Share News

రాజ్‌మా రైతు డీలా

ABN , Publish Date - Jan 01 , 2026 | 12:08 AM

రాజ్‌మాకు గిట్టుబాటు ధర లభించక ఆదివాసీ రైతులు ఆవేదన చెందుతున్నారు. గత ఏడాది ప్రైవేటు వర్తకులు కిలో రూ.90- 100 ధరకు కొనుగోలు చేశారు.

రాజ్‌మా రైతు డీలా
రాజ్‌మాను విక్రయానికి సిద్ధం చేస్తున్న గిరిజన రైతులు

గిట్టుబాటు ధర అందక దిగాలు

కిలోకి రూ.90 ధర ప్రకటించినా కొనుగోలు ప్రారంభించని జీసీసీ

ప్రైవేటు వర్తకులు కిలో రూ.70-75 ధరకు కొనుగోలు

నష్టపోతున్నామని గిరిజన రైతుల ఆవేదన

గూడెంకొత్తవీధి, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): రాజ్‌మాకు గిట్టుబాటు ధర లభించక ఆదివాసీ రైతులు ఆవేదన చెందుతున్నారు. గత ఏడాది ప్రైవేటు వర్తకులు కిలో రూ.90- 100 ధరకు కొనుగోలు చేశారు. ఈ ఏడాది గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కిలోకి రూ.90 ధర ప్రకటించినప్పటికి నేటికి కొనుగోలు ప్రారంభించలేదు. రైతులకు ప్రత్యామ్నాయ మార్కెట్‌ సదుపాయం లేకపోవడంతో ప్రైవేటు వర్తకులు ప్రస్తుతం కిలో రాజ్‌మాను రూ.70-75 ధరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో తాము నష్టపోతున్నామని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గిరిజన ప్రాంతంలో ఆదివాసీ రైతులు 9,800 హెక్టార్లలో ద్వితీయ వాణిజ్య పంటగా రాజ్‌మాను సాగు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆదివాసీ రైతులకు నాణ్యమైన విత్తనం అందుబాటులో లేకుండాపోయింది. దీంతో సాగు విస్తీర్ణం పడిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక 90 శాతం రాయితీపై రాజ్‌మా విత్తనాలను ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలోనే రైతులకు అందజేసింది. రాజ్‌మాతో పాటు విత్తన శుద్ధి మందులను 50 శాతం రాయితీపై అందజేసింది. గిరిజన రైతులు విత్తన శుద్ధి చేసుకుని నాట్లు వేసుకున్నారు. దీంతో రాజ్‌మా పంటకు తెగుళ్లు పెద్దగా ఆశించలేదు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం 90 శాతం రాయితీపై పంపిణీ చేసిన రాజ్‌మా గింజల నుంచి అధిక దిగుబడులు వచ్చాయి. ఈ ఏడాది ఎకరానికి గిరిజన రైతులు ఐదు క్వింటాళ్ల దిగుబడిని సాధించారు. ఆశించిన దిగుబడులు వచ్చినప్పటికి మార్కెట్‌లో ధర ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు.

ప్రకటనలకే పరిమితమైన జీసీసీ

ఆదివాసీ వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు మద్దతు ధరను అందించి దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు నెలకొల్పిన జీసీసీ రాజ్‌మా పంటకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పించడంలో ప్రకటనలకే పరిమితమైంది. మార్కెటింగ్‌ ప్రారంభానికి ముందు జీసీసీ రాజ్‌మా గింజలను కిలో రూ.90 ధరకు కొనుగోలు చేస్తామని ప్రకటించింది. మార్కెట్‌ ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నప్పటికి గూడెంకొత్తవీధి మండలంలో జీసీసీ ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదు. రాజ్‌మా గింజలను కొనుగోలు చేయాలని ఆదివాసీ రైతులు విజ్ఞప్తి చేసినప్పటికి జీసీసీ బ్రాంచి మేనేజర్‌ కనీసం స్పందించడం లేదు.

ప్రైవేటు వర్తకులే ఆధారం

గిరిజన రైతులు పండించిన రాజ్‌మా గింజలను అమ్ముకునేందుకు ప్రైవేటు వర్తకులే ఆధారమయ్యారు. జీసీసీ మార్కెటింగ్‌ సదుపాయం కల్పించకపోవడం వల్ల రైతులు అవసరాలు తీర్చుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వర్తకులకు పంటను అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం ప్రైవేటు వర్తకులు కిలో రాజ్‌మా రూ.70-75 ధరకు కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటూ ఈ ఏడాది రూ.20-25 ధరను రైతులు నష్టపోవాల్సి వస్తుంది. జీసీసీ నేటికి కొనుగోలు ప్రారంభించకపోవడం వల్ల ప్రైవేటు వర్తకులు సిండికేట్‌గా మారి ధర తగ్గించేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో రాజ్‌మాకు నాణ్యత ఆధారంగా కిలోకి రూ.120-150 ధర లభిస్తున్నది. అయితే ఆ ధరను రైతులకు అందించడంలో ప్రభుత్వ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.

Updated Date - Jan 01 , 2026 | 12:08 AM