Share News

జోరుగా రాగుల నాట్లు

ABN , Publish Date - Aug 27 , 2026 | 12:33 AM

ఖరీఫ్‌ సీజన్‌ నేపథ్యంలో గిరిజన గ్రామాల్లో చోడి(రాగులు) నాట్లు ముమ్మరంగా వేస్తున్నారు. ఏజెన్సీలో వరి సాగు తర్వాత చోడి సాగుకే గిరిజనులు అధిక ప్రాధాన్యం ఇస్తారు. దీంతో ఏ గిరిజన పల్లెలో చూసినా చోడి నాట్లు వేస్తున్న పనుల్లో ఉన్న గిరిజనులే కనిపిస్తున్నారు.

జోరుగా రాగుల నాట్లు
పెదబయలు మండలం తమరాడ గ్రామంలో రాగుల నాట్లు వేస్తున్న గిరి రైతులు

వర్షాలు అనుకూలించడంతో సాగుపై దృష్టి

ఏజెన్సీలో సుమారు 15,648 హెక్టార్ల విస్తీర్ణంలో పంట

సాగు విస్తీర్ణంలో వరి తర్వాత స్థానం రాగుల పంటదే

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

ఖరీఫ్‌ సీజన్‌ నేపథ్యంలో గిరిజన గ్రామాల్లో చోడి(రాగులు) నాట్లు ముమ్మరంగా వేస్తున్నారు. ఏజెన్సీలో వరి సాగు తర్వాత చోడి సాగుకే గిరిజనులు అధిక ప్రాధాన్యం ఇస్తారు. దీంతో ఏ గిరిజన పల్లెలో చూసినా చోడి నాట్లు వేస్తున్న పనుల్లో ఉన్న గిరిజనులే కనిపిస్తున్నారు.

ఏజెన్సీ వ్యాప్తంగా ఖరీఫ్‌ సీజన్‌లో సుమారుగా 36 వేల హెక్టార్లలో వరి పంటను సాగు చేయగా, సుమారుగా 16 వేల హెక్టార్లలో చోడి పంటను పండిస్తుంటారు. రాగులను ప్రధాన ఆహార పంటగా గిరిజనులు సాగు చేస్తుంటారు. సాగునీటి సదుపాయం ఉన్న పల్లపు ప్రాంతాల్లో వరిని పండిస్తే, కాస్త మెట్ట, కొండ ప్రాంతాల్లో చోడి పంటను వేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు భూమి మెత్తబడడంతో గిరిజనులు తొలి దుక్కి పనులు పూర్తి చేసి, జోరుగా చోడి నాట్లు వేస్తున్నారు. కొండవాలు ప్రాంతాల్లో నీటి తడి ఎక్కువ అవసరం లేని ప్రాంతాల్లో సైతం ఈ పంట పండుతుంది. దీంతో గిరిజనులు తమ గ్రామాలకు చేరువగా ఉన్న మెట్ట, కొండ ప్రాంతాల్లో చోడి సాగు చేస్తున్నారు. చోడిని పండించి, వాటిని పిండి చేసుకుని ఏడాదంతా గిరిజనులు నిల్వ చేసుకుంటారు. ఆ పిండితో జావ(అంబలి)చేసుకుని ప్రతి రోజు ఆహారంగా తీసుకుంటారు. తక్కువ ఖర్చుతో ఆహారం సమకూరడంతో పాటు చోడిలో పిండి పదార్థాలు, ఇనుము, తదితర పోషక విలువలు ఉండడంతో గిరిజనులకు ఆరోగ్యపరంగా మేలు చేస్తున్నది.

సాగుకు కానరాని ప్రత్యేక సాయం

ఏజెన్సీలో రాగులు సాగు చేసే గిరిజన రైతులకు ప్రభుత్వం, వ్యవసాయ శాఖ సంపూర్ణంగా ఎటువంటి ప్రత్యేక సాయం చేయకపోయినా గిరిజనులు మాత్రం తాము పండించిన పంట నుంచే కొంత మేరకు విత్తనాలు సమకూర్చుకుని, వాటిని పొదుపు చేసుకుని చోడి సాగును ప్రతి ఏడాది చేపడుతున్నారు. చిరు ధాన్యాల జాబితాలో ఉన్న చోడి పంటకు ప్రభుత్వపరంగా ప్రత్యేక సాయం అందించడంతో పాటు ఆ పంట అంతరించిపోకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు. అలాగే ఎటువ ంటి ఎరువులు, క్రిమిసంహారక మందులను వినియోగించకుండా సంప్రదాయబద్ధంగా, సేంద్రీయ విధానంలో సాగు చేసే చోడి పంటను ఏజెన్సీలో మరింతగా అభివృద్ధి చేసేందుకు పాలకులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని గిరిజన రైతులు కోరుతున్నారు.

Updated Date - Aug 27 , 2026 | 12:33 AM