పట్టాలెక్కని రైల్వే జోన్
ABN , Publish Date - Jan 23 , 2026 | 12:32 AM
విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా జోన్‌కు తాత్కాలిక కార్యాలయం (సిరిపురం) సిద్ధమైనా, శాశ్వత కార్యాలయం నిర్మితమవుతున్నా...ఆపరేషన్‌కు అవసరమైన గెజిట్ నోటిఫికేషన్‌ను రైల్వే బోర్డు ఇప్పటివరకూ ఇవ్వలేదు.
ఇంకా ప్రారంభం కాని కార్యకలాపాలు
గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాకపోవడమే కారణం
ఉద్దేశపూర్వకంగానే రైల్వే బోర్డు తాత్సారం
తూర్పు కోస్తా జోన్‌లో కొత్తగా ఏర్పాటైన రాయగడ డివిజన్ పనులు మాత్రం పరుగులు
4 కంట్రోల్ ఆఫీసుల ఏర్పాటుకు ఉత్తర్వులు
ఆ డివిజన్‌లోకే అరకులోయ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా జోన్‌కు తాత్కాలిక కార్యాలయం (సిరిపురం) సిద్ధమైనా, శాశ్వత కార్యాలయం నిర్మితమవుతున్నా...ఆపరేషన్‌కు అవసరమైన గెజిట్ నోటిఫికేషన్‌ను రైల్వే బోర్డు ఇప్పటివరకూ ఇవ్వలేదు. కానీ తూర్పు కోస్తా జోన్‌లో కొత్తగా ఏర్పాటైన రాయగడ డివిజన్‌కు మాత్రం అవసరమైనవన్నీ సమకూరుస్తోంది.
తూర్పు కోస్తా జోన్‌లో మూడు డివిజన్లు (వాల్తేరు, ఖుర్దా రోడ్, సంబల్‌పూర్) ఉండేవి. అందులో వాల్తేరు డివిజన్ కేంద్రమైన విశాఖను దక్షిణ కోస్తా జోన్‌గా మార్చడం జరిగింది. దాంతో తూర్పు కోస్తా జోన్‌లో రెండే డివిజన్లు మిగిలాయి. ప్రతి జోన్‌లో మూడు డివిజన్లు ఉండాలనే నిబంధన మేరకు కొత్తగా రాయగడ డివిజన్ ఏర్పాటుచేశారు. ఏపీలో కొంత భాగం, ఒడిశాలో కొంత కలిపి రాయగడ డివిజన్ ఏర్పాటుచేశారు. అయితే ఇక్కడ జోన్ పనులు కొలిక్కి రాకముందే...రాయగడ డివిజన్ పనులు మాత్రం చకచకా సాగిపోతున్నాయి. స్టేషన్‌ను విస్తరించారు. ప్లాట్‌ఫారాల సంఖ్య పెంచారు. తాజాగా ఆ డివిజన్‌లో నాలుగు కంట్రోల్ ఆఫీసు అప్లికేషన్లు (సీఓఏ) ఏర్పాటుచేయాలని ఆదేశాలు ఇచ్చారు. కొత్తవలస-కొరాపుట్, కొరాపుట్-కిరండూల్, రాయగడ-కొరాపుట్-కూనేరు-రాయగడ-తిరువలి, పర్లాకిమిడి-గుణుపూర్‌లకు నాలుగు కంట్రోల్ బోర్డులను ఏర్పాటుచేయాలని సూచించారు. డివిజన్ ఆపరేషన్లు సాఫీగా నడవడానికి ఇవి అవసరమని, తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొత్తజోన్‌లో భాగంగా ఏర్పడిన రాయగడ డివిజన్‌పై చూపిస్తున్న శ్రద్ధ దక్షిణ కోస్తా జోన్‌పై ఎందుకు చూపించడం లేదని రైల్వే వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
కొత్తవలస స్టేషన్ ఒక్కటే ఇక్కడే
కొత్తవలస స్టేషన్ సహా అరకు వరకు 100 కి.మీ. పొడవైన లైన్‌ను రాయగడ డివిజన్‌లోకి తీసుకుంటామని తూర్పు కోస్తా జోన్ ప్రతిపాదించింది. ఇది అంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రాంతం. ఏపీ అంతటికీ దక్షిణ కోస్తా రైల్వే జోన్ అన్నప్పుడు ఈ 100 కి.మీ. మినహాయించాలని, వాల్తేరు డివిజన్‌లోనే ఉంచాలని ఈ ప్రాంత ఎంపీలు రైల్వే మంత్రిని కోరారు. కానీ ఆయన ఒడిశాకు చెందినవారు కావడంతో వీలు కాలేదు. తాజాగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఒక్క కొత్తవలస స్టేషన్‌ను మాత్రం వాల్తేరు డివిజన్‌లో ఉంచి, అక్కడి నుంచి కిలోమీటరు దూరం తరువాత ప్రారంభమయ్యే కిరండూల్ లైన్ అంతా రాయగడ డివిజన్‌లో చేర్చారు. ఇక విజయనగరం వైపు వెళ్లే లైన్‌ను కూనేరు వరకూ వాల్తేరు డివిజన్‌లో ఉంచి, ఆపై లైన్ అంతా రాయగడ డివిజన్‌లో ఉంచేశారు.
తక్షణమే గెజిట్ ఇవ్వాలి
చలసాని గాంధీ, రైల్వే జోన్ పోరాట కమిటీ కన్వీనర్
రాయగడ డివిజన్‌కు అవసరమైనవి ఎలా ఇస్తున్నారో...విశాఖ రైల్వే జోన్‌లో కార్యకలాపాల ప్రారంభానికి అవసరమైన గెజిట్ నోటిఫికేషన్ కూడా ఆ విధంగానే ఇవ్వాలి. దీనిపై ఈ ప్రాంత నాయకులు పార్లమెంటులో గట్టిగా మాట్లాడాలి.