మన్యంలో వర్షం
ABN , Publish Date - Oct 17 , 2026 | 11:30 PM
బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలో శనివారం జల్లులతో మొదలై ఒక మోస్తరు వర్షం కురిసింది.
మధ్యాహ్నం వరకు ఎండ..
అనంతరం మోస్తరు వాన
అర్ధంతరంగా ముగిసిన ముంచంగిపుట్టు సంత
మెట్ట పంటలకు అనుకూలం
క్రమంగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
పాడేరు, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి):
బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలో శనివారం జల్లులతో మొదలై ఒక మోస్తరు వర్షం కురిసింది. గత మూడు రోజులుగా ఏజెన్సీలో ముసురు వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే శనివారం అందుకు భిన్నంగా ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఒక మోస్తరు ఎండకాసింది. అనంతరం జల్లులతో మొదలై మోస్తరు వర్షం కురిసింది. దీంతో జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ జల్లులు మెట్ట ప్రాంతంలో చేసే వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయని రైతులు అంటున్నారు. తాజా వాతావరణం నేపథ్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో కొయ్యూరులో శనివారం 22.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదుకాగా అరకులోయలో 20.9, చింతపల్లిలో 20.5, జి.మాడుగులలో 19.8, పాడేరులో 19.7, పెదబయలులో 17.7, ముంచంగిపుట్టులో 17.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ముంచంగిపుట్టులో
మండల పరిధిలో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఠారెత్తించింది. మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో జన జీవనం అస్త్యవస్తంగా మారింది. ఈ వర్షం స్థానిక వారపు సంతపై తీవ్ర ప్రభావం చూపించింది. పండగ సంత కావడంతో వ్యాపారం బాగా సాగుతుందని ఆశపడిన వ్యాపారులకు నిరాశే ఎదురైంది. సంత అరంతరంగా ముగిసిపోయింది. చిన్నపాటి పాకలలో వేసిన దుకాణాల్లోకి వర్షపు నీరు వచ్చేయడంతో సామాన్లు తడిచిపోయాయి. దీంతో తీవ్ర నష్టాం వాటిల్లిందని వ్యాపారులు వాపోయారు. అధికారులు స్పందించి సంత ప్రాంగణంలో రేకుల షెడ్లు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.