పక్కాగా రైల్వే స్టేషన్ అభివృద్ధి
ABN , Publish Date - Nov 15 , 2026 | 12:55 AM
విశాఖపట్నం రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి.
రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సదుపాయాల కల్పన
ప్లాట్‌ఫారాలు 8 నుంచి 14కు పెంపు
3, 5, 6 ప్లాట్‌ఫారాలు విస్తరణ
220 కార్లు, 2 వేల ద్విచక్ర వాహనాలు,
150 ఆటోల పార్కింగ్‌కు ఏర్పాట్లు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతులు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం స్టేషన్‌లో ఎనిమిది ప్లాట్‌ఫారాలే ఉన్నాయి. రైల్వే లైన్లు కూడా సరిపోవడం లేదు. దీంతో విశాఖపట్నానికి ఏ రైలు వచ్చినా దానిని నగర శివార్లలో సుమారు పది నుంచి ఇరవై నిమిషాలు నిలిపివేయాల్సి వస్తోంది. కొన్నిసార్లు వాటికి కేటాయించిన ప్లాట్‌ఫారాలను కూడా అప్పటికప్పుడు మార్చాల్సి వస్తోంది. స్టేషన్ ప్రయాణికుల అవసరాలకు తగినట్టుగా లేదు. ప్రధాన రైళ్లు వచ్చినప్పుడు ప్రయాణికులు తోసుకుంటూ రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.450 కోట్లు మంజూరుచేసిన సంగతి తెలిసిందే. కొత్త కాంట్రాక్టర్లు పనులు వేగవంతం చేస్తున్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ జీఎం సందీప్ మాధుర్, ఇతర అధికారులు ఇక్కడే ఉండడంతో ఆయా పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన సూచనలతో మరింత ముందుకు తీసుకువెళుతున్నారు. కేవలం రైల్వే స్టేషన్ మాత్రమే కాకుండా 60 ఎకరాల విస్తీర్ణంలో కోచింగ్ యార్డును కూడా అభివృద్ధి చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశించడంతో రెండింటిని కలిపి చేస్తున్నారు.
ఇవీ పురోగతిలో ఉన్న పనులు
విశాఖ స్టేషన్ నుంచి రోజూ సుమారుగా 80వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. రైళ్లు 120 వరకు వస్తున్నాయి. వెళుతున్నాయి. అందుబాటులో ఉన్న ఎనిమిది ప్లాట్‌ఫారాలను 14కు పెంచుతూ డిజైన్ తయారుచేశారు. కొత్తవన్నీ జ్ఞానాపురం వైపు వస్తాయి. పదో ప్లాట్‌ఫారం నుంచి 14వ ప్లాట్‌ఫారం వరకూ కేటాయించిన గోడల నిర్మాణానికి తవ్వకపు పనులన్నీ పూర్తయ్యాయి. నిర్మాణ పనులు మొదలు కావలసి ఉంది. వీటితో పాటు 3, 5, 6 ప్లాట్‌ఫారాలను విస్తరిస్తారు.
- రైల్వే లైన్లు 11 నుంచి 16కు పెంచుతున్నారు. స్టేషన్ భవనాన్ని గ్రౌండ్+2 డిజైన్‌తో నిర్మిస్తున్నారు. పార్కింగ్ సౌకర్యం 220 కార్లు, 2 వేల ద్విచక్ర వాహనాలు, 150 ఆటోలకు సరిపడా ఉండేలా డిజైన్ చేశారు. ప్రస్తుతం తూర్పు వైపు 5,860 చ.మీ. విస్తీర్ణంలో పార్కింగ్ నిర్మాణ పనులు పూర్తయి అందుబాటులోకి వచ్చింది. అదేవిధంగా పశ్చిమం వైపు 4 వేల చ.మీ. పార్కింగ్ నిర్మాణం పూర్తయింది. ఉత్తరం వైపు ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ప్రయాణికుల రిజర్వేషన్ కాంప్లెక్స్ భవనం శ్లాబు పనులు పూర్తయ్యాయి.