ట్రాఫిక్ పోలీసింగ్‌లో సమూల మార్పులు
ABN , Publish Date - May 20 , 2026 | 12:28 AM
విశాఖ మెట్రో నగరంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ట్రాఫిక్, పోలీసింగ్ వ్యవస్థలో సమూల మార్పులు చేయనున్నట్టు డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా పేర్కొన్నారు.
డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా
కంచరపాలెం ట్రాఫిక్, ఎయిర్‌పోర్టు ట్రాఫిక్, క్రైమ్ స్టేషన్ల కోసం మర్రిపాలెంలో రూ.3.5 కోట్లతో నిర్మించిన భవనం ప్రారంభోత్సవం
అవసరమైతే అదనంగా మరో సైబర్ స్టేషన్ ఏర్పాటుచేస్తామని ప్రకటన
ఎన్‌ఏడీ జంక్షన్, మే 19 (ఆంధ్రజ్యోతి):
విశాఖ మెట్రో నగరంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ట్రాఫిక్, పోలీసింగ్ వ్యవస్థలో సమూల మార్పులు చేయనున్నట్టు డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా పేర్కొన్నారు. మర్రిపాలెం రైతుబజార్ సమీపంలో రూ.3.5 కోట్లతో నూతనంగా నిర్మించిన జి+1 భవనంలో కంచరపాలెం ట్రాఫిక్, ఎయిర్‌పోర్టు ట్రాఫిక్, క్రైమ్ పోలీస్ స్టేషన్‌లను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ విశాఖ నగరం రానున్న ఐదేళ్లలో మెట్రో స్థాయికి చేరుతుందన్నారు. అందుకు అనుగుణంగా ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు మరిన్ని చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. నగర జనాభాతో పాటు పెరుగుతున్న నేరాల నియంత్రణ, సైబర్ నేరాల అదుపునకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నామన్నారు. అవసరమైతే అదనంగా మరో సైబర్ స్టేషన్‌ను ఏర్పాటుచేస్తామన్నారు. అనంతరం నూతన భవనంలో తొలి ఫైలుపై సంతకం చేశారు. స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి, జోన్ 2 డీసీపీ మేరీ ప్రశాంతి, క్రైమ్ డీసీపీ లతామాధురి, అడ్మిన్ డీసీపీ పాపారావు, ఏడీసీపీ నారాయణరావు, జోన్-1 డీసీపీ (లా అండ్ ఆర్డర్) మణికంఠ, ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్‌కుమార్, ఏసీపీ ట్రాఫిక్ ఎం.శ్రీనివాసరావు, వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ సీఐ ఎం.చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.