రైల్వే డీఆర్‌ఎం తనిఖీలు
ABN , Publish Date - Jan 08 , 2026 | 01:18 AM
వాల్తేరు డివిజన్‌లోని మెయిన్ లైన్‌లో సింహాచలం నుంచి చీపురుపల్లి వరకూ బుధవారం డీఆర్‌ఎం లలిత్ బొహ్రా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
విశాఖపట్నం, జనవరి 7 (ఆంధ్రజ్యోతి):
వాల్తేరు డివిజన్‌లోని మెయిన్ లైన్‌లో సింహాచలం నుంచి చీపురుపల్లి వరకూ బుధవారం డీఆర్‌ఎం లలిత్ బొహ్రా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. రైళ్ల ఆపరేషన్ సజావుగా సాగడం, భద్రత, మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలపై అక్కడి అధికారులతో చర్చించారు. సింహాచలం నార్త్‌లో ప్రతిపాదించిన రైల్ ఓవర్ రోడ్ ప్రాజెక్టు పనులు పరిశీలించారు. ఆ మార్గంలోని పెందుర్తి, కొత్తవలస, కంకటాపల్లి, అలమండ, విజయనగరం యార్డ్, నెల్లిమర్ల, గరివిడి, చీపురుపల్లి స్టేషన్లను తనిఖీ చేశారు. ఆయా ప్రాంతాల్లో వంతెనలు, యార్డులు, భద్రతకు సంబంధించిన అంశాలపై అక్కడికక్కడే పలు ఆదేశాలు జారీచేశారు. స్టేషన్లలో వసతులు, సిబ్బందికి సౌకర్యాలు, సిగ్నలింగ్ పనితీరు, క్రాసింగ్‌లు, పాయింట్లు, ఎల్‌సీ గేట్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు అన్నీ తనిఖీ చేశారు. ఆయన వెంట సీనియర్ అధికారులు కూడా ఉన్నారు.