Share News

వైభవంగా రామడోలీ ఉయ్యాల పండుగ

ABN , Publish Date - Jan 14 , 2026 | 12:15 AM

మండలంలోని బస్కీ పంచాయతీ కేంద్రంలో రామడోలీ ఉయ్యాల పండుగను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు.

వైభవంగా రామడోలీ ఉయ్యాల పండుగ
నలుగురు బాలలను ఉయ్యాలలో ఊగిస్తున్న దృశ్యం

ఉత్సాహంగా పాల్గొన్న 29 గ్రామాల గిరిజనులు

సాంస్కృతిక కార్యక్రమాల సందడి

అరకులోయ, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బస్కీ పంచాయతీ కేంద్రంలో రామడోలీ ఉయ్యాల పండుగను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. పంచాయతీ పరిధిలోని 29 గ్రామాల గిరిజనులు ఈ పండుగలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏడేళ్లకొకసారి వచ్చే ఈ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో చేసుకున్నారు. 60 అడుగులకు పైగా ఉన్న మామిడి చెట్టును కర్రలుగా తయారు చేసి చివరి భాగంలో నాలుగు ఉయ్యాలను ఏర్పాటు చేశారు. ముందు రోజు గ్రామంలోని నలుగురు పిల్లలను అడవిలో ఉంచి మంగళవారం వారిని పండుగ నిర్వహించే ప్రాంతానికి తీసుకువచ్చారు. వారిని రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుల స్వరూపంగా భావించి 60 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన నాలుగు ఉయ్యాలల్లో ఊగించారు. బస్కీ పరిధిలోని 29 గ్రామాల గిరిజనులు సందడి చేశారు. అంతకు ముందు ధింసా నృత్యాలతో అలరించారు. ఆర్టీసీ విజయనగరం జోన్‌ చైర్మన్‌ దొన్నుదొర, వివిధ పార్టీల నాయకులు ఈ పండుగలో పాల్గొన్నారు. 29 గ్రామాల ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో, పాడి పంటలు, పశు సంపద బాగుండాలని గిరిజనులు పూజలు చేశారు.

Updated Date - Jan 14 , 2026 | 12:15 AM