Share News

విద్యుత్‌ వినియోగదారుల సమస్యలు సత్వర పరిష్కారం

ABN , Publish Date - Aug 28 , 2026 | 11:35 PM

విద్యుత్‌ వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కార న్యాయస్థానం(సీజీఆర్‌ఎఫ్‌) చైర్మన్‌, రిటైర్డ్‌ న్యాయమూర్తి డాక్టర్‌ బి.సత్యనారాయణ తెలిపారు.

విద్యుత్‌ వినియోగదారుల సమస్యలు సత్వర పరిష్కారం
విద్యుత్‌ వినియోగదారుల సమస్యలను విచారిస్తున్న సీజీఆర్‌ఎఫ్‌ చైర్మన్‌, రిటైర్డ్‌ న్యాయమూర్తి డాక్టర్‌ సత్యనారాయణ

బాధితులకు రూ.22.16లక్షలు పంపిణీ

సీజీఆర్‌ఎఫ్‌ చైర్మన్‌ డాక్టర్‌ సత్యనారాయణ

చింతపల్లి, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి):

విద్యుత్‌ వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కార న్యాయస్థానం(సీజీఆర్‌ఎఫ్‌) చైర్మన్‌, రిటైర్డ్‌ న్యాయమూర్తి డాక్టర్‌ బి.సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో రిగిన సీజీఆర్‌ఎఫ్‌ సమావేశంలో ఆయన విద్యుత్‌ వినియోగదారుల నుంచి 17 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా సీజీఆర్‌ఎఫ్‌ చైర్మన్‌ మాట్లాడుతూ 1912 టోల్‌ ఫ్రీ నంబరుకి కాల్‌ చేసి ఫిర్యాదు చేసుకోవచ్చునన్నారు. స్థానికంగా సమస్య పరిష్కారం జరగకపోతే ఈ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చునన్నారు. బిల్లింగ్‌ లోపాలు, విద్యుత్‌ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులు, మీటర్లు కాలిపోవడం, ఓల్టేజీ హెచ్చతగ్గులు, విద్యుత్‌ మీటర్ల లోపాలు, కొత్త విద్యుత్‌ కనెక్షన్‌, అదనపులోడు మంజూరు, తదితర సమస్యలను న్యాయస్థానం తక్షణమే పరిష్కారం చూపుతుందన్నారు. విద్యుత్‌ పంపిణీలో నష్టపోయిన బాధితులకు పరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. ఈఏడాది 616 ఫిర్యాదులు వచ్చాయని, వాటిలో 446 పరిష్కరించామన్నారు. అలాగే పరిహారం రూపంలో బాధితులకు రూ.22.16లక్షలు చెల్లించామన్నారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక సభ్యుడు ఎస్‌.రాజాబాబు, ఆర్థిక సభ్యుడు ఎస్‌.సుబ్బారావు, స్వతంత్య్ర సభ్యుడు ఎన్‌. మురళీకృష్ణ, స్థానిక ఈపీడీసీఎల్‌ ఈఈ ఎల్‌.పాత్రుడు, ఏడీ కె. సన్నిరాంబాబు, జి.మాడుగుల, చింతపల్లి, కొయ్యూరు, జీకేవీధి ఏఈఈలు ఎంవీ రమణ, ఎం.వెంకటేశ్వరరావు, నాగ సతీశ్‌, సూరిబాబు, జేఈ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 28 , 2026 | 11:35 PM