Share News

వీఎంఆర్‌డీఏలో ఎడాపెడా పోస్టుల సృష్టి

ABN , Publish Date - Jun 05 , 2026 | 12:44 AM

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)లో కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి.

వీఎంఆర్‌డీఏలో ఎడాపెడా పోస్టుల సృష్టి

డిప్యూటేషన్‌పై పోస్టింగ్‌లు

మొన్న ‘ఓఎస్‌డీ’

నిన్న అడిషనల్‌ కమిషనర్‌

తాజాగా ‘డిప్యూటీ సెక్రటరీ’

ప్రాజెక్టుల్లో మాత్రం కదలిక లేదు

విశాఖపట్నం, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి):

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)లో కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి. పోస్టులను సృష్టించుకొని, కొందరు డిప్యూటేషన్‌పై వస్తున్నారు. తాజాగా అడిషనల్‌ కమిషనర్‌గా దాట్ల కీర్తి వచ్చారు. విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ (వీఈఆర్‌) బాధ్యతలు కూడా వీఎంఆర్‌డీఏకే అప్పగించినందున పనిభారం ఎక్కువ అవుతుందని చెప్పి ఈ పోస్టు సృష్టించారని చెబుతున్నారు. వీఎంఆర్‌డీఏకు సెక్రటరీ ఉన్నారు. అడిషనల్‌ సెక్రటరీ పోస్టు లేదు. ఇప్పుడు దానిని కూడా క్రియేట్‌ చేశారు. పే అండ్‌ అకౌంట్స్‌ శాఖలో రీజనల్‌ అకౌంట్స్‌ అధికారిగా పనిచేస్తున్న రిషిబాబు ఆ పోస్టులో వచ్చి చేరారు. పది రోజులు దాటింది. దీనిపై మీడియాకు ఎటువంటి సమాచారం లేదు. ఎవరైనా కొత్తగా బాధ్యతలు తీసుకుంటే పీఆర్‌ విభాగం ద్వారా తెలియజేస్తారు. కానీ ఈ పోస్టు విషయంలో గోప్యత పాటించారు. సెక్రటరీ పేషీలో ఏ ఫైళ్లు కదలడం లేదని, వెళ్లిన ప్రతి ఫైల్‌ పెండింగ్‌లో ఉండిపోతున్నదని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అడిషనల్‌ సెక్రటరీ ఏమి చేస్తారనేది చూడాలి. వీఎంఆర్‌డీఏ చేపట్టే పీపీపీ ప్రాజెక్టుల కోసం ‘ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ’ పోస్టును ఎప్పటికప్పుడు సృష్టించి వాడుకుంటున్నారు. ఏదో ఒక పోస్టులో విశాఖలో ఉండాలనుకునే వారి కోసం దీనిని ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల ఓఎస్‌డీగా కృష్ణా నాయక్‌ వచ్చి చేరారు. ఇంకా ఇంకెన్ని పోస్టులు క్రియేట్‌ చేస్తారో చూడాలి. ప్రాజెక్టుల పరంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతిపాదించిన వాటిలో పట్టాలు ఎక్కనివే అనేకం ఉన్నాయి. మధ్య తరగతి ప్రజల కోసం అపార్టుమెంట్ల నిర్మాణం చేపడతామని ప్రకటించారు. సర్వే కూడా చేశారు. డిమాండ్‌ బాగుందని తేలింది. అయినా దీనికి ముందడుగు పడలేదు. ఎండాడ, రుషికొండ ప్రాంతాల్లో అర్బన్‌ హేబిటేషన్‌ సెంటర్‌ వంటి కొన్ని ప్రాజెక్టులు ప్రతిపాదించారు. అవీ ముందుకు కదలడం లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద అధికారులు వచ్చి విధుల్లో చేరినందున వీఎంఆర్‌డీఏ పరుగులు తీస్తుందని చెబుతున్నారు. చూడాలి.

Updated Date - Jun 05 , 2026 | 12:44 AM