రాజ్‌మా రైతు ఖుషీ
ABN , Publish Date - Jan 14 , 2026 | 12:14 AM
మన్యంలో రాజ్‌మాకు ఈ ఏడాది గిట్టుబాటు ధర లభించింది. ప్రస్తుతం కిలో రూ.85 చొప్పున గిరి రైతుల వద్ద వర్తకులు కొనుగోలు చేస్తున్నారు.
గిట్టుబాటు ధర లభిస్తుండడంతో ఆనందం
ఈ ఏడాది కిలో రూ.85 చొప్పున వారపు సంతల్లో విక్రయం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
మన్యంలో రాజ్‌మాకు ఈ ఏడాది గిట్టుబాటు ధర లభించింది. ప్రస్తుతం కిలో రూ.85 చొప్పున గిరి రైతుల వద్ద వర్తకులు కొనుగోలు చేస్తున్నారు. శనివారం హుకుంపేట, ముంచంగిపుట్టు, గురువారం గుత్తులపుట్టు, మంగళవారం జి.మాడుగుల వారపు సంతల్లో రైతుల వద్ద కిలో రూ.85 చొప్పున వర్తకులు కోనుగోలు చేశారు. గతంలో కిలో రూ.65 నుంచి రూ.75 మాత్రమే ధర ఉండేది. చైనా నుంచి మన దేశానికి రాజ్‌మా గింజలు దిగుమతి కాకపోవడంతో ధర పెరిగిందని రైతులు, వర్తకులు అంటున్నారు.
ఏజెన్సీ వ్యాప్తంగా గిరిజనులు 25 వేల ఎకరాల్లో రాజ్‌మా పంటను సాగు చేస్తున్నారు. చింతపల్లి, జీకేవీధి మండలాల్లో 10 వేల ఎకరాల్లో, మిగిలిన మండలాల్లో 15 వేల ఎకరాల్లో రాజ్‌మాను పండిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం వరకు కిలో రూ.55 నుంచి రూ.65 ధర మాత్రమే ఉండేది. అయినప్పటికీ గిరిజన రైతులకు రాజ్‌మా సాగు గిట్టుబాటు కావడంతో అధిక విస్తీర్ణంలో పండిస్తున్నారు. అయితే జాతీయ మార్కెట్‌లోకి ఇతర దేశాల నుంచి రాజ్‌మా దిగుమతి కావడంతో ధర పెరుగుదలలో కొన్నేళ్లుగా పెద్ద తేడా ఉండేది కాదు. రెండేళ్ల క్రితం భారత్- చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో చైౖనా ఎగుమతులపై భారత్ ఆంక్షలు విధించడంతో రాజ్‌మా గింజల దిగుమతికి బ్రేక్ పడింది. దీంతో దేశీయంగా రాజ్‌మాకు డిమాండ్ ఏర్పడింది. దీంతో కిలో రూ.85 ధరకు వర్తకులు కొనుగోలు చేస్తున్నారు. అలాగే మార్కెట్‌లో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా కిలో రూ.80 కంటే ధర తగ్గే అవకాశం లేదని వర్తకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజ్‌మా ధర ఆశాజనకంగా ఉండడంతో గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.