ఈదురుగాలులతో వర్షం
ABN , Publish Date - Jun 08 , 2026 | 12:49 AM
నర్సీపట్నంలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి 5.30 గంటల వరకు ఉరుములు, పిడుగులు, ఈదురుగాలలుతో వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
గంటల తరబడి నిలిచిన కరెంటు సరఫరా
నర్సీపట్నం, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నంలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి 5.30 గంటల వరకు ఉరుములు, పిడుగులు, ఈదురుగాలలుతో వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బంగార్రాజు జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు డ్రైనేజీలు పొంగి, మురుగునీరు రహదారిపై ప్రవహించింది. ఈదురుగాలుకు పెదబొడ్డేపల్లి ఐటీఐ వద్ద, బలిఘట్టం మెయిన్ రోడ్డులో, నర్సీపట్నం టీటీడీ కల్యాణ మండం, పోలీసుస్టేషన్ వెనుక గచ్చపువీధిలో విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. దీంతో పట్టణంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
కోటవురట్ల మండలంలో..
కోటవురట్ల, జూన్ 7(ఆంధ్రజ్యోతి): మండలంలోని పలుగ్రామాల్లో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారింది. ఆకాశం మేఘవృతమై ఉరుములు, పిడుగులు, ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. జల్లూరు- యండపల్లి మధ్య రహదారిపై భారీ వృక్షం కూలింది. ఈ సమయంలో వాహనాలు ఏవీ రాకపోవడంతో ప్రమాదం తప్పింది. చెట్టు కూలడంతో సుమారు రెండు గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. ఎస్‌ఐ విజయకుమార్, పోలీసు సిబ్బంది స్పందించి రోడ్డుపై కూలిన చెట్టును తొలగింపజేశారు. ఈదురు గాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అంతకుముందు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ మండిపోయింది. వడగాడ్పులతో జనం విలవిలలాడారు. సాయంత్రం తరువాత వర్షం కురిసి వాతావరణం చల్లబడడంతో ఊరటచెందారు.
గొలుగొండ మండలంలో..
కృష్ణాదేవిపేట, జూన్ 7(ఆంధ్రజ్యోతి): గొలుగొండ మండలం ఏఎల్‌పురం, కొంగశింగి, సీహెచ్.నాగాపురం, లింగంపేట, పాతకృష్ణాదేవిపేట తదితర గ్రామాల్లో ఆదివారం మధ్యాహ్నం తరువాత ఈదురుగాలులు, ఉరుములతో భారీ వర్షం కురిసింది. ఏఎల్‌పురంలో డ్రైనేజీలు పొంగి వర్షం నీటితోపాటు మురుగునీరు రోడ్లపై ప్రవహించింది. ఈదురుగాలుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాగా వాతావరణం చల్లబ డడంతో ప్రజలు ఉపశమనం చెందారు.