పోర్టు అధికారులకు క్వార్టర్లు
ABN , Publish Date - Aug 05 , 2026 | 12:46 AM
విశాఖపట్నం పోర్టు ఆధునికీకరణ దిశగా దూసుకువెళుతోంది.
హార్బర్ పార్కు ఏరియాలో రూ.50 కోట్లతో నిర్మాణం
వాటికి పోను మిగిలిన రూ.6.97 ఎకరాలు వాణిజ్యం అవసరాల నిమిత్తం లీజుకు ఇవ్వాలని నిర్ణయం
అదనపు ఆదాయం సాధించేందుకు ప్రణాళిక
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం పోర్టు ఆధునికీకరణ దిశగా దూసుకువెళుతోంది. కొన్ని దశాబ్దాల క్రితం నిర్మించిన భవనాలను కూలగొట్టి కొత్తవి నిర్మిస్తోంది. పోర్టు ఏరియాలోని పాత డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్థలంలో పరిపాలనా భవనం పనులు ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు పోర్టు అధికారుల కోసం క్వార్టర్ల నిర్మాణానికి నడుం కట్టింది.
ఆర్కే బీచ్‌రోడ్డుకు సమీపాన హార్బర్ పార్క్ ఏరియాలో పోర్టు చైర్మన్, డిప్యూటీ చైర్మన్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, ఇతర సీనియర్ అధికారులకు క్వార్టర్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో పోర్టుకు 13 ఎకరాలు ఉంది. అందులో పోర్టు డిప్యూటీ చైర్మన్, చీఫ్ విజిలెన్స్ అధికారులకు, సీనియర్ అధికారులకు తాజాగా రూ.50 కోట్ల అంచనా వ్యయంతో బంగ్లాలు, బహుళ అంతస్థుల భవనాలు (అపార్టుమెంట్లు) నిర్మిస్తున్నారు. వాటికి ఉపయోగించుకోగా మిగిలిన ఏడు ఎకరాల స్థలాన్ని వాణిజ్య అవసరాలకు లీజుకు ఇచ్చి అదనపు ఆదాయం ఆర్జించాలని పోర్టు యాజమాన్యం నిర్ణయించింది. నిరర్ధకంగా ఉన్న స్థిరాస్తుల నుంచి ఆదాయం సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించడంతో గత కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న భూములను పోర్టు లీజుకు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో శాలిగ్రామపురంలో ఇన్‌ఆర్బిట్ మాల్ యాజమాన్యం లీజుపై భూములు తీసుకుని షాపింగ్ మాల్ నిర్మించింది. ఇప్పుడు క్వార్టర్ల నిర్మాణం పూర్తయిన తరువాత మిగిలిన ఎనిమిది ఎకరాలను వాణిజ్య అవసరాలకు లీజుకు ఇవ్వనున్నారు. ఈ భూములకు ఎదురుగానే రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐఐసీకి చెందిన 13 ఎకరాలను లులూ మాల్‌కు లీజుకు ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే స్థాయిలో పోర్టు భూములకు కూడా డిమాండ్ ఉంటుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
క్వార్టర్ల నిర్మాణం ఎలాగంటే...?
- పోర్టు డిప్యూటీ చైర్మన్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్లకు రెండు డ్యూప్లెక్స్ బంగ్లాలు నిర్మించనున్నారు. వాటిలో గ్రౌండ్ ఫ్లోర్ 233 చ.మీ., మొదటి అంతస్థు 183 చ.మీ. ఉంటుంది.
- ఇదే ఆవరణలో సీఐఎస్‌ఎఫ్ అధికారులకు కూడా క్వార్టర్లు నిర్మిస్తారు. గ్రౌండ్+తొమ్మిది అంతస్థుల్లో టవర్లు నిర్మిస్తారు. అందులో ప్రతి ఫ్లోర్‌లో 256 చ.మీ. స్థలం అందుబాటులో ఉంటుంది.
- 200 చ.మీ. విస్తీర్ణంలో రిక్రియేషన్ క్లబ్ ఏర్పాటుచేస్తారు.
- ల్యాండ్ స్కేపింగ్, పార్కింగ్ ఏరియా, పిల్లల ప్లే ఏరియా, కామన్ వినియోగం కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి.
మిగులు భూమి 6.97 ఎకరాలు
సీఐఎస్‌ఎఫ్ కమాండెంట్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, ఇతర ఉన్నతాధికారుల కోసం ఇప్పుడు 2.47 ఎకరాల విస్తీర్ణంలో భవనాలు ఉన్నాయి. కొత్త నిర్మాణాలు పూర్తయిన తరువాత వాటన్నింటినీ కూలగొడతారు. అదేవిధంగా సీనియర్ అధికారుల క్వార్టర్లు 4.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. కొత్తగా అపార్టుమెంట్ల నిర్మాణం పూర్తయిన తరువాత పాత భవనాలను కూలగొడతారు. దీనివల్ల మొత్తం 6.97 ఎకరాల భూమి అందుబాటులోకి వస్తుంది. దీనిని వాణిజ్య అవసరాలకు లీజుకు ఇచ్చి అదనపు ఆదాయం పోర్టుకు లభించేలా ప్రణాళిక తయారు చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
నిర్మాణ బాధ్యతల అప్పగింత
హార్బర్ పార్క్ ఏరియాలో కొత్త బంగ్లాలు, అపార్టుమెంట్ టవర్ నిర్మాణ బాధ్యతలను సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్‌కు అప్పగించారు. ఆ సంస్థ జేకే ఎలక్ట్రికల్స్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ ఏడాది జనవరి 20న ఒప్పందంపై సంతకాలు చేశారు. అక్కడి నుంచి 600 రోజుల్లో ఈ నిర్మాణాలు పూర్తిచేసి అప్పగించాల్సి ఉంది.