వర్షాలతో రాకపోకలకు ఇక్కట్లు
ABN , Publish Date - Jul 31 , 2026 | 10:37 PM
అల్లూరి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల రోడ్లపై చెట్లు పడిపోతుండగా.. మరికొన్నిచోట్ల వాగులు, గెడ్డలు పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలకు గిరిజనులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చింతపల్లి-జీకేవీధి రోడ్డుపై చెట్లు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే ముంచంగిపుట్టు మండలంలో గెడ్డలు పొంగడంతో గిరిజనుల రాకపోకలకు తిప్పలు తప్పడం లేదు.
చింతపల్లి-జీకేవీధి రోడ్డుపై అడ్డంగా పడిన చెట్టు
గంటపాటు అంతరాయం
ముంచంగిపుట్టులో ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డలు
చేతులు పట్టుకొని వస్తున్న గిరిజనులు
గూడెంకొత్తవీధి/ముంచంగిపుట్టు, జూలై 31 (ఆంధ్రజ్యోతి): చింతపల్లి-జీకేవీధి ప్రధాన రహదారిలో మాలివీధి వద్ద రోడ్డుకడ్డంగా శుక్రవారం భారీ వృక్షం కూలిపడింది. గత నాలుగు రోజులుగా గిరిజన ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శుక్రవారం మధ్యాహ్నం మాలివీధి వద్ద భారీ వృక్షం పడింది. దీంతో ఇరువైపులా గంటపాటు వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు చెట్ల కొమ్మలను ఒకవైపు తొలగించడంతో రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి. వృక్ష శకలాలను పూర్తిగా తొలగించపోవడంతో రాకపోకలకు వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి వృక్ష శకలాలను పూర్తి స్థాయిలో తొలగించాలని ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు.
ముంచంగిపుట్టు మండల పరిధిలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పలుచోట్ల వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో గెడ్డలు దాటేందుకు గిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారు. లక్ష్మీపురం పంచాయతీ దొరగూడ సమీపంలో మత్స్యగెడ్డ పాయ వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో వివిధ పనుల నిమిత్తం శుక్రవారం పంచాయతీ కేంద్రానికి వచ్చేందుకు ఆ గ్రామస్థులు సాహసోపేతమైన ప్రయాణం చేయాల్సి వచ్చింది. గెడ్డను దాటేందుకు ఒకరికి ఒకరు చేతులు పట్టుకొని దాటాల్సి వచ్చిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పలు చోట్ల గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని ఆయా గెడ్డల పరివాహక ప్రాంతీయులు వాపోతున్నారు. అధికారులు స్పందించి గెడ్డ పాయలపై వంతెనలు, కల్వర్టులు, కాజ్‌వేలు నిర్మించాలని కోరుతున్నారు.