Share News

గిరిజనులకు నాణ్యమైన వైద్యం

ABN , Publish Date - May 29 , 2026 | 10:41 PM

గిరిజనులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు.

గిరిజనులకు నాణ్యమైన వైద్యం
ప్రభుత్వ ఆస్పత్రి వద్ద రోగులతో మాట్లాడుతున్న మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

వైద్య సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించమని హెచ్చరిక

మెడికల్‌ కాలేజీలో ఏటా వంద సీట్లు భర్తీ

ఆస్పత్రుల్లో ఓపీ పెరిగింది.. కేజీహెచ్‌కు రిఫర్లు తగ్గాయి..

పాడేరు, మే 29 (ఆంధ్రజ్యోతి):

గిరిజనులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గిరిజనులకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నదన్నారు. వాస్తవానికి పాడేరు మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి రూ.500 కోట్లు మంజూరు చేస్తే 2024 వరకు కేవలం రూ.117 కోట్లు మాత్రమే వ్యయం చేసి అరకొరగా భవన నిర్మాణాలు జరిగాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి తర్వాత మెడికల్‌ కాలేజీపై ప్రత్యేక శ్రద్ధ కనబరచి, గత బకాయిలను చెల్లించామన్నారు. తర్వాత బడ్జెట్‌ను విడుదల చేసి నిర్మాణ పనులను వేగవంతం చేశామన్నారు. అయినప్పటికీ 50 శాతం పనులు జరిగాయన్నారు. గతంలో 50 సీట్లతో మొదలైన కాలేజీలో ఇప్పుడు ఏడాదికి 100 సీట్లు భర్తీ జరుగుతుందన్నారు. గిరిజన ప్రాంతంలో వైద్య సేవలతోపాటు వైద్య విద్యను మరింతగా బలోపేతం చేస్తామని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు.

సేవలపై ప్రజల్లో సంతృప్తి స్థాయిని పెంచాలి

రోగులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రజల్లో సంతృప్తి స్థాయిని పెంచాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ సూచించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో సైతం చక్కని వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. వైద్య వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని, ఇదే క్రమంలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై ఉదాసీనంగా వ్యవహరించబోమని ఆయన హెచ్చరించారు. జిల్లాలోని పాడేరు, అరకులోయ, చింతపల్లి ఆస్పత్రుల్లో సైతం ఓపీ సేవలు పెరిగాయన్నారు. గత రెండేళ్లతో పోల్చితే ఓపీ పెరిగిందన్నారు. గతంలో నెలలో లక్షన్నర మంది ఓపీ ఉండగా.. ప్రస్తుతం రెండున్నర లక్షలకు పెరిగిందన్నారు. గతంలో నెలలో 600 మంది రోగులను ఇక్కడి నుంచి కేజీహెచ్‌కు రిఫర్‌ చేసేవారని, ఆ సంఖ్య ప్రస్తుతం 250కు తగ్గిందన్నారు. భవిష్యత్‌లో ఒక్క రోగిని కేజీహెచ్‌కు తరలించకుండా ఇక్కడే అవసరమైన వైద్య సేవలందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. అరకులోయ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో రూ.231 కోట్లతో 441 విలేల్‌ హెల్త్‌ క్లీనిక్‌లు, 27 పీహెచ్‌సీలకు భవనాలను నిర్మించాలని నిర్ణయించామన్నారు. అలాగే 108, 104, ఫీడర్‌ అంబులెన్సుల మధ్య సమన్వయంతో మరింత నాణ్యమైన సేవలందించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా ముందడుగు వేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. అనంతరం ఆయన స్థానిక ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిని సందర్శించి, అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి, జాయింట్‌ కలెక్టర్‌ టి.పూజ, మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు, వైద్యారోగ్యశాఖ అధికారులు, బీజేపీ నేతలు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2026 | 10:41 PM