Share News

జలకళ తప్పిన రైవాడ

ABN , Publish Date - Jul 26 , 2026 | 12:57 AM

ఎల్‌నినో ప్రభావంతో మండలంలోని రైవాడ జలాశయం నీటిమట్టం గణనీయంగా తగ్గింది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 114 మీటర్లు కాగా, శనివారం 107 మీటర్లు ఉంది. గత ఏడాది ఇదే రోజున 111 మీటర్లు ఉంది. వాస్తవానికి గిరిజన ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే పినకోట, సమ్మెద గెడ్డల నుంచి నీరు జలాశయంలోకి చేరుతుంటుంది.

జలకళ తప్పిన రైవాడ
రైవాడ కుడి ఇంటెక్‌ చాంబర్‌ వద్ద తగ్గిన నీటిమట్టం

- వర్షాలు లేక తగ్గిన నీటిమట్టం

- గత ఏడాదితో పోలిస్తే నాలుగు మీటర్లు తగ్గుదల

- రెగ్యులేటింగ్‌ గేట్ల వద్ద చుక్క నీరు లేని పరిస్థితి

దేవరాపల్లి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో మండలంలోని రైవాడ జలాశయం నీటిమట్టం గణనీయంగా తగ్గింది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 114 మీటర్లు కాగా, శనివారం 107 మీటర్లు ఉంది. గత ఏడాది ఇదే రోజున 111 మీటర్లు ఉంది. వాస్తవానికి గిరిజన ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే పినకోట, సమ్మెద గెడ్డల నుంచి నీరు జలాశయంలోకి చేరుతుంటుంది. అక్కడ కూడా వర్షాలు పడకపోవడంతో జలాశయం వెలవెలబోతోంది. విశాఖ నగర పాలక సంస్థకు తాగునీటి కోసం రోజూ యాభై క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. ఎడమ, కుడి కాలువల కింద 15,344 ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. ఈ నెల 23న ఎడమ కాలువకు 150 క్యూసెక్కులు, కుడి కాలువకు యాభై క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయానికి పది రెగ్యులేటింగ్‌ గేట్లు ఉన్నాయి. వీటి వద్ద నీరు చేరాలంటే 110 మీటర్ల నీటిమట్టం ఉండాలి. వర్షాలు కురిస్తే ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. దీనిపై డీఈఈ సత్యంనాయుడు వివరణ కోరగా, వర్షాలు పడకపోయినా ప్రస్తుతం ఆయకట్టుకు సరఫరా కొనసాగితే 40 రోజులు, విశాఖ నగర పాలక సంస్థకు 90 రోజులపాటు సరఫరా చేయడానికి నీటి నిల్వలు ఉన్నాయని చెప్పారు. రైవాడ జలాశయ చరిత్రలో ఎప్పుడూ నీటి కోసం ఇబ్బందులు పడిన దాఖలాలు లేవన్నారు.

Updated Date - Jul 26 , 2026 | 12:57 AM