మన్యంలో ఊరటనిచ్చిన వర్షాలు
ABN , Publish Date - May 30 , 2026 | 11:40 PM
మన్యంలో మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో వర్షాలు ఊరటనిచ్చాయి. గత ఏడాదితో పోల్చుకుంటే 18 శాతం వర్షపాతం తగ్గినా సాధారణ వర్షపాతం నమోదైంది. దీంతో ఆదివాసీలు సాగు చేస్తున్న కాఫీ, మిరియాల పంటలకు పూత దశలో పుష్కలంగా నీరు అందింది. దీనివల్ల దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే మే నెలాఖరులో పెరిగిన వడగాడ్పులతో నాణ్యత తగ్గే అవకాశం ఉందని కేంద్ర కాఫీ బోర్డు అధికారులు చెబుతున్నారు.
సాధారణ వర్షపాతం నమోదు
కాఫీ, మిరియాల పంటలకు అనుకూలం
వడగాడ్పులతో నాణ్యత తగ్గే అవకాశం
చింతపల్లి, మే 30 (ఆంధ్రజ్యోతి): పాడేరు రెవెన్యూ డివిజన్‌లో విభిన్న వాతావరణం ఉంటుంది. వేసవిలోనూ వర్షాలు కురవడం, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు మించి నమోదు కాకపోవడం మన్యం ప్రత్యేకత. శీతకాలంలో ఏజెన్సీ వ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. లంబసింగి, కుంతలం(జి.మాడుగుల) ప్రాంతాల్లో సున్న, మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వర్షాకాలంలో వర్షాలు అధికంగా ఉంటాయి. పాడేరు రెవెన్యూ డివిజన్ వార్షిక సాధారణ వర్షపాతం 1,250 మిల్లీమీటర్లు. కాఫీ పంటకు మార్చి నుంచి మే వరకు వర్షాలు అవసరం. వర్షాలు పడితేనే కాఫీ పంట పూతకు రావడం.. తర్వాత పిందె దశకు వస్తుంది. మార్చి నుంచి మే వరకు వర్షాలు కురుస్తుండడంతో కాఫీ సాగుకు గిరిజన ప్రాంతం అనుకూలంగా మారింది.
సాధారణ వర్షపాతం నమోదు
గిరిజన ప్రాంతంలో మార్చి నుంచి మే వరకు ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం మార్చిలో 30.3, ఏప్రిల్ 80.8, మే 108.1 మిల్లీమీటర్లు కాగా.. ఈ ఏడాది మార్చిలో 70.4 ఏప్రిల్ 82.8, మే 109.6 మిల్లీమీటర్ల నమోదైంది. గత ఏడాది గరిష్ఠంగా మూడు నెలల్లో 280.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కాగా.. ఈ ఏడాది మూడు నెలల్లో 262.8 మిల్లీమీటర్లు నమోదైంది. గత ఏడాది కంటే ఈ ఏడాది వర్షపాతం తగ్గడం, ఎల్-నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎల్-నినో ప్రభావం గిరిజన ప్రాంతంపై ఏమేరకు ఉంటుంది? కాఫీ, మిరియాల దిగుబడులు, నాణ్యత దెబ్బతీస్తుందా అనే కోణంలో నిపుణులు అంచనా వేస్తున్నారు.
కాఫీ, మిరియాలకు అనుకూలించిన వర్షాలు
ఈ ఏడాది కురిసిన వర్షాలు కాఫీ, మిరియాల పంటల పూతదశలో బాగా అనుకూలించాయి. వర్షాలకు కాఫీ తోటలన్నీ ఏప్రిల్ మొదటివారం నాటికి పూతకొచ్చాయి. ప్రస్తుతం పిందె దశకు చేరుకున్నాయి. మేలో కురిసిన వర్షాలు మిరియాల పంటకు కలిసొచ్చింది. మూడు నెలలు వర్షాలు అధికంగా పడడంతో కాఫీ, మిరియాలు పంటలకు పుష్కలంగా సాగు నీరు అందడంతో తోటలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి.
వడగాడ్పుల వల్ల నాణ్యత తగ్గే అవకాశం
ఎస్. రమేశ్, సీనియర్ లైజనింగ్ అధికారి, కేంద్ర కాఫీ బోర్డు, మినుములూరు.
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో వర్షాలు కురియడంతో కాఫీ, మిరియాల పంటల ఆశాజనకంగా ఉంది. మే నెలాఖరులో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో తేమ శాతం తగ్గింది. వడగాడ్పుల ప్రభావం కాఫీ, మిరియాల పంటలపై పడడడం వల్ల నాణ్యత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో వర్షాలు అనుకూలిస్తే కాఫీ, మిరియాల దిగుబడులు పెరుగుతాయి. ఎల్-నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఎదురైతే దిగుబడులు, నాణ్యత తగ్గుతుంది.