రాంబిల్లిలో మరో డేటా సెంటర్
ABN , Publish Date - May 30 , 2026 | 12:41 AM
జిల్లాలో మరో డేటా సెంటర్ ఏర్పాటు కానున్నది. రాంబిల్లి మండలంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఇప్పటికే భూమిపూజ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ దిగ్గజ సంస్థ టాటా సైతం రాంబిల్లి మండలంలో డేటా సెంటర్ ఏర్పాటుకు సిద్ధమవుతున్నది. సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో ఉండడం, సమృద్ధిగా నీరు, విద్యుత్తు అందుబాటులో వుండడం, జాతీయ రహదారి, రైల్వే లైన్, పోర్టులు చేరువలో వుండడంతో జిల్లాలో డేటా సెంటర్ల ఏర్పాటుకు దిగ్గజ సంస్థలు ముందుకు వస్తున్నాయి. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలో ప్రభుత్వం రెండో విడత సేకరించిన నాన్ సెజ్ ప్రాంతంలోని టాటా డేటా సెంటర్ ఏర్పాటుకు భూముల కేటాయింపు కోసం ఏపీఐఐసీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది.
రూ.5 వేల కోట్లతో ఏర్పాటుకు ముందుకు వచ్చిన టాటా సంస్థ
200 ఎకరాల కేటాయింపునకు అధికారుల ప్రతిపాదనలు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో మరో డేటా సెంటర్ ఏర్పాటు కానున్నది. రాంబిల్లి మండలంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఇప్పటికే భూమిపూజ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ దిగ్గజ సంస్థ టాటా సైతం రాంబిల్లి మండలంలో డేటా సెంటర్ ఏర్పాటుకు సిద్ధమవుతున్నది. సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో ఉండడం, సమృద్ధిగా నీరు, విద్యుత్తు అందుబాటులో వుండడం, జాతీయ రహదారి, రైల్వే లైన్, పోర్టులు చేరువలో వుండడంతో జిల్లాలో డేటా సెంటర్ల ఏర్పాటుకు దిగ్గజ సంస్థలు ముందుకు వస్తున్నాయి. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలో ప్రభుత్వం రెండో విడత సేకరించిన నాన్ సెజ్ ప్రాంతంలోని టాటా డేటా సెంటర్ ఏర్పాటుకు భూముల కేటాయింపు కోసం ఏపీఐఐసీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది.
గూగుల్ సంస్థ విశాఖ నగరంలో రెండుచోట్లతోపాటు రాంబిల్లి మండలంలో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు రావడంతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరుగుతున్నది. ఈ సమయంలో టాటా గ్రూపు కూడా అత్యాధునిక డేటా సెంటర్ ఏర్పాటుకు ఆసక్తి చూపుతుండడంతో జిల్లాలో అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టాటా డేటా సెంటర్‌కు 200 ఎకరాలు
రాంబిల్లి మండలంలో గూగుల్ డేటా సెంటర్‌కు భూములు కేటాయించిన ప్రదేశానికి సమీపంలోనే టాటా డేటా సెంటర్ ఏర్పాటుకు 200 ఎకరాలు కేటాయించేందుకు ఏపీఐఐసీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. టాటా సంస్థ ప్రతినిధులు ఇప్పటికే రాంబిల్లి మండలంలో స్థలాన్ని పరిశీలించినట్టు తెలిసింది. అధికారవర్గాల సమాచారం ప్రకారం డేటా సెంటర్ ఏర్పాటుకు టాటా సంస్థ రూ.5 వేల కోట్ల పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. డేటా సెంటర్‌కు అనుబంధంగా కాల్‌సెంటర్ పార్కును కూడా ఏర్పాటు చేయనుంది. దీనివల్ల మూడు వేల మందికి ప్రత్యక్షంగా మరో మూడు వేల మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.