Share News

చకచకా రైల్వే జోన్‌ పనులు

ABN , Publish Date - May 03 , 2026 | 12:39 AM

ముడసర్లోవలో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యాలయ భవన నిర్మాణం పనులు చకచకా జరుగుతున్నాయి.

చకచకా రైల్వే జోన్‌ పనులు

  • ముడసర్లోవలో కార్యాలయ భవ నిర్మాణం

  • బేస్‌మెంట్‌ 1+బేస్‌మెంట్‌ 2+గ్రౌండ్‌+తొమ్మిది అంతస్థులు

  • తాజా అంచనా వ్యయం రూ.183.58 కోట్లు

  • మొత్తం ఫ్లోర్‌ ఏరియా 36,128.50 చ.మీ.

విశాఖపట్నం, మే 2 (ఆంధ్రజ్యోతి):

ముడసర్లోవలో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యాలయ భవన నిర్మాణం పనులు చకచకా జరుగుతున్నాయి. 2027 చివరికి దీనిని పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. తొలుత రూ.172 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించగా, ఆ తరువాత దీనిని రూ.183.58 కోట్లతో లోక్‌సభకు సమర్పించారు. రైల్వేకు జీవీఎంసీ 52.2 ఎకరాల భూమి అప్పగించగా, గత ఏడాది జనవరి 8న భవన నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.

ఈ భూమిలో బేస్‌మెంట్‌ 1+బేస్‌మెంట్‌ 2 +గ్రౌండ్‌+తొమ్మిది అంతస్థుల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించి, దాని ప్రకారమే పనులు చేస్తున్నారు. బిల్టప్‌ ఏరియా 27,548.30 చ.మీ. కాగా మొత్తం ఫ్లోర్‌ ఏరియా 36,128.50 చ.మీ. బేస్‌మెంట్లు, ఓపెన్‌ ఏరియాతో కలుపుకొని 290 కార్లు, 615 ద్విచక్ర వాహనాలు పార్కింగ్‌ చేసుకునే సౌకర్యం ఉంటుంది.

గ్రౌండ్‌ ఫ్లోర్‌లో లాబీ, ఆడిటోరియం, గ్రీన్‌ రూమ్స్‌, సెక్యూరిటీ, బ్యాక్‌ ఆఫీస్‌ ఉంటాయి. మొదటి అంతస్థు నుంచి తొమ్మిదో అంతస్థు వరకు వివిధ విభాగాల వారీగా కార్యాలయాలు వస్తాయి. మొదటి అంతస్థులో కమర్షియల్‌ విభాగం, జోనల్‌ ఆఫీస్‌, సీపీఆర్‌ఓ కార్యాలయం ఉంటాయి. ప్రతి అంతస్థులో 2,702.83 చ.మీ. విస్తీర్ణం వచ్చేలా నిర్మాణాలు చేస్తున్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో సర్వీస్‌ ఏరియా 851 చ.మీ., మిగిలిన అంతస్థుల్లో 525 చ.మీ. కేటాయించారు. వర్షపు నీటిని సంరక్షించడానికి 25 ప్రాంతాల్లో రీచార్జింగ్‌ పాయింట్లు పెడుతున్నారు. మొత్తం నాలుగు లిప్టులు ఉంటాయి. ఒక్కొక్కటి 20 మందిని తీసుకువెళ్లే సామర్థ్యం ఉంటుంది. ప్రస్తుతం ముడసర్లోవలో జరుగుతున్న పనులను చీఫ్‌ ఇంజనీర్‌ పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - May 03 , 2026 | 12:39 AM