడా అక్రమ నిర్మాణాలు
ABN , Publish Date - Jul 02 , 2026 | 01:44 AM
భవన నిర్మాణాలకు అనుమతులు సరళతరం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సెల్ఫ్ డిక్లరేషన్ (సర్టిఫికేషన్) బిల్డింగ్ పర్మిషన్ విధానం’ దుర్వినియోగం అవుతోంది. ఇది కొంతమంది లైసెన్డ్స్ టెక్నికల్ పర్సన్లు/సర్వేయర్ (ఎల్‌టీపీ)లకు వరంగా మారింది. లేఅవుట్‌లో స్థలాలు ఉన్నట్టు చూపించి కొందరు వివాదాస్పద భూములు, ప్రభుత్వ భూములతోపాటు భవిష్యత్తులో రోడ్ల విస్తరణకు విడిచిపెట్టాల్సిన చోట్ల అడ్డగోలుగా భవన నిర్మాణాలు చేస్తున్నారు. వీటికి ఎల్‌టీపీల వద్దనే ప్లాన్ జారీ అయిపోతుండడంతో టౌన్‌ప్లానింగ్ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో నగరంలో అక్రమ భవన నిర్మాణాలు పెరిగిపోతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘సెల్ఫ్ డిక్లరేషన్ బిల్డింగ్ పర్మిషన్ విధానం’ దుర్వినియోగం
నిబంధనలను వరంగా మార్చుకుంటున్న లైసెన్స్ సర్వేయర్లు
వివాదాస్పద స్థలాలు,
ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలకు ప్లాన్‌లు జారీ
చెరువు పోరంబోకులో జీ+2 భవనం
సింహాచలం బీఆర్‌టీఎస్ రోడ్డును
అక్రమించి భవనం నిర్మించిన మరొకరు
చర్యలు తీసుకోకుండా అధికారులపై ఒత్తిళ్లు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
భవన నిర్మాణాలకు అనుమతులు సరళతరం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సెల్ఫ్ డిక్లరేషన్ (సర్టిఫికేషన్) బిల్డింగ్ పర్మిషన్ విధానం’ దుర్వినియోగం అవుతోంది. ఇది కొంతమంది లైసెన్డ్స్ టెక్నికల్ పర్సన్లు/సర్వేయర్ (ఎల్‌టీపీ)లకు వరంగా మారింది. లేఅవుట్‌లో స్థలాలు ఉన్నట్టు చూపించి కొందరు వివాదాస్పద భూములు, ప్రభుత్వ భూములతోపాటు భవిష్యత్తులో రోడ్ల విస్తరణకు విడిచిపెట్టాల్సిన చోట్ల అడ్డగోలుగా భవన నిర్మాణాలు చేస్తున్నారు. వీటికి ఎల్‌టీపీల వద్దనే ప్లాన్ జారీ అయిపోతుండడంతో టౌన్‌ప్లానింగ్ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో నగరంలో అక్రమ భవన నిర్మాణాలు పెరిగిపోతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భవన నిర్మాణం కోసం జీవీఎంసీ నుంచి కచ్చితంగా అనుమతి పొంది ఉండాలి. ప్లాన్ కోసం భవన నిర్మాణదారుడు ముందుగా ఒక లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్(ఎల్‌టీపీ)ని సంప్రతించాలి. ప్లాన్ రావాలంటే స్థలానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్‌లు, కొలతలకు సంబంధించిన పత్రాలను జీవీఎంసీకి సమర్పించాల్సి ఉంటుంది. తర్వాత భవన నిర్మాణం ఎలా చేపట్టాలనుకుంటున్నారనే డ్రాయింగ్‌తోపాటు అందుకు సెట్ బ్యాక్‌లుగా వదిలే స్థలం, రోడ్డు కనెక్టవిటీతో కూడిన స్కెచ్ వంటివి దరఖాస్తుతోపాటు అప్‌లోడ్ చేస్తే, ఆయా వివరాలను ఆన్‌లైన్‌లోనే స్కూట్నీ చేసిన తర్వాత అంతా సక్రమంగా ఉన్నట్టు తేలితే భవన నిర్మాణానికి సంబంధించిన ఫీజులు ఎంత చెల్లించాలనేది ఆన్‌లైన్‌లోనే ఎల్‌టీపీకి జనరేట్ అవుతుంది. ఆ మేరకు ఫీజులు చెల్లించిన తర్వాత స్థానిక వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేటర్ సెక్రటరీ ఆ స్థలాన్ని సందర్శించి దరఖాస్తులో పొందుపరిచిన వివరాలు, డాక్యుమెంట్‌లు, స్థలం కొలతలు, రోడ్డు సదుపాయం వంటి వాటితోపాటు వివాదాలేమైనా ఉన్నాయా? అనేది తనిఖీ చేసి తర్వాత ఉన్నతాధికారులకు ఫైల్‌ను రికమండ్ చేస్తారు. అక్కడి నుంచి భవన నిర్మించే స్థలం విస్తీర్ణం బట్టి బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్‌కు, టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్‌కు, ఏసీపీ, డీసీపీ, సీపీ, సీసీపీ స్థాయికి చేరి ప్లాన్ జారీ అవుతుంది. అయితే ఈ ప్రక్రియ వల్ల భవన నిర్మాణదారులకు ప్లాన్ పొందడానికి తీవ్రమైన జాప్యం జరగడంతోపాటు, అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని, అవినీతికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం భవన నిర్మాణం ప్లాన్‌ల జారీ ప్రక్రియను సరళతరం చేసేందుకు ఏడాది కిందట ‘సెల్ఫ్ డిక్లరేషన్/సర్టిఫికేషన్ బిల్డింగ్ పర్మిషన్’ విధానాన్ని అమలుచేయడం ప్రారంభించింది. దీని ప్రకారం లేఅవుట్లలోని స్థలాల్లో భవన నిర్మాణం చేపట్టాలనుకునేవారు ప్లాన్ కోసం ఎల్‌టీపీలను సంప్రతించి, స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్‌లను సమర్పించి, ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను చెల్లించేస్తే ప్లాన్ జారీ అయిపోతోంది. టౌన్‌ప్లానింగ్ అధికారులను సంప్రతించాల్సిన అవసరం ఉండదు. భవిష్యత్తులో ఆ స్థలంపై ఏవైనా వివాదాలు తలెత్తినా, డాక్యుమెంట్‌లు తప్పు అని తేలినా, ప్లాన్ కోసం సమర్పించిన వివరాల్లో తేడాలు ఉన్నా వాటన్నింటికీ తానే భాధ్యత వహిస్తానని భవన నిర్మాణదారుడు ఒక అఫిడవిట్‌ను ఎల్‌టీపీకి సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఎల్‌టీపీ కూడా ఆయా వివరాలు సరైనవేనని నిర్ధారించుకున్న తర్వాతే ప్లాన్‌ను జారీచేయాల్సి ఉంటుంది.
సెల్ఫ్ డిక్లరేషన్ ప్లాన్ పేరుతో అక్రమ నిర్మాణాలు
అయితే ఈ సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతో జీవీఎంసీ పరిఽదిలో అక్రమ నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. తాజాగా జీవీఎంసీ ఐదో వార్డు పరిధి పరదేశిపాలెంలో ఒకరు లేఅవుట్‌లోని స్థలంగా చూపించి ఏకంగా చెరువు పోరంబోకు భూమిలో జీ+2 నిర్మాణం చేస్తున్నారు. అలాగే 98వ వార్డు పరిధి సింహపురి కాలనీ లేఅవుట్‌లో బీఆర్‌టీఎస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న స్థలంలో కొంతభాగం మాస్టర్‌ప్లాన్‌లో ఉంది. మిగిలిన స్థలంలో జీ+2 నివాస భవనం నిర్మాణానికి సెల్ఫ్ డిక్లరేషన్ కింద ప్లాన్ తీసుకుని, బీఆర్‌టీఎస్ మాస్టర్‌ప్లాన్‌లో ఉన్న స్థలాన్ని ఆక్రమించి వాణిజ్య భవనం నిర్మించేస్తున్నారు. దీనిపై కొందరు జిల్లా కలెక్టర్‌కు ఇటీవల ఫిర్యాదు చేయడంతో ఆయన స్వయంగా ఆ భవనాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని టౌన్‌ప్లానింగ్ అధికారిని ఆదేశించారు. భవనాన్ని తనిఖీ చేసిన టౌన్‌ప్లానింగ్ అధికారులు పూర్తి ఉల్లంఘనలతో నిర్మాణం చేస్తున్నట్టు గుర్తించి కూల్చివేత పనులు చేపట్టారు. ఇంతలో నగరానికి చెందిన ఒక రాజకీయ నేత వారికి ఫోన్‌చేసి భవనం జోలికి వెళితే తీవ్రపరిణామాలు తప్పవని హెచ్చరించడంతో వారంతా వెనుతిరిగారు.
మధురవాడ జోన్‌లోనే 150కిపైగా...
నగరంలో గత ఏడాది కాలంలో సెల్ఫ్ డిక్లరేషన్ ప్లాన్‌లతో భవన నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. జీవీఎంసీ పరిధిలో సుమారు 850 సెల్ఫ్ డిక్లరేషన్ ప్లాన్‌లు జారీ కాగా అందులో ఒక్క మధురవాడ జోన్‌లోనే 150కిపైగా ఉన్నట్టు టౌన్‌ప్లానింగ్ అధికారులు చెబుతున్నారు. సెల్ఫ్ డిక్లరేషన్ ప్లాన్‌లను టౌన్‌ప్లానింగ్ అధికారులు కచ్చితంగా తనిఖీ చేయాల్సి ఉండగా, ఎందుచేతనో అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతో అక్రమ నిర్మాణాలకు ప్లాన్‌లు జారీచేసినా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నట్టు తేలినా సంబంధిత ఎల్‌టీపీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంతోపాటు క్రిమినల్ కేసు పెట్టాలి. అలాగే దరఖాస్తుదారుడిపై కూడా శాఖాపరంగా చర్యలు తీసుకునేలా రెవెన్యూ, పోలీస్ అధికారులకు లేఖ రాయాలి. కానీ జీవీఎంసీ పరిధిలో ఇంతవరకూ ఇలాంటి చర్యలు తీసుకున్న కేసు ఒక్కటీ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.