Share News

ప్రైవేటు ఆస్పత్రుల్లో మందుల దందా!

ABN , Publish Date - Jun 28 , 2026 | 01:01 AM

నగరంలో కొన్ని కార్పొరేట్‌, ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు రోగుల నుంచి వీలైనంత పిండుకునే ధోరణి ప్రదర్శిస్తున్నాయి.

ప్రైవేటు ఆస్పత్రుల్లో మందుల దందా!

ధనార్జనే ధ్యేయం

డాక్టర్‌ రాసిన మందులకు బదులుగా జనరిక్‌ మెడిసిన్‌ అమ్మకం

అవి కూడా రేటు తగ్గించకుండా ఎంఆర్‌పీకి అమ్మకం

కొన్ని చోట్ల డాక్టర్‌ చాంబర్‌లోనే మందుల విక్రయం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో కొన్ని కార్పొరేట్‌, ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు రోగుల నుంచి వీలైనంత పిండుకునే ధోరణి ప్రదర్శిస్తున్నాయి. దీంతో వైద్యులపై రోగులకు విశ్వాసం పోతోంది. అందుకే చాలామంది కాస్త ఆప్యాయంగా మాట్లాడే వైద్యులు ఉండే చిన్న ఆస్పత్రులకు వెళుతున్నారు.

నగరంలోని కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రులు రోగులను మోసం చేస్తున్నాయి. అత్యధిక వేతనాలు ఇచ్చి స్పెషలిస్టులను నియమించుకుంటున్నాయి. దానికి తగ్గట్టుగా వారు యాజమాన్యానికి లబ్ధి కలిగేందుకు అవసరం లేని వైద్య పరీక్షలు సీటీ స్కాన్‌, అబ్డామెన్‌ స్కాన్‌ వంటివి రాసి చేతి చమురు వదిలేలా చేస్తున్నారు. ఆ పరీక్షలు పూర్తయ్యాక, రిపోర్టులు వచ్చాకే చికిత్స చేస్తున్నారు. మందులు కూడా ఖరీదైనవే రాస్తున్నారు. వారం,పది రోజులకు బదులు నెలకు సరిపడా మందులు తీసుకోవాలని సూచిస్తున్నారు. అవన్నీ అక్కడే దొరుకుతాయని, బయట లభించవని, కొనుక్కొని వెళ్లాలని ఒత్తిడి పెడుతున్నారు. తీరా అక్కడి ఫార్మసీకి వెళితే...రాసిన పది మందుల్లో రెండు, మూడు మాత్రమే ఇచ్చి, మిగిలినవి లేవని, వేరే కంపెనీవి ఉన్నాయని, అవి కూడా వాడుకోవచ్చునని జనరిక్‌ మందులు ఇస్తున్నారు. ఆ మందులపై బయట 50 నుంచి 70 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. మెడిప్లస్‌ వంటి సంస్థలు కూడా అలాగే విక్రయిస్తున్నాయి. ఈ కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో మాత్రం జనరిక్‌ ముందులు ఇచ్చి, వాటిపై ముద్రించిన ఎంఆర్‌పీ ధరలే తీసుకుంటున్నారు. రూపాయి కూడా డిస్కౌంట్‌ ఇవ్వడం లేదు. రోగి వచ్చిన దగ్గర నుంచి వెళ్లిపోయే వరకు అన్ని రకాలుగా మోసం చేస్తున్నారు. మందులు బయట తీసుకుంటామని ఎవరైనా చెబితే...‘ఆ విషయం డాక్టర్‌కు చెప్పండి’ అని భయపెడుతున్నారు. ఈ తరహా మోసాలు చాలా ఆస్పత్రుల్లో జరుగుతున్నాయి. దీంతో ఆ ఆస్పత్రుపై నమ్మకం కుదరక చిన్న ఆస్పత్రులకు వెళ్లి చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది.

రోగి చెప్పింది వినిపించుకోరు

కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లలో ఒక్కో డాక్టర్‌ దగ్గర నలుగురి నుంచి ఐదుగురు సహాయకులు ఉంటారు. రోగి వివరాలు నమోదు చేసి డబ్బులు తీసుకునేది ఒకరైతే, వారిని వెయిటింగ్‌ ఏరియాలో కూర్చోబెట్టి క్యూలో పంపడానికి మరొకరు, లోపల డాక్డర్‌ దగ్గర ఇంకొకరు, డాక్టర్‌ రాసిన చీటీలో మందులు దగ్గరుండి అక్కడే కొనిపించి, వాటిని వివరించడానికి మరొకరు ఉంటున్నారు. కొన్ని క్లినిక్స్‌లో రోగికి అవసరం లేని ఖరీదైన మందులు కొనిపిస్తున్నారు. ఇక రోగి చెప్పింది చాలామంది వైద్యులు వినిపించుకోవడం లేదు. వచ్చిన జబ్బు ఏమిటో కూడా చెప్పడం లేదు. కన్సల్టేషన్‌ ఫీజుగా రూ.500 నుంచి రూ.1,200 వరకు తీసుకుంటూ కనీసం రెండు నిమిషాలు కూడా రోగితో మాట్లాడరు. వారికి రోగం నయమవుతుందనే భరోసా కల్పించడం లేదు. వైద్యులు యాజమాన్యాలతో కుమ్మక్కు కావడం ఆపి, రోగితో సానుకూలంగా కొద్దిసేపు మాట్లాడితే వారి వృత్తికి న్యాయం చేసినవారవుతారు.

Updated Date - Jun 28 , 2026 | 01:01 AM