Share News

రాజ్‌మా విత్తనాలకు నాణ్యతా పరీక్షలు

ABN , Publish Date - Aug 21 , 2026 | 12:17 AM

గిరిజన ప్రాంత రైతులకు పంపిణీ చేయనున్న రాజ్‌మా విత్తనాల నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తున్నామని స్థానిక ఏడీఏ బీవీ తిరుమలరావు అన్నారు. గురువారం చౌడుపల్లి రైతు సేవా కేంద్రాన్ని సందర్శించిన ఆయన రాజ్‌మా విత్తనాల ప్రయోగాత్మక మొలకలను పరిశీలించారు.

రాజ్‌మా విత్తనాలకు నాణ్యతా పరీక్షలు
రైతు సేవా కేంద్రాలకు ఏపీ సీడ్స్‌ పంపించిన రాజ్‌మా విత్తనాలు

97 శాతం మొలకలు

వారం రోజుల్లో రైతులకు పంపిణీ

ఏడీఏ బీవీ తిరుమలరావు

చింతపల్లి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంత రైతులకు పంపిణీ చేయనున్న రాజ్‌మా విత్తనాల నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తున్నామని స్థానిక ఏడీఏ బీవీ తిరుమలరావు అన్నారు. గురువారం చౌడుపల్లి రైతు సేవా కేంద్రాన్ని సందర్శించిన ఆయన రాజ్‌మా విత్తనాల ప్రయోగాత్మక మొలకలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా 90 శాతం రాయితీపై రాజ్‌మా విత్తనాలను పంపిణీ చేస్తున్నదన్నారు. రైతులకు ఏపీ సీడ్స్‌ విత్తనాలను సరఫరా చేస్తున్నదన్నారు. ఏపీ సీడ్స్‌ సరఫరా చేసిన విత్తనాల నాణ్యతను వారం రోజులుగా పరీక్షిస్తున్నామని తెలిపారు. ఏపీ సీడ్స్‌ సరఫరా చేసిన విత్తనాల నమూనాలను ట్రేల్లో నాట్లు వేశామన్నారు. 97 శాతం విత్తనాలకు మొలకలు వచ్చాయన్నారు. తుది దశ పరీక్షలు పూర్తి చేసి వారం రోజుల్లో రైతులకు విత్తనాలను పంపిణీ చేస్తామన్నారు. గిరిజన రైతులు రాజ్‌మా పంటను ముందస్తు రబీ పంటగా సాగు చేసుకుంటున్నారని తెలిపారు. రైతులకు ఈ ఏడాది ప్రభుత్వం ముందుగానే విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. రైతులకు రాయితీపై విత్తనాలను డీ కృషి యాప్‌ సహాయంతో పారదర్శకంగా పంపిణీ చేస్తామన్నారు. రైతులకు చింతపల్లి రెడ్‌ రకం విత్తనాలు వచ్చాయన్నారు. జిల్లాలో ఈ ఏడాది వ్యవసాయశాఖ 4,900 క్వింటాళ్ల రాజ్‌మా విత్తనాలను పంపిణీ చేస్తుందని చెప్పారు. అదనంగా మరో రెండు వేల విత్తనాల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపించామన్నారు. గత ఏడాది రాజ్‌మా సాగు విస్తీర్ణం 15 శాతం పెరిగిందన్నారు. ఈ ఏడాది మరో 20 శాతం సాగు విస్తీర్ణం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రైతులు నాట్లు వేసిన నాటి నుంచి పంట కోసే వరకు వ్యవసాయశాఖ సాంకేతిక సహకారం అందిస్తుందన్నారు. ఈకార్యక్రమంలో వ్యవసాయాధికారి టి. మధుసూదనరావు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2026 | 12:17 AM