మన్యంలో వర్షం
ABN , Publish Date - Aug 22 , 2026 | 11:11 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏజెన్సీలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
అల్పపీడనమే కారణం
వరి పంటకు ఊరట
అయినా తగ్గని గరిష్ఠ ఉష్ణోగ్రతలు
పాడేరు/చింతపల్లి/హుకుంపేట/అనంతగిరి/ముంచంగిపుట్టు, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి):
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏజెన్సీలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా కేంద్రం పాడేరు, పరిసర ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి జల్లులు పడ్డాయి. మరికొన్ని మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా అల్పపీడన ప్రభావంతో ఒడిశాకు సరిహద్దున ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, జీకేవీధి మండలాల్లో అఽధికంగా వర్షం కురిసింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని పంట పొలాల్లోకి వర్షం నీరు వచ్చి చేరింది. తాజా వర్షాలు ఖరీఫ్ పంటల సాగుకు మేలు చేస్తాయని రైతులు అంటున్నారు. గతకొన్ని రోజులుగా ముసురు కొనసాగుతున్నా గరిష్ఠ ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గడం లేదు. దీంతో కొయ్యూరులో శనివారం 35.7 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా పాడేరులో 31.3, అరకులోయలో 30.5, చింతపల్లిలో 29.1, ముంచంగిపుట్టులో 27.1, పెదబయలులో 26.9, హుకుంపేటలో 25.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
చింతపల్లిలో..
చింతపల్లిలో భారీ వర్షం కురిసింది. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు కుండపోత వర్షం పడింది. దీంతో ఎండిపోతున్న వరి పంటకు కాస్త ఊరట లభించింది. వారం రోజులుగా సరైన వర్షం పడకపోవడంతో చింతపల్లి, జీకేవీధి మండలాల్లో వరి పొలాలు ఎండిపోయాయి. చెక్‌డ్యామ్, కొండవాగులు, జలాశయాలు దిగువనున్న పంట పొలాలకు మాత్రమే సాగునీరు అందేది. దీంతో గిరిజన రైతులు ఆందోళన చెందుతున్న సమయంలో వర్షం కురవడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా నెలాఖరు వరకు వర్షాలు పడితే వరి సాగుకు ఇబ్బంది ఉండదని రైతులు చెబుతున్నారు.
హుకుంపేటలో..
బంగాళాఖాతంలో అల్పపీడనంతో మండలంలో శనివారం తెల్లవారు జాము నుంచి ఏకధాటిగా సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది,. దీంతో హుకుంపేట సంతకు వచ్చిన వ్యాపారులు, గిరిజనులు ఇబ్బందులు పడారు. సంత ప్రాంతం చిత్తడిగా మారింది. దుకాణాలు ఏర్పాటు చేసిన నేల తడిసిపోవడంతో వస్త్రవ్యాపారులు అవస్థలు పడ్డారు. హుకుంపేట నుంచి కొంతెలి వరకు, హుకుంపేట-కామయ్యపేట రోడ్లపై ఏర్పడిన గోతుల్లో వర్షం నీరు చేరడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వర్షంతో గెడ్డలు, వాగులు, జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
అనంతగిరిలో..
అనంతగిరిలో ఉదయం నుంచి ముసురు వాతావరణం నెలకొంది. గతవారం రోజులుగా ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలంతా ఉక్కిరిబిక్కరయ్యారు. శనివారం ఉదయం నుంచి ముసురు పట్టడంతో కొంతవరకు వాతావరణం చల్లబడింది. ఈ వాతావరణంతో పర్యాటక ప్రాంతాలను తిలకించేందుకు సందర్శకులు తరలివచ్చారు.
ముంచంగిపుట్టులో
ముంచంగిపుట్టు మండలంలో శనివారం కుండపోత వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా వర్షం పడింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మండల కేంద్రంలో జరిగిన వారపు సంతపై వర్షం ప్రభావం తీవ్రంగా చూపించింది. వినియోగదారులు లేక వెలవెలబోయింది. పలు గ్రామాల్లో వాగులు, గెడ్డ పాయలు వరదనీటితో ఉధృతంగా ప్రవహించడంతో సంతకు ఎక్కువ మంది రాలేదు. వినియోగదారులు సరుకులు కొనుగోలుకు గొడుగులు వేసుకుని వచ్చారు. వర్షానికి మండల కేంద్రం నుంచి పలు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులపై నుంచి వరదనీరు ప్రహించింది. మట్టి రోడ్లు బురదమయంగా మారాయి.