Share News

నిప్పుల వర్షం

ABN , Publish Date - May 30 , 2026 | 12:36 AM

భానుడి ప్రతాపంతో జనం అల్లాడిపోయారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. గురువారంతో పోలిస్తే మూడు నుంచి ఐదు డిగ్రీల వరకు అదనంగా నమోదయ్యాయి.

నిప్పుల వర్షం
భానుడి ప్రతాపంతో నిర్మానుష్యంగా మారిన కోటవురట్ల మెయిన్‌రోడ్డు

భానుడి ప్రతాపంతో జనం విలవిల

21 మండలాల్లో 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదు

దేవరాపల్లిలో 44.5 డిడ్రీలు

సూర్యాస్తమయం తరువాత కూడా కొనసాగిన వడగాడ్పులు

అనకాపల్లి, మే 29 (ఆంధ్రజ్యోతి): భానుడి ప్రతాపంతో జనం అల్లాడిపోయారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. గురువారంతో పోలిస్తే మూడు నుంచి ఐదు డిగ్రీల వరకు అదనంగా నమోదయ్యాయి. ఉదయం ఏడు గంటల నుంచే ఎండ తీక్షణంగా కాసింది. పది గంటల నుంచి మొదలైన వడగాడ్పులు మధ్యాహ్నానికి తీవ్రరూపం దాల్చాయి. 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడ్డారు. దీంతో నిత్యం రద్దీగా వుండే ప్రధాన రహదారులు సైతం నిర్మానుష్యంగా మారాయి. ఎండతీవ్ర, వడగాడ్పులు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సూర్యాస్తమయం తరువాత కూడా వడగాడ్పులు కొనసాగడంతో శనివారం వాతావరణ పరిస్థితి ఎలా వుంటుంందోనని ప్రజలు గుబులుచెందుతున్నారు.

రాష్ట్ర విపత్తుల సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం శుక్రవారం దేవరాపల్లి మండలంలో 44.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గురువారంతో పోలిస్తే సుమారు నాలుగు డిగ్రీలు అదనం. జిల్లాలో మిగిలిన మండలాల్లో కూడా ఉష్ణోగ్రతలు ఇంచుమించుగా ఇదేమాదిరిగా నమోదయ్యాయి. గురువారం 40 డిగ్రీలకు పైబడి దేవరాపల్లి, బుచ్చెయ్యపేట మండలాల్లో మాత్రమే నమోదుకాగా.. శుక్రవారం అనకాపల్లి, అచ్యుతాపురం, రాంబిల్లి మినహా మిగిలిన 21 మండలాల్లో 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మండలాల వారీగా గరిష్ఠ ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. చోడవరంలో 44 డిగ్రీలు, బుచ్చెయ్యపేటలో 43.4, మాకవరపాలెంలో 43.4, చీడికాడలో 43.4, నర్సీపట్నంలో 43.7, మాడుగులలో 42,8, గొలుగొండలో 42.6, కె.కోటపాడులో 42.4, కశింకోటలో 42.4, కోటవురట్లలో 41.3, మునగపాకలో 41.4, నక్కపల్లిలో 42.8, పరవాడలో 41.2, పాయకరావుపేటలో 42.1, రావికమతంలో 43.6, రోలుగుంటలో 43.6, ఎస్‌.రాయవరంలో 43.7, సబ్బవరంలో 41.2, అనకాపల్లిలో 39, రాంబిల్లిలో 38.8, అచ్యుతాపురంలో 38.6 డిగ్రీలు నమోదయ్యాయి.

Updated Date - May 30 , 2026 | 12:36 AM