Share News

అరకులోయలో వంటగ్యాస్‌కు క్యూ

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:24 PM

అరకులోయలో వంట గ్యాస్‌ సమస్య తీవ్రరూపం దాల్చింది. మాడుగుల, ఎస్‌.కోటల నుంచే వచ్చే గ్యాస్‌వ్యాన్‌ల కోసం తెల్లవారు జాము నుంచే రోడ్లపై వినియోగదారులు పడిగాపులు కాస్తున్నారు.

అరకులోయలో వంటగ్యాస్‌కు క్యూ
అరకులోయలో గ్యాస్‌ కోసం బారులు తీరిన వినియోగదారులు

ఉదయం 5 గంటల నుంచే వేచి ఉన్న జనం

ఈకేవైసీ చేయడంతో గంటల తరబడి క్యూలో ఉన్న జనం

కమర్షియల్‌ సిలిండర్లను సరఫరా చేయాలని చిరు వ్యాపారులు డిమాండ్‌

అరకులోయ, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): అరకులోయలో వంట గ్యాస్‌ సమస్య తీవ్రరూపం దాల్చింది. మాడుగుల, ఎస్‌.కోటల నుంచే వచ్చే గ్యాస్‌వ్యాన్‌ల కోసం తెల్లవారు జాము నుంచే రోడ్లపై వినియోగదారులు పడిగాపులు కాస్తున్నారు. శనివారం ఎస్‌.కోట నుంచి వచ్చిన భారత్‌ గ్యాస్‌ వ్యాన్‌ను బోసుబెడ్డలో వినియోగదారులు బలవంతంగా నిలిపివేసి, సిలిండర్లను విడిపించుకున్నారు. అదేవిధంగా మాడుగుల నుంచి వచ్చిన భారత్‌ గ్యాస్‌ వ్యాన్‌ శనివారం ఉదయం 6 గంటలకే అరకులోయకు చేరుకుంది. దీంతో వినియోగదారులంతా క్యూ కట్టారు. ఇంతవరకు అరకులోయలో వినియోగదారులు ఈకేవైసీ చేయించకుండా గ్యాస్‌ సిలిండర్లను పొందేవారు. ప్రస్తుతం వంట గ్యాస్‌ కొరత రావడంతో ఈకేవైసీ చేయించుకున్నవారికే సిలిండర్లు ఇస్తామని సిబ్బంది చెప్పడంతో వినియోగదారులు గంటల తరబడి క్యూలో ఉన్నారు. ఈకేవైసీ అనంతరం సిలిండర్లను వినియోగదారులకు ఇచ్చారు. క్యూలో ఉన్న వారందరికీ గ్యాస్‌ సిలిండర్లు అందడంతో గొడవలకు ఆస్కారం లేకుండా పోయింది.

చిరు వ్యాపారుల ఇక్కట్లు

కమర్షియల్‌ వంట గ్యాస్‌ సిలిండర్లు నిలిపివేతతో చిరు వ్యాపారులు, చిన్న హోటళ్లు వారు ఆందోళన వ్యక్తం చేశారు. కమర్షియల్‌ సిలిండర్లు లేకపోవడంతో టీకొట్లు, టిఫిన్‌ సెంటర్లు, భోజన హోటళ్లు మూతపడ్డాయి. కమర్షియల్‌ సిలిండర్లు ఎందుకు తీసుకురాలేదంటూ గ్యాస్‌ ఏజెన్సీ వారిని చిన్న వ్యాపారులు నిలదీశారు. కమర్షియల్‌ సిలిండర్లు సరఫరా చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 14 , 2026 | 11:24 PM