ఏజెన్సీలో వర్షాలు
ABN , Publish Date - Aug 08 , 2026 | 11:16 PM
రుతుపవనాల ప్రభావంతో మన్యంలో ముసురు వాతావరణం కొనసాగుతున్నది. దీంతో జిల్లాలో శనివారం కూడా వర్షం కురిసింది.
ముంచంగిపుట్టులో భారీ వర్షం
ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డలు
గెడ్డలు దాటలేక ఇళ్లకు పరిమితమైన జనం
పాడేరు/ముంచంగిపుట్టు, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి):
రుతుపవనాల ప్రభావంతో మన్యంలో ముసురు వాతావరణం కొనసాగుతున్నది. దీంతో జిల్లాలో శనివారం కూడా వర్షం కురిసింది. జిల్లా కేంద్రం పాడేరు, పరిసర ప్రాంతాల్లో జల్లులు కురవగా, ఒడిశాకు సరిహద్దున ఉన్న ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. ముంచంగిపుట్టు మండలంలో శనివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో ఉబ్బెంగుల, దొరగూడ, కర్లాపొదర్, బిర్రుగూడ తదితర ప్రాంతాల్లో గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల గెడ్డలు వరదనీటితో ఉధృతంగా ప్రవహించడంతో గిరిజనులు ఇళ్లకే పరిమితమయ్యారు. జోలాపుట్టు, డుడుమ జలాశయాల్లోకి వరద నీరు ఇన్‌ఫ్లో పెరిగింది. అయితే మరింతగా వర్షాలు కురిస్తే తమ వ్యవసాయ పనులకు మేలు జరుగుతుందని అన్నదాతలు భావిస్తున్నారు.వాతావరణంలో మార్పులు జరుగుతున్నా ఉష్ణోగ్రతలు పెద్దగా తగ్గడడం లేదు. దీంతో కొయ్యూరులో శనివారం 31.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా పాడేరులో 28.5, అరకులోయలో 28.1, జీకేవీధిలో 28.0, జి.మాడుగులలో 27.6, డుంబ్రిగుడలో 26.8, చింతపల్లిలో 26.5, పెదబయలులో 24.5, హుకుంపేటలో 24.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.