ఈదురుగాలులతో వర్షం
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:58 AM
జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీక్షణంగా కాయగా.. అటు పిమ్మట వాతావరణం మారిపోయి ఆకాశం మేఘావృతమైంది. తొలుత ఏజెన్సీని ఆనుకొని వున్న మాడుగుల, దేవరాపల్లి, చీడికాడ, రావికమతం మండలాల్లో ఈదురుగాలులతో వర్షం మొదలైంది.
పలుచోట్ల వడగళ్ల వాన
కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
గంట నుంచి రెండున్నర గంటలపాటు ఆగిన సరఫరా
వాతావరణం చల్లబడడంతో ఉపశమనం
(ఆంధ్రజ్యోతి-న్యూస్‌నెట్‌వర్క్)
జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీక్షణంగా కాయగా.. అటు పిమ్మట వాతావరణం మారిపోయి ఆకాశం మేఘావృతమైంది. తొలుత ఏజెన్సీని ఆనుకొని వున్న మాడుగుల, దేవరాపల్లి, చీడికాడ, రావికమతం మండలాల్లో ఈదురుగాలులతో వర్షం మొదలైంది. క్రమేపీ మిగిలిన మండలాలకు విస్తరించడంతోపాటు ఉధృతమైంది. బుచ్చెయ్యపేట, కె.కోటపాడు, అనకాపల్లి, మునగపాక, అచ్యుతాపురం మండలాల్లో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. గంట నుంచి రెండున్నర గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బుచ్చెయ్యపేట, అనకాపల్లి మండలాల్లో అక్కడక్కడా వడగళ్లు పడ్డాయి. వాతావరణం చల్లబడడంతో జనం ఉపశమనం చెందారు.
అనకాపల్లి పట్టణంలో మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి సుమారు గంటలపాటు ఈదురు గాలులు, వడగళ్లతో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. రహదారులన్నీ జలమయమయ్యాయి. విజయరామరాజుపేట అండర్‌బ్రిడ్జి వద్ద నీరు నిలిచిపోవడంతో వాహనచోదకులకు ఇబ్బంది పడ్డారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణ జలమయమైంది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలువురు దుకాణాలను మూసివేశారు.
కె.కోటపాడు మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతోపాటు వడగళ్లతో వర్షం కురిసింది. సుమారు గంటపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రావికమతం మండలంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సరుగుడు తోటలకు, చెరకు కార్సి తోటలకు మేలు చేస్తుందని రైతులు చెబుతున్నారు. అచ్యుతాపురంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఇదే సమయంలో ఈదురుగాలులు వీచడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
మునగపాక మండలంలోని పలు గ్రామాల్లో సాయంత్రం నాలుగు గంటల తరువాత ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. ఈదురుగాలులు వీచడంతో చెట్లు, విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి. సుమారు నాలుగు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చోడవరం, దేవరాపల్లి, కశింకోట, సబ్బవరం, పరవాడ, మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఎలమంచిలి, రాంబిల్లి, మాకవరపాలెం, మాడుగుల మండలాల్లో మేఘావృతమై వాతావరణం చల్లబడింది.
బుచ్చెయ్యపేటలో వడగళ్ల వాన
బుచ్చెయ్యపేట, ఏప్రిల్ 6 (ఆంధ్ర జ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం మధ్యాహ్నం తరువాత ఆకాశం మేఘావృతమై చల్లటి గాలులు వీచాయి. 3.30 గంటల నుంచి ఈదురుగాలులతో వర్షం మొదలైంది. ఇదే సమయంలో వడగళ్లు కూడా భారీగా పడ్డాయి. వర్షపు నీటితోపాటు కొట్టుకుపోతూ అడ్డంకులు వున్నచోట కుప్పలుగా పేరుకుపోయాయి. వీటిని ఏరుకొని బకెట్లలో నింపడానికి పలువురు ప్రయత్నించారు.