Share News

విద్యుత్‌ సరఫరాలో నాణ్యతే లక్ష్యం

ABN , Publish Date - Aug 29 , 2026 | 12:39 AM

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడానికి సుమారు రూ.1,800 కోట్లతో పనులు చేపడుతున్నామని, వాటిపై విస్తృత ప్రచారం చేయాలని అధికారులకు ఈపీడీసీఎల్‌ సీఎండీ పృథ్వీతేజ్‌ సూచించారు.

విద్యుత్‌ సరఫరాలో నాణ్యతే లక్ష్యం

రూ.1,800 కోట్లతో పనులు

అంతరాయాలపై వినియోగదారులకు ముందుగానే సమాచారం ఇవ్వాలి

ఈపీడీసీఎల్‌ సీఎండీ పృథ్వీతేజ్‌

విశాఖపట్నం, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి):

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడానికి సుమారు రూ.1,800 కోట్లతో పనులు చేపడుతున్నామని, వాటిపై విస్తృత ప్రచారం చేయాలని అధికారులకు ఈపీడీసీఎల్‌ సీఎండీ పృథ్వీతేజ్‌ సూచించారు. కార్పొరేట్‌ కార్యాలయంలో ఉన్నత స్థాయి అధికారులకు రెండు రోజుల వర్క్‌షాపును శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్‌ యుగంలో కొద్ది నిమిషాల పాటు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగినా వినియోగదారులు తీవ్రంగా స్పందిస్తున్నారన్నారు. ఎక్కడైనా నిర్వహణ పనులు, లైన్‌ క్లియర్లు, అంతరాయాలు ఉంటే ముందుగానే దానిపై ఆ ప్రాంత వినియోగదారులకు తెలియజేయాలని, సోషల్‌ మీడియాను దీనికి ఉపయోగించుకోవాలన్నారు. అదే విధంగా పెరుగుతున్న అవసరాలు, డిమాండ్‌కు అనుగుణంగా కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం, అదనపు ట్రాన్సఫార్మర్ల ఏర్పాటు, భూగర్భ విద్యుత్‌ కేబుల్‌ వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. విద్యుత్‌ బిల్లుల చెల్లింపుల్లో డిజిటల్‌ విధానాలు మరింత ముందుకు తీసుకువెళ్లాలని, ప్రస్తుతం ఆఫ్‌లైన్‌ ద్వారా జరుగుతున్న 25 శాతం చెల్లింపులను సున్నాకు తీసుకురావాలన్నారు. సౌర విద్యుత్‌ వినియోగాన్ని మరింత విస్తృతం చేయాలని, వర్చువల్‌ నెట్‌ మీటరింగ్‌ విధానంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రధాన మంత్రి సూర్యఘర్‌ పథకం కింద కేంద్రం రాయితీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.20 వేల అదనపు రాయితీ ప్రయోజనాలు వెనుకడిన వర్గాలు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ సూర్యప్రకాశ్‌, ప్రాజెక్టులు, హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌ వనజ, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ ఎస్‌.హరిబాబు, సీజీఎంలు, 11 సర్కిళ్లకు చెందిన సూపరింటెండెంట్‌ ఇంజనీర్లు, ఈఈలు, పాల్గొన్నారు.

Updated Date - Aug 29 , 2026 | 12:39 AM