Share News

దేవుడి పేరిట దందా

ABN , Publish Date - Sep 16 , 2026 | 01:07 AM

గాజువాకలో వినాయక చవితి ఉత్సవాలను వ్యాపారాత్మకంగా మార్చేసి ఏటా లక్షలాది రూపాయల సొమ్ము చేసుకుంటున్న ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈ ఏడాదీ అదే చేసింది.

దేవుడి పేరిట దందా

గాజువాకలో షరామామూలే

దుకాణం తెరిచిన ‘వినాయక చవితి’ ఉత్సవాల నిర్వాహకులు

యమలోకం సెట్‌ వీక్షణకు టికెట్‌ రూ.100

డైనోసార్‌ పార్క్‌ సెట్‌కు రూ.80

ప్రాంగణంలో పదుల సంఖ్యలో వ్యాపారాలు

అనుమతులు లేకుండానే...

విగ్రహం తప్ప మిగిలినవన్నీ తీసేయాలని పోలీసుల ఆదేశం

విశాఖపట్నం/గాజువాక, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి):

గాజువాకలో వినాయక చవితి ఉత్సవాలను వ్యాపారాత్మకంగా మార్చేసి ఏటా లక్షలాది రూపాయల సొమ్ము చేసుకుంటున్న ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈ ఏడాదీ అదే చేసింది. గాజులతో అది పెద్ద వినాయకుడిని ఏర్పాటు చేసి, చుట్టూ వ్యాపార కార్యకలాపాలకు తెరలేపింది. ఆవరణలో యమలోకం సెట్‌ వేసి రూ.100 టికెట్‌ వసూలు చేస్తోంది. ఆ పక్కనే డైనోసార్‌ పార్క్‌ సెట్‌ వేసి దానికి రూ.80 టికెట్‌ పెట్టింది. ఆవరణలో మరో 20 వరకు వివిధ వ్యాపారాలకు స్టాళ్లు ఏర్పాటుచేసి నిర్వహిస్తున్నారు. అయితే అక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి పార్కింగ్‌ సౌకర్యం కల్పించలేదు. ఈ విషయాన్ని సోమవారం రాత్రి గమనించిన స్థానిక పోలీసులు మంగళవారం దానిపై దృష్టిపెట్టారు. సాయంత్రం కాగానే వాహనాలను జాతీయ రహదారిపై పార్కింగ్‌ చేసి భక్తులు వందల సంఖ్యలో లోపలకు వెళుతుండటంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వెంటనే స్పందించిన ఉత్తర, దక్షిణ ఏసీపీలు, జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌, ఆర్‌ అండ్‌ బి తదితర విభాగాలకు చెందిన అధికారులు బృందంగా ఏర్పడి మంగళవారం రాత్రి జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ చేశారు. సాధారణ భక్తుల్లా వెళ్లారు. అక్కడ టికెట్లు వసూలు చేస్తున్న సెట్లను పరిశీలించారు. వ్యాపార స్టాళ్లను పరిశీలించారు. ఆ తరువాత నిర్వాహకులైన ఎస్‌వీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రతినిధి గణేశ్‌ని పిలిచి అనుమతులు ఏమి తీసుకున్నారో చూపించాలని కోరారు. కేవలం వినాయక ప్రతిమ ఏర్పాటుకు అనుమతి తీసుకొని, ఇతర వ్యాపారాలు అనధికారికంగా నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. వందల సంఖ్యలో భక్తులు వస్తున్నందున ఏమైనా జరిగితే ఎలాంటి భద్రత కల్పిస్తారని ప్రశ్నించగా తెల్లముఖం వేశారు. అగ్నిమాపక దళం, జీవీఎంసీ, ఇంకా పోలీసుల నుంచి కూడా ఎటువంటి అనుమతులు తీసుకోలేదని గుర్తించారు. ఒక్క వినాయక ప్రతిమ తప్ప ఇంకే వ్యాపారాలు ఉండకూడదని, వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించారు. ఆ వినాయక దర్శనం కూడా ఉచితంగానే కల్పించాలని ఆదేశించారు. దీనిపై నోటీసు జారీచేస్తున్నామని గాజువాక సీఐ వాసునాయుడు తెలిపారు.

నిర్వాహకుల రగడ

అధికారుల బృందం వ్యాపార కార్యకలాపాలు నిలిపివేయాలని చెప్పగానే నిర్వాహకులు డ్రామాకు తెరతీశారు. పెద్ద పెద్దగా అరుస్తూ రేపు ఉదయమే వినాయకుడి నిమజ్జనం చేసేస్తామని ప్రకటించారు. ఆ వెంటనే కొందరు మహిళలు వచ్చి, తాము పది రోజుల నుంచి కష్టపడి గాజులతో వినాయకుడి బొమ్మ తయారుచేశామని, మా కష్టం చూడరా? అంటూ పెడబొబ్బలు పెట్టారు. అయితే పోలీసులు మాత్రం వెనక్కి తగ్గలేదు. వినాయకుడి మండపాల్లో వ్యాపారాలకు అనుమతి లేదని, వాటిని మూసేయాలని స్పష్టంచేశారు.

Updated Date - Sep 16 , 2026 | 01:07 AM