డబ్బులు ఇవ్వకపోతే రైవాడ నీరు బంద్
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:47 AM
మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) అధికారులు పక్షం రోజుల్లో రూ.5 కోట్లు విడుదల చేయకపోతే రైవాడ రిజర్వాయర్ నుంచి విశాఖకు నీటి సరఫరాను నిలుపుదల చేయిస్తానని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి స్పష్టం చేశారు.
జీవీఎంసీ అధికారులకు ఎమ్మెల్యే బండారు అల్టిమేటం
డీఆర్‌సీలో చెప్పినట్టు పక్షం రోజుల్లో రూ.5 కోట్లు ఇవ్వాలి
లేదంటే రైతులతో కలిసి నేనేంటో చూపిస్తానని హెచ్చరిక
ఆయకట్టుకు నీరు విడుదల
దేవరాపల్లి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) అధికారులు పక్షం రోజుల్లో రూ.5 కోట్లు విడుదల చేయకపోతే రైవాడ రిజర్వాయర్ నుంచి విశాఖకు నీటి సరఫరాను నిలుపుదల చేయిస్తానని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి స్పష్టం చేశారు. గురువారం ఆయన మండలంలోని రైవాడ జలాశయం నుంచి కాలువల ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ, రైవాడ జలాశయం నుంచి నిరంతరాయంగా 50 క్యూసెక్కుల చొప్పున నీటిని తరలించుకుపోతున్న జీవీఎంసీ అధికారులు ఇంతవరకు రూ.169 కోట్లు చెల్లించాల్సి వుందని, బకాయిలు చెల్లించకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. రైవాడ నీటిని విశాఖ నగరంలో అమ్ముకుంటున్న జీవీఎంసీ అధికారులు.. జలాశయం అభివృద్ధి పనులకు డబ్బులు ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన డీఆర్సీ సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించగా.. తొలుత రూ.5 కోట్లు ఇస్తామని జీవీఎంసీ అధికారులు చెప్పారని, 15 రోజుల్లో నిధులు విడుదల చేయకపోతే ఆయకట్టు రైతులతో కలిసి తానేంటే చూపిస్తానని హెచ్చరించారు. కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతో జలాశయం గేట్లకు, ఇన్‌టేక్ చాంబర్‌కు మరమ్మత్తులు చేయించినట్టు చెప్పారు. ఈ ఏడాది వర్షాలు తక్కువ కురిసే అవకాశం వున్నందున రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన కోరారు. అంతకు ముందు రిజర్వాయర్‌ను ఆనుకొని ఉన్న ఎరకాలమ్మ గుడివద్ద పురోహితులు పాకల కామేశ్వరశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి ఎడమ కాలువ వద్ద జలహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జలాశయం ఈఈ సత్యంనాయుడు, జలాశయ చైర్మన్ పాత్రునాయుడు, కూటమి నేతలు కిలపర్తి భాస్కరరావు, గొర్లె గోవింద, రామ్మూర్తినాయుడు, బండారు రామారావు, పెద్దాడ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.