Share News

మన్యంలో ముసురు

ABN , Publish Date - Sep 12 , 2026 | 11:22 PM

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి వర్షం దపదఫాలుగా కురుస్తోంది.

మన్యంలో ముసురు
అరకులోయలో వర్షం

వర్షాలకు పొంగి ప్రవహిస్తున్న గెడ్డలు

పంటలకు ఊపిరిపోసిన వర్షం

చిట్టంగరువులో కూలిన ఇల్లు

ముంచంగిపుట్టులో అత్యధిక వర్షపాతం

పాడేరు, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి):

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి వర్షం దపదఫాలుగా కురుస్తోంది. దీంతో గెడ్డలు, వాగుల ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వర్షం నీటితో పంట పొలాలు నిండిపోయి చెరువుల్లా దర్శనమిస్తున్నాయి. పాడేరు మండలంలోని మత్స్యగెడ్డ, రాయిగెడ్డ, చిలకలమామిడి గెడ్డ, పాడేరు, పెదబయలు మండలాలకు సరిహద్దున ఉన్న పరదానిపుట్టు గెడ్డ, జి.మాడుగుల మండలంలోని కోడిమామిడి గెడ్డ, మత్స్యగెడ్డ, ముంచంగిపుట్టు, పెదబయలు, అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లోని గెడ్డల ఉధృతి తగ్గలేదు. అలాగే పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల, డుంబ్రిగుడ మండలాల్లో గెడ్డలకు అవతల ఉన్న జనం పల్లెలకే పరిమితమవుతున్నారు. తాజా వాతావరణంతో మారుమూల ప్రాంత జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నది.

ఏజెన్సీలో ముంచంగిపుట్టులో శనివారం 34.25 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదుకాగా పెదబయలులో 27.5, చింతపల్లిలో 27, జీకేవీధిలో 20.5, హుకుంపేటలో 20.25, కొయ్యూరులో 17.5, అరకులోయలో 15.25, పాడేరులో 14, జి.మాడుగులలో మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ఇతర ప్రాంతాల్లో జల్లులతో కూడిన వర్షం కురిసింది.

ముంచంగిపుట్టులో..

మండలంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు కుండపోతగా పడింది. తర్వాత కాస్త తెరుపునిచ్చింది. దీంతో మండల కేంద్రంలో జరిగే వారపు సంతకు ఎటువంటి ఇబ్బందులు లేవనుకుంటున్న తరుణంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో సంతకు వచ్చిన వారు వెనుదిరగడంతో పండగ సంత ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో వ్యాపారులు తీవ్ర నిరాశ చెందారు. సాయంత్రం భారీ వర్షం పడడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రహదారులు చిత్తడైపోయాయి. వాగులు, వంకలు వరదనీటితో ఉధృతంగా ప్రవహించాయి.

చింతపల్లిలో

మండలంలో మోస్తరు వర్షం కురిసింది. గిరిజన ప్రాంతంలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు మోస్తరు వర్షం కురిసింది. వర్షానికి ప్రధాన రహదారులు వాగులను తలపించాయి. పంట పొలాలు, చెరువులకు అధికంగా వర్షపు నీరు చేరుకున్నది. వర్షాలు పడుతుండడంతో గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా లంబసింగి పంచాయతీ చిట్టంగరువు గ్రామంలో వర్షాలకు కొర్ర లక్ష్మణరావు గిరిజనుడు గృహం పడిపోయింది. ఇంటి సామగ్రి ధ్వంసం కాగా, వరండాలో ఉన్న రెండు మేకలు మృతి చెందాయి. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు, మాజీ సర్పంచ్‌ కొర్ర రఘునాథ్‌ విజ్ఞప్తి చేశారు.

హుకుంపేటలో..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మండలంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు భారీ వర్షం కురిసింది. దీంతో ఉదయం సంతకు వచ్చిన కొనుగోలుదారులు, వ్యాపారులు, రైతులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. వ్యాపారులు సంతలో దుకాణాలు ఏర్పాటు చేయడానికి తిప్పలు పడ్డారు. సంత ప్రాంగణం అంతా బురదగా ఉండడంతో జనం కొనుగోలు చేయడానికి చాలా తక్కువగా వచ్చారని వ్యాపారులు తెలిపారు. హుకుంపేట వారపు సంతలో షెడ్లు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని, ఏడాదికి సంత వేలం లక్షలాది రూపాయలు పంచాయతీకి ఆదాయం వస్తున్నా అభివృద్ధి చేయడం లేదని వారు వాపోయారు.

జి.మాడుగులలో..

ఎల్‌నినో ప్రభావంతో నిరాశ చెందిన రైతులు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుక్ర, శనివారాల్లో కురిసిన వర్షం వరితోపాటు ఇతర పంటలకు ఎంతో మేలని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాజ్‌మా సాగు చేపట్టడానికి ఈ వర్షం అనుకూలమని, రైతులు ఉపయోగించుకోవాలని వారు సూచించారు.

అరకులోయలో...

అరకులోయలో శనివారం ఉదయం మోస్తరు వర్షం పడింది. సాయంత్రం వరకు ముసురు వాతావరణం నెలకొంది. రెండు రోజుల నుంచి ఓ మోస్తరు వర్షం పడుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Sep 12 , 2026 | 11:22 PM