రంగువల్లుల హరివిల్లు
ABN , Publish Date - Jan 05 , 2026 | 01:07 AM
అనకాపల్లిలో సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిన వాతావరణం కనిపించింది. స్థానిక ఎన్టీఆర్ మునిసిపల్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ముగ్గుల పోటీల్లో తెలుగింటి సంప్రదాయం, సంస్కృతి ప్రతిబింబించేలా మహిళలు వేసిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి. ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో ‘సంతూర్’ ముత్యాల ముగ్గుల పోటీలు...పవర్డ్ బై: ‘సన్‌ఫీస్ట్’ మ్యాజిక్ మామ్స్ బిస్కెట్, టేస్ట్ పార్టనర్ ‘స్వస్తిక్’ మసాలా, ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ భారత్‌వాసి అగరబత్తీ’ నిర్వహించిన ముగ్గుల పోటీల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, యువతులు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.
అనకాపల్లిలో సందడిగా ‘ఆంధ్రజ్యోతి-‘ఏబీఎన్’ ముత్యాల ముగ్గుల పోటీలు
ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు, యువతులు
రకరకాల ముగ్గులతో వెల్లివిరిసిన తెలుగు సంప్రదాయం
విజేతలకు నగదు బహుమతులు ప్రదానం
అనకాపల్లి, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లిలో సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిన వాతావరణం కనిపించింది. స్థానిక ఎన్టీఆర్ మునిసిపల్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ముగ్గుల పోటీల్లో తెలుగింటి సంప్రదాయం, సంస్కృతి ప్రతిబింబించేలా మహిళలు వేసిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి. ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో ‘సంతూర్’ ముత్యాల ముగ్గుల పోటీలు...పవర్డ్ బై: ‘సన్‌ఫీస్ట్’ మ్యాజిక్ మామ్స్ బిస్కెట్, టేస్ట్ పార్టనర్ ‘స్వస్తిక్’ మసాలా, ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ భారత్‌వాసి అగరబత్తీ’ నిర్వహించిన ముగ్గుల పోటీల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, యువతులు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. స్థానికంగా శ్రీ కొణతాల సుబ్రహ్మణ్యం మెమోరియల్ ట్రస్ట్, ఏడీ విద్యా సంస్థలు స్పాన్సర్లుగా వ్యవహరించాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 89 మంది మహిళలు, యువతులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. రంగవల్లులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, తమలో దాగి ఉన్న సృజనాత్మక ప్రతిభను వెలికితీశారు. అధికశాతం మంది సంక్రాంతి థీమ్‌తో విభిన్న రకాల ముగ్గులు వేశారు. సంస్కృతి, సంప్రదాయాలను, గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దిన ముగ్గులతో స్టేడియం ప్రాంగణం పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం వరకు పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. పోటీలను తిలకించేందుకు స్థానికులు పలువురు ఉత్సాహంగా తరలివచ్చారు. రంగవల్లుల సందడి చూసి సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చినట్టు అనిపించిందని ఈ సందర్భంగా పలువురు వ్యాఖ్యానించారు. న్యాయనిర్ణేతలుగా రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయిని ఎం.నీలావతి, డాక్టర్ లావణ్య, మహిళా కళాశాల ప్రిన్సిపాల్ ఉమ వ్యవహరించారు.
విజేతలకు నగదు బహుమతులు
ముగ్గుల పోటీల ముగింపు కార్యక్రమానికి స్థానిక స్పాన్సర్ అయిన కొణతాల సుబ్రహ్మణ్యం, అప్పలనర్సమ్మ మెమోరియల్ ట్రస్ట్ వైస్‌చైర్మన్, ఏడీ విద్యా సంస్థల కరస్పాండెంట్ పీలా అనూషా సుబ్రహ్మణ్యం ముఖ్యఅతిథిగా హాజరై, విజేతలకు బహుమతులు అందించారు. అనకాపల్లి పట్టణంలోని నీలకంఠ వీధికి చెందిన బోడాల లక్ష్మి, అనకాపల్లి మండలం తుమ్మపాలకు చెందిన ఎం.భానుశ్రీ, అల్లూరి జిల్లా పాడేరుకు చెందిన పి.వరలక్ష్మి వేసిన ముగ్గులను వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు న్యాయ నిర్ణేతలు ఎంపిక చేశారు. వీరికి పీలా అనూష సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా రూ.6 వేలు, రూ.4 వేలు, రూ.3 వేలు చొప్పున నగదు, జ్ఞాపికలను అందజేశారు. పరవాడకు చెందిన సీహెచ్ ఉమ, కె.కోటపాడుకు చెందిన ఎం.ఉమలకు రూ.వెయ్యి చొప్పున ప్రోత్సాహక బహుమతి అందింంచారు.